Home తాజా వార్తలు తండ్రికి భారమైన ఇద్దరు కుమారుల జీవనం…

తండ్రికి భారమైన ఇద్దరు కుమారుల జీవనం…

Father

 

కొత్తకోట : కన్న ఇద్దరుకుమారుల జీవితం తండ్రికి భారమై ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న సంఘటన కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని అమడబాకుల గ్రామానికి చెందిన హరిజన పెంటయ్య, తిలకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెంటయ్య భార్య 9 ఏళ్ల క్రితం మృతి చెందడంతో ఇద్దరు కుమారుల పోషణ భారాన్ని తండ్రి చూసు కుంటున్నారు. ఆంజనేయులు (23), శ్రీనివాసులు (19) పుట్టినప్పటి నుండి శారీరకంగా, బలహీనంగా ఉన్నారు. తల్లి తిలకమ్మ 44వ జాతీయ రహదారి సమీపంలో గల డాబాలో పని చేస్తుండేది. గత 9 ఏళ్ల క్రితం ఆమె రోడ్డుప్రమాదానికి గురై మృతి చెందింది.

అప్పటి నుండి తండ్రి పెంటన్న, వృద్దాప్య దశలో ఉండడంతో పని చేయలేక గ్రామం సమీపంలో గల, ఖాళీ ప్రదేశాల్లో మధ్యం తాగి పడేసిన ఖాళీ సీసాలను ఒక దగ్గరకు చేర్చి పాత ఇనుప సామాన్ షాపువాళ్లకు విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలు శారీరకంగా, బలహీనంగా ఉండడంతో ఇద్దరి కుమారుల అవయవాలు బలంగా లేవు. తల్లి మృతి చెందినప్పటి నుండి పిల్లల జీవనం ముందుకు సాగకపోవడంతో పెంటన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం నుండి వస్తున్న ఆసరా పెన్షన్ చాలడం లేదన్నారు. ఇరువురి కుమారుల అవయవాలు సత్తుబడడంతో వికలాంగుల పెన్షన్ కుమారులకు రావడం లేదన్నారు. గత ఏడాది క్రితం సదరం క్యాంపుకువెళ్లగా శ్రీనివాసులుకు సదరం సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. కాని పెన్షన్ రాలేదన్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇద్దరి కుమారులకు పెన్షన్ అందజేయాలని పెంటన్న కోరారు. కుటుంబ పోషణ కోసం సహాయం అందజేయాలని ఆయన కోరారు.

ప్రభుత్వం దివ్యాంగుల కుటుంబాన్ని ఆదుకోవాలి..
ఆంజనేయులు, శ్రీనివాసులుకు వికలాంగుల పెన్షన్ అందజేయాలి..
మండల పరిధిలోని అమడబాకుల గ్రామంలో గత 19 ఏళ్ల కు పైగా శారీరకంగా, మానసికంగా జీవనం గడుపుతున్న ఆంజనేయులు, శ్రీనివాసులు అనే ఇద్దరు అన్నదమ్ములను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజి వార్డు సభ్యులు శంకర్ కోరారు. తల్లి గత 9 ఏళ్ల క్రితం మృతి చెందింది. వారికి సరైన పౌష్టికాహారం లేకపోవడంతో బలహీనంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇద్దరికి దివ్యాంగుల పెన్షన్ అందజేయాలని ఆయన కోరారు. వికలాంగులకు వైద్య చికిత్స చేయించాలని ఆయన కోరారు.

 

Life of two Sons who are Burden to Father