Home తాజా వార్తలు భానుడి భగభగ బత్తాయి విలవిల

భానుడి భగభగ బత్తాయి విలవిల

అడుగంటిన భూగర్భజలాలు
ఎండిపోతున్న నిమ్మ, బత్తాయి తోటలు
నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో దిక్కుతోచని రైతులు, నిరంతర విద్యుత్ ఉన్నా ఫలితం లేక పరితాపం

Orange

 

మన తెలంగాణ/తుంగతుర్తి: ఒక పక్క భానుడి భగభగ, మరో పక్క ఏనాడో అడుగంటిన భూగర్భ జలాలతో ఎండి పోతున్న బోర్లు, బావులు వెరసి సంవత్సరాల తరబడి కష్టించి పెంచిన బత్తాయి, నిమ్మ తోటలు నీళ్ళు లేక నిట్టనిలువుగా ఎండి పోతున్న తీరుతో బత్తా యి, నిమ్మతోటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆవేదనకు ఆందోళనకు గురవుతున్నారు. గత నాలుగైదేళ్ళుగా వరుణుడు మొహం చాటేయడంతో భూగర్భ జలాలు పాతాళానికి చేరి బోర్లు నీరు లేక వట్టి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి మండలంలో పలు గ్రా మాలలో ఇప్పటికే బత్తాయి తోటలు చా లా వరకు ఎండి పోవడంతో తీసి వేయ డం జరిగింది. అలాగే ఉన్న కొద్ది పాటి బత్తాయి తోటలకు చాలినంత నీరు లేక రోజు రోజుకు  చెట్లు ఎండిపోతుండడం కనిపిస్తోంది. ముఖ్యంగా తుంగతుర్తి మండలంలో తుంగతుర్తి ,కర్విరాల, కొత్తగూడెం , రావులపల్లి ,గొట్టిపర్తి , వెలుగుపల్లి, అన్నారం , తదితర గ్రామాలలో రైతులు బత్తాయి నిమ్మ మామిడి తోటలను గత కొద్ది సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున పెంపకం చేపట్టారు. మామిడి తోటలకు నీటి ఎద్దడి ఉన్నా తట్టుకునే శక్తి కొంత మేర ఉంటుంది. కాత సరిగా రాకపోవడం వచ్చిన కాయలు మంచి సైజు కాకపోవడం మాత్రం జరుగుతుంది.

మామిడి చెట్లు అడపా దడపా కురిసే అకాల వర్షాలకైన బతుకుతాయి కానీ, బత్తాయి ,నిమ్మ చెట్లకు మాత్రం చెట్ల మొదళ్ళలో తడి ఆరకుండా నీరు అందించాల్సి ఉంది . కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా వర్షాలు లేక వివిధ గ్రామాలలోని తోటలకు భారీ నష్టం ఏర్పడింది. లక్షలాది రూపాయలు వెచ్చించి పెంచిన బత్తాయి, నిమ్మతోటలకు తీవ్ర నీటి ఎద్దడి విఘాతం కలిగించింది. విద్యుత్ సరఫరా సక్రమంగా సాగుతున్నా బోర్లలో నీరు లేక విద్యుత్ సరఫరా ఉన్నంత సేపు చెట్లకు నీళ్ళు కట్టినా రోజుకు ఒకటి రెండు చెట్ల కన్నా ఎక్కువ నీరు పారడం లేదని కర్విరాలలకు చెందిన వెలుగు శ్రీను అంటున్నారు. తమ తోటలే కాకుండా ఇతర రైతుల తోటలను బత్తాయి ,నిమ్మ తోటలను తాము కౌలుకు తీసుకున్నామని కనీసం పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి కూడా కానరాడం లేదని వెలుగు భాస్కర్ అనే రైతు చెప్తున్నారు. మార్కెట్‌లో నిమ్మ, బత్తాయికి గిరాకీ ఉన్నా తమ తోటలలో కాత లేదు సరికదా ఉన్న చెట్లు ఎండి పోతున్నాయని సోమేశ్వర్ అనే రైతు అంటున్నారు. తమకు ఉన్న 300 నిమ్మ చెట్లు సరియైన నీరు లేక కాసిన కొద్దిపాటి కాయలు ఎదగడం లేదని పిందెలు ఎండవేడికి మాడి రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటిల్లి పాది చెట్లకోసం అనునిత్యం కష్టం చేస్తామని కానీ తమ కష్టం నీరు లేక వృధా అయిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిమ్మతోటలో ఇప్పటికే నాలుగు బోర్లు వేశానని ఏ ఒక్క బోరులో చుక్క నీరు రాలేదని శ్రీను , సోమేశ్వర్ అనే రైతులు చెప్తున్నారు. గతంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎండి పోయాయని కనీసం కాత లేకున్నా చెట్లనయినా బతికించడానికి తాము విశ్వ ప్రయత్నం చేస్తున్నామని అందులో భాగంగా తమకున్న తోటలో కొంత భాగాన్ని వదిలి వేసి కొన్ని చెట్లన్నా బతికించడానికి ఉన్న కొద్దిపాటి నీటిని ఆచెట్ల వరకే తడులు అందిస్తున్నామని వెలుగు భాస్కర్ తెలిపారు. ఇప్పటికే తన ఎకరం నిమ్మ తోట ఎండి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మామిడి ,నిమ్మ ,బత్తాయి తోటలపై పూర్తి స్థాయిలో నష్టం వచ్చిందని కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేమార్గం లేదని ఆయా తోటల రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మాసం లో ఇప్పటికే ఎండ వేడి 40 డిగ్రీలకు పైగా ఉంటోందని ఏప్రిల్ చివరి వారం అలాగే మే నెలలో భానుడి భగభగతో ఉన్న చెట్లు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందనేది రైతుల మాట .

వరుసగా నాలుగైదు ఏళ్ళుగా ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులు తుంగతుర్తి మండలంలోని పండ్ల తోటల రైతులకు శరాఘాతంగా మారింది. ఇలాంటి పరిస్థితులే ఇంకా కొనసాగితే రానున్నకాలంలో పోగా మిగిలిన తోటలు అన్నీ ఎండి పోవాల్సిందేనని రైతులు అంటున్నారు. భూగర్భ జలాలు నానాటికి క్షీణించడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారింది. గోదావరి జలాలు తమ బతుకులు బాగు చేస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం ఏమేరకు గోదావరి జలాలు తుంగతుర్తి ప్రాంతానికి వచ్చేలా చర్యలు చేపడుతుందోనని రైతులు అంటున్నారు. మిషన్ కాకతీయ పనులలో భాగంగా చెరువులలో ఉన్న పూడిక అయితే కొంత మేర కాంట్రాక్టర్‌లు తీశారు గానీ వర్షాలు లేక చెరువులు కనీసం మిషన్ కాకతీయ గుంతలు కూడా వర్షపు నీళ్ళకు నిండలేదంటే గడచిన నాలుగేళ్ళలో వర్షాల పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఏది ఏమైనా తుంగతుర్తి ప్రాంత పండ్ల తోటల రైతు ఎండి పోతున్న తమ తోటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని ఇందుకు గాను సంబంధింత శాఖాధికారులు తోటలను పరిశీలించి దీనిని ప్రకృతి వైపరీత్యంగా భావించి తమను ఆర్ధికంగా ఆదుకోవాలని రైతాంగం కోరుతున్నారు.

Lime, Orange Gardens Dry in Summer