Home తాజా వార్తలు పండగలాంటి జీవితం

పండగలాంటి జీవితం

Life

 

మంచుకు తడిసిన పారిజాతాలు పచ్చని ఆకుల మధ్యన నక్షత్రాల్లా పరుచుకుని ఉన్నాయి. ఒక్కో పువ్వు శబ్దం లేకుండా రాలుతుంది. కిటికీ అద్దం లోంచి చూస్తున్నారు మూర్తి, మానస.
“ సో యూరప్ ట్రిప్ పూర్తయింది. ఇప్పుడైనా పిల్లల దగ్గరకు వెళ్లి ఉందామా?” అంది మానస.
“నీకు చూడాలని ఉంటే రెండు రోజులు వెళదాం. వెళ్లి ఉండటం ఎందుకు? ”
“ ఇంక పిల్లలతో ఉందాం. మనవళ్లు… కోడళ్లు…’
“ నీకు తెలుసా మానసా… నేను రిటైర్ అయి తొమ్మిదేళ్లు. తీరిక లేకుండా ఉన్నాను. ముందే ఎన్నో ప్లాన్స్ నా మనసులో. పిల్లలకు చదువు సంధ్య నేర్పించాం. వాళ్లు స్థిరపడ్డారు. వాళ్ల జీవితంలో వాళ్లని ఉండనిద్దాం. అది వాళ్ల కుటుంబం, వాళ్ల స్వేచ్ఛ. మనమెందుకు ఇబ్బంది పెట్టాలి?”

“ మీదంతా వితండం… ఎవరైన కృష్ణా రామా అనుకుంటూ పిల్లలతో…”
“‘ మానసా… ఇప్పుడు కృష్ణారామా అని అనకు ప్రశాంతంగా ఉండు.
దేవాలయం, దేవుళ్లు, భోజనాలూ అన్నీ నీ ఇష్టం…కానీ ఎవరితోనూ కలిసి ఉండటం అన్నది మాత్రం ఆలోచించకు. మారుతున్న ప్రపంచం చూడడం నేర్చుకో, ఇవ్వాళ్టి రోజుల్లో ఎవరు ఎవరితోనూ సుఖంగా ఉండలేరు.
ఈ పదేళ్లుగా వాళ్లకు దగ్గరగా, మన ఇంట్లో ఉన్నాం. ప్రతివారం కలిసి భోజనం చేస్తున్నాం. అవసరం అయితే సాయంగా ఉంటున్నాం. ఇంకేం కావాలి?”
“ ఇరుగు పొరుగు వాళ్లలాగే కదా”

“ అంతకంటే ఏం చేయాలి మానసా. ఎదిగిన పిల్లలు, వాళ్ల పిల్లలు వాళ్ల భోజనపు అలవాట్లు, టైమింగ్స్ మనకెలా కుదుర్తాయి. ఇది వరకు నా ఆఫీస్ టైమింగ్స్ మన ఇంట్లో నీకు, పిల్లల వేళల్లాగే ఉండేవి. ఇప్పుడు ఉద్యోగం అయిపోయింది. ప్రశాంతంగా మితంగా నూనె, నెయ్యి లేకుండా తింటాం. వాకింగ్‌కు వెళతాం. ఇలా వాళ్లతో అయితే కుదిరేనా చెప్పు”
“అవునూ, అబ్బాయి, కోడలు తొందరగానే ఆఫీస్‌లకు పోతారు. పిల్లలకు స్కూల్లోనే అల్పాహారం. ఉదయం వాళ్లింట్లో ఏవీ వండుకోరు”“ మరి మనమే తినాలి. మన కోసం తయారు చేయటం కష్టం కదా!”

“ మరి చూడు పోయిన నెల మొత్తం మనం ఆరోగ్యం చెకప్ కోసం టైమ్ పెట్టుకున్నాం. కనీసం వారం రోజులు ముందే ఆరోగ్య బీమా ఉంది కాబట్టి ఇద్దరివీ కలిపి లక్షరూపాయలు దాటాయి. ప్రతిరోజూ ఉదయం బయలు దేరిపోయాం. క్యాబ్ ఖర్చు పాతికవేలయింది. లంచ్, డిన్నర్ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నాం. అంటే మన పని మనం చేసుకున్నాం. ఎవరికీ ఇబ్బంది లేదు. ఎవరు వద్దనలేదు. దీని కోసం నేనెంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాను. సంవత్సరాల తరబడి హెల్త్ పాలసీ కోసం డబ్బు కట్టాను.
“ అవును నిజమే మా రాఘవులు అన్నయ్య రిటైర్ అయ్యాక ఆ లాభాలు మా ఊర్లో ఇల్లు అమ్మిన డబ్బు కొడుకులు ఇళ్లు కట్టుకుంటానంటే ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆస్పత్రి ఖర్చు ఏదైనా వస్తే వాళ్ల పిల్లలు చాలా చిరాకు పడుతున్నారు. అస్తమానం నీకు ఆస్పత్రి ప్రతి చిన్నదానికీ డాక్టర్ను చూడాలని అంటారు అని ఎంతో తగువులాడారట. మనతో పాటు జనరల్ చెకప్‌కి వస్తానన్న రోజు వాళ్లింట్లో చాలా గొడవ జరిగింది”.
“ నేనదే చెబుతున్నా మానసా. వృద్ధాప్యం ప్రతివాళ్లకీ తప్పని సరి. పిల్లలకు వాళ్ల జీవితాలు వాళ్లకి ఉంటాయి. వాళ్ల పిల్లలు ఎదిగే వయసుకు, చదువు, ఖర్చులు, ఇంట్లో ఖర్చు అన్నీ ఉంటాయి. వాళ్లకు భారంగా మనం ఉండిపోవడం ఎంత వరకు భావ్యం.
“ మరి పిల్లలకు బాధ్యత లేదా? మరీ చెప్తారు వాళ్లు చూసుకోవద్దా!”

“ఆ ఆలోచన నుంచి బయటకు రావా? పిల్లల్ని మనం కన్నాం, పెంచడం మన బాధ్యత. అది పిల్లలు చూస్తారా! వాళ్లకు మోయలేని భారం మిగలటం తప్పుకదా ఇప్పుడు సరిగ్గా మన జీవనం కోసం సరిపోయేలాగా ఉన్నాయి సేవింగ్స్. యూరప్ ట్రిప్ కోసం నేను ఇరవై ఏళ్లపాటు చిన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తూ వచ్చాను. వదినవైపు వాళ్లకే అప్పు ఇచ్చాడు. వాళ్లు కాస్త వ్యాపారంలో నష్టాలొచ్చి చేతులు ఎత్తేశారు. మీకు అప్పుడు చెబుతూనే ఉన్నాను. అలాంటి అత్యాసలు వద్దు. డబ్బు బ్యాంక్‌లోనూ ఫిక్స్‌డ్‌లోనో పెట్టుకోవాలి. వడ్డీ రూపంలో అప్పుడు ఎక్కువ డబ్బే కనబడేది. నాకు ఎన్నిసార్లు అనిపించింది. అలా మనం కూడా ఓ ఐదారు లక్షలు వడ్డీకి ఇస్తే చేతినిండా డబ్బు ఉండేది కదా అని.
“ నాకప్పుడు అది కరెక్ట్ అనిపించలేదు. వడ్డీలు, చిట్టీలు నాకు ముందు నుంచి నచ్చలేదు. నా పెన్షన్‌గా వచ్చే పాతిక వేలు నాకు చాలు”.

“ఎక్కడా.. అందులోనూ పొదుపే కదా! పిల్లలకు, మనవలకి, చుట్టాలకి ప్రతినెలా ఏదో ఒక గిఫ్ట్ కొంటారు. అంత అవసరమా?”
“ కాదా చెప్పు. మనం ఉన్నామన్నా ఉనికి చెప్పేది అదే కదా! నా మనుమడికి నేనిచ్చే ఒక్క చాక్లెట్, కొడుకిచ్చే కొనే ఒక మంచి పుస్తకం, వాడికోసం కట్టే పేపర్ బిల్లు, కోడలికి ఇష్టమైన పర్‌ఫ్యూమ్, చెప్పులు ఇవన్నీ ఇవ్వకపోతే వాళ్లకు నష్టం లేదు. కానీ నాకు ఇష్టం, నా ప్రేమను చూపించే మార్గం. రాత్రి మీ అన్నయ్య కోసం నట్స్ కొన్నావు. బాదం పప్పులు, కిస్‌మిస్ ఆయనకు చాలా ఇష్టమనేకదా! అవి ఇవ్వటం వల్ల నీకెంత సంతోషం కలిగింది. ఒక ఫ్రెండ్‌ని పలకరించి బావున్నావా అని అడిగి వాళ్లకి ఇష్టం అయిన వస్తువు చేతిలో పెడితే ఎంత బావుంటుందీ ఇవి అవసరం.

మానవ సంబంధాలు చక్కగా ఉంచుకోవటం చాలా అవసరం. అందుకే ప్రతివాళ్లతో టచ్‌లో ఉంటాను నీకు తెలుసా! నాకీ మధ్య చాలా మతిమరుపు వస్తోంది. పేర్లు మర్చిపోతున్నా… మరీ దగ్గరవాళ్ల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు మర్చిపోతున్నా, అబ్బాయి పుట్టినరోజు గుర్తు రాలేదు. అప్పటి నుంచి అతిగా ఆ టెలిఫోన్ డైరెక్టరీ దగ్గర అందరి పేర్లు, అడ్రస్‌లు, వాళ్ల బర్త్‌డేలు, ముఖ్యమైన పండగలు అన్నీ రాసి పెట్టాను. ముందే డేట్స్ వేసి ఉంచాను. ఫలానా డిసెంబర్ మూడో తేదీ తీసి చూడు, ఎవరెవరి ముఖ్యమైన విషయాలు ఉంటాయి. డిసెంబరు మూడు అన్నాను కదా నీ బర్త్‌డే, మనవడు హాస్టల్ నుంచి వస్తాడు. మా కొలీగ్ రామూని మన ఇంటికి భోజనానికి పిలిచాను. ఇవన్నీ రాసి పెట్టుకుంటున్నా. మళ్లీ మరచిపోయి అయ్యో అనుకోవటం ఎందుకు అనీ! అన్నట్లు మన ఫ్యామిలీ డాక్టర్ పలకరించి ఎలా ఉన్నారు అని అడిగే రోజు కూడా అదే. ఆయనతో ప్రతి మూడవ తేదీ కాస్సేపు కబుర్లు చెపుతుంటాను”
“ బాబోయ్ జీవితం కూడా ఒక ఉద్యోగం లాగే చేస్తారేం మీరు.”

“ కదా మరి. ఇంకా శ్రద్ధగా చేస్తున్నా, తప్పకుండా రోజు షేవ్ చేసుకుంటూ ఇస్త్రీ బట్టలు వేసుకుంటాను, నువు కూడా కదా! బాగా తయారవుతాం. సెలబ్రేషన్ అంటే ఇదే కదా! ఇదిగో టేబుల్‌పైన ఎప్పుడు బయటకి వెళ్లినా నా వాచ్, కళ్లజోడు, ఇంటి తాళాలు , టార్చిలైట్, నా వాకింగ్ స్టిక్ అన్నీ రెడీ. నాకు ఇప్పుడు 70ఏళ్లు ఇంట్లో కెమెరాలు ఫిక్స్ చేశారు. అబ్బాయి సలహానే అనుకో. ఈ హాలు ఎప్పుడూ అబ్బాయి పర్యవేక్షణలో ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదా!
ఇద్దరం పెద్దవాళ్లం. ఇంట్లో పనివాళ్లు, కాసినో, కూసినో, ఖరీదైన సామాన్లు, నీ మెడలో ఒకటో రెండో నగలు. వీటికోసం మనకు సమస్య తేకూడదు ఎవ్వళ్లూ… నా జాగ్రత్తలో నేనుంటాను మరి’

“అబ్బాయి చాలా బాధ పడ్డాడు. మీ బ్యాంక్ అకౌంట్స్‌లో నామినీగా వాడి పేరు చేర్చారట. ఇపుడు కొత్తగా మార్పులేం చేశారు మరి. అదేనయ్యా చెపుతాను ఎప్పటికప్పుడు గడిచే ప్రతిరోజూ మనకు దొరికే అదనపు బహుమతి. ఎప్పుడు పోతామో తెలియదు. మనం వెళ్లిపోయాక పిల్లలకు ఎలాంటి చిక్కులు ఉండకూడదు. కాసినో కూసినో మన వార్ధకం కోసం దాచుకున్నాం. దానిని సవ్యంగా పిల్లలకు చేర్చాలి కదా! మనకి గడిచిపోతుంది. మిగిలినవి వాళ్లకు చెందేలా ఏర్పాటు చేశాను. అన్నట్లు నీ పేరిట కొంత సొమ్ము డిపాజిట్ చేసి పెట్టాను. వివరాలన్నీ రాసి నీ పాస్‌బుక్ నీ బీరువాలో ఉంచేను చూసుకో. ఏమో నీకంటే నేనే ముందు వెళ్లిపోతానేమో. నీకు ఇబ్బంది రాకుండా, పిల్లలకు భారం కాకుండా, నా భార్యగా నాకు ఎంతో సంతోషం పంచినందుకు నీకు ఇవ్వగలిగే ఆఖరి గిఫ్ట్ అది.”
‘అయ్యో అవేం మాటలండీ?”

“ తప్పులేదు. నీ డైరీలో ఆఖరు పేజీలో ఈ వివరాలన్నీ ఉంటాయి చదువుకో. హాయిగా ఉందాం మనవల్ల పిల్లలకు, ప్రపంచానికీ ఎలాంటి కష్టం రావద్దు. జీవితం నా దృష్టిలో పండగ… అలా పండగ లాగే ఉండాలి చివరి దాకా!! ”

Life like a Festival