Home ఎడిటోరియల్ సాహితీ ‘పెద్దలు’

సాహితీ ‘పెద్దలు’

– బి.నర్సన్
9440128169

poetహిమాలయాల్లో శిఖరాలుగా ఒక భాషా సాహిత్యంలో రచయితగా ఉన్నత స్థాయిలో కొనసాగడం సామాన్యమైన విషయం కాదు. ఎవరికైనా తన జీవిత కాలంలోని అత్యధిక భాగాన్ని వెచ్చించితే తప్ప ఇది సాధ్యం కాదు. వారి కృషి, సృజన, సర్వదా శిరోధార్యాలవుతాయి. వారి మేధో సంపత్తి జాతి సంపదగా లెక్కించబడుతుంది. ప్రభుత్వం సైతం వారి సేవలను జాతికి ఉపయుక్తమయ్యే దిశగా వినియోగించుకుంటుంది. సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ అవార్డు, పద్మ పురస్కారాలతో ఒక వైపు వారిని గౌరవించుకుంటూనే దేశ పాలనలో సైతం వారి సేవలను మేళవించుకుంటాయి. ప్రముఖ, సాహితీ వేత్తలకు రాజ్యసభలో స్థానం కల్పించి, వారి సుదీర్ఘ జీవన అనుభవాన్ని, జ్ఞాన సారాన్ని జాతి పురోగతికి అంకితం చేయడం అందులో భాగమే. ఇందుకోసమే మన పార్లమెంట్‌లోని ఎగువసభకు దేశంలోని అగ్రశ్రేణి మేధావులను ఎంపిక చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 దేశాధ్యక్షుడికి కట్టబెట్టింది. 225 మంది సభ్యులతో కొనసాగే రాజ్యసభలో 12 మంది వివిధ రంగాల్లోని అత్యుత్తమపౌరులు సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సంఘ సేవలో నిష్ణాతులే వీరిలో అధికం.
ఈ నిబంధనను అనుసరించి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రాజ్యసభ సభ్యులుగా 15 మంది కవులు, నవలా కారులు, జర్నలిస్టులు సాహిత్య విభాగం కింద నియమితులయ్యారు. 1952 నుండి ఆరంభమైన ఈ మహా గౌరవం దక్కిన మొదటి వారు హిందీ కవి అయిన మైథిలీ శరణ్ గుప్త. హిందీ భాషలోని ఆధునిక కవుల్లో ఆధ్యుడు ఈయన. అప్పటి వరకు బ్రజ్ భాషలో వస్తున్న హిందీ సాహిత్యాన్ని వ్యవహారిక భాష అయిన ఖజీబోలీకి మలుపు తిప్పిన ఘనత గుప్త్‌జీది. మహాత్మా గాంధీచే రాష్ట్ర కవిగా సంబోధింపబడిన ఈ కవి ప్రధాన రచనలు – భారత్ భారతి, సాకేత్, పంచవటి మొదలైనవి. గుప్త జీ కావ్యాల కథా వస్తువులు రామాయణ, భారతాలు ప్రధానంగా సాగుతాయి. ‘పద్మభూషణ్’ గ్రహీతయిన మైథిలీ శరణ్ గుప్త్ 1954 నుండి తన అస్తమయం (1964) దాకా రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు.
ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ భవనంలో అడుగిడిన మరో రచయిత తారశంకర్ బందోపాధ్యాయ. ప్రసిద్ధ బెంగాలీ గద్య రచయిత ఈయన. బెంగాలీ భాషలో 65 నవలలు, 53 కథా సంపుటాలు రచించిన తారాశంకర్ ప్రసిద్ధ నవల ‘గణదేవత’కు జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ రాసిన ‘గణదేవత’ సినిమా కూడా వచ్చి ప్రశంసలందుకుంది. 1971లో మరణించిన బందోపాధ్యాయ 1952 -64 మధ్య కాలంలో రాజ్యసభలో కొనసాగారు.
సాహితీవేత్తగా రాజ్యసభలో అడుగుపెట్టిన తొలి తెలుగువాడు నార్ల వెంకటేశ్వర్ రావు. తెలుగు జాతి గర్వించే హేతువాది, మానవతావాది అయిన నార్ల 3.4.1958 నుండి 2.4.1970 వరకు వరుసగా రెండుసార్లు ఎగువ సభకు ఎన్నికయ్యారు. యాజమాన్యాల ఒత్తిళ్ళకు ఒగ్గకుండా తనదైన రీతిలో పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తూ ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు దాదాపు 30 ఏండ్లు ఆయన సంపాదకునిగా పని జేశారు. 13.3.1975 న తుది శ్వాస విడిచిన నార్ల సీత జ్యోస్యం. నార్లవారి మాట ఇతర ఎన్నో ప్రజోపయోగ రచనలు చేశారు.
హరివంశ్‌రాయ్ బచ్చన్ పరిచయం అవసరం లేని హిందీ కవి. ప్రముఖ హిందీ నటుడి తండ్రి అయిన హరివంశ్ రాయ్ హిందీలో ప్రసిద్ధ భావవాద కవి. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేసిన ఈయన ‘మధుర’ కావ్యాలు -మధుశాల, మధుబాల, మధుకలశ్ మొదలగునవి. నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బచ్చన్ 1966-72 దాకా రాజ్యసభలో ఉన్నారు. 2003 పరమపదించిన వీరి కవితా ఖండికలు తెలుగు విద్యార్థులకు హిందీలో పాఠ్యాంశాలుగా సుపరిచయం.
తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా జి.శంకర్ కురుప్ ప్రసిద్ధుడు. మహాకవి జీ అని మలయాళీలు ప్రేమగా పిలుచుకొనే శంకర్ కూరూప్ తన మాతృభాషలో జనరంజకమైన రచనలు చేశారు. ఒడక్కుజాల్ (వెదురు పిల్లన గ్రోవి) వీరి ప్రసిద్ద రచన. ఈ రచనకు వచ్చిన జ్ఞానపీఠ్ అ వార్డు నగదుతో ఒడక్కు జాల్ అవార్డును నెలకొల్పిన మహా మనిషి ఈయన. 1968-72 ఈయన రాజ్యసభావాస కాలం. 1988లో శంకర్ కురుప్ మరణించారు. ఉమాశంకర్ జోషి ప్రసిద్ధ గుజరాతీ రచయిత. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ‘నిశిత్’ అనే జోషి కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. 1970-76 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్న జోషి 1988 వరకు జీవించారు.
‘చిత్రలేఖ’ నవలా కారుడిగా భాగవతీ చరణ్ వర్మ అన్ని భాషల పాఠకులకు పరిచితులు. 1941లో మళ్లీ 1964లో రెండు మార్లు సినిమాగా వచ్చిన ‘చిత్రలేఖ’ జెమినీ వాసన్ నిర్మాణంలో ఓ చిత్ర రాజంగా పేరొందింది. ఆనాటి భారీ చిత్రాలలో ఈ సినిమా ఒకటి. వర్మ బహు గ్రంథకర్తయే కాకుండా ‘విచార్’ అనే హిందీ వారపత్రికకు, ‘నవజీవన్’ దినపత్రికకు సంపాదకులుగా కూడా పని చేశారు.
ప్రసిద్ధ న్యాయవాదిగా కూడా పేరుగాంచిన వర్మ 1978లో రాజ్యసభలో అడుగుపెట్టి తన చివరి శ్వాస వరకు అనగా 1981 దాకా కొనసాగారు.
ఆంగ్ల రచయిత అయిన కుశ్వంత్ సింగ్ దేశవ్యాప్తంగా సుపరిచితులే. 99 ఏళ్ళు జీవించి 2014లో మరణించిన కుశ్వం త్‌సింగ్ నవలా రచయితగానే కాకుండా పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇంగ్లీషు వారపత్రిక అయిన ‘ఇల్‌స్ట్రేటెడ్ వీక్లీ’ సంపాదకుడిగా తొమ్మిది సంవత్సరాలు కొనసాగి 65000 నుండి 4 లక్షలకు దాని సర్కులేషన్‌ను పెంచిన ఘనత ఆయనది. ఇందిరా గాంధికి, కాంగ్రెస్‌కు అనుకూలంగా మెదలిన కుశ్వంత్ సింగ్ దేశ విభజనపై రాసిన ‘ట్రైయిన్ టు పాకిస్థాన్’ లో ఆనాటి పరిస్థితులను తన కోణంలో విశదీకరించారు. ఈయన 1980 నుండి 1986 వరకు రాజ్యసభ సభ్యులు.
ప్రముఖ పంజాబి రచయిత్రి అమృతా ప్రీతమ్‌ను రాజ్యసభనలరించిన తొలి మహిళా సాహితీ వేత్తగా పరిగణిం చాలి. వీరి జీవన కాలం 1919 -2005. వీరు పంజాబీ, హిందీ భాషల్లో శతాధిక పుస్తకాలు రచించారు. పింజర్ (అస్థిపంజరం -1950) ప్రీతమ్ ప్రసిద్ధ నవల. ఇది సినిమాగా రూపొంది పలు పురస్కారాలు అందుకుంది. రచయిత్రిగా ప్రగతి శీల ఉద్య మాలలో పాల్గొన్న ఈమె1986 నుండి 1992 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు.
ప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయితలైన ముగ్గురిలో ఆర్.కె.నారాయణ ఒకరు. మిగతా ఇద్దరు ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావు. ఆర్.కె. నారాయణ్ (1906 -2001) ‘మాల్గుడి డేస్’ సీరియల్ చూసిన పిల్లలు, పెద్దలకు గుర్తుండే పేరు. కన్నడ నటుడు, దర్శకుడు అయిన శంకర్ నాగ్ చేతిలో గొప్ప దృశ్య కావమైంది. సుప్రసిద్ధ కార్టూనిస్ట్, చిత్రకారుడు అయిన ఆర్.కె. లక్ష్మణ్, నారాయణ్ సోదరుడే. నారాయణ్ రాసిన మరో గొప్ప నవల ‘ది గైడ్’ పర్యా టక కేంద్రాల్లో వ్యాఖ్యాతగా పనిచేసే కథా నాయకుడి జీవనం ఈ నవలా కథా వస్తువు. విజయానంద్ దర్శకుడిగా నవకేతన్ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా దేవానంద్ నిర్మించి, నటించిన ఈ చిత్రం వ్యాపార పరంగా విజయం సాధించడంతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది. 1986 నుండి 1992 వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్.కె. నారాయణ ఇతర ప్రసిద్ధ రచనలు – బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్, ది ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్, ది డార్క్ రూమ్, ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ లను పేర్కొనవచ్చు.
రాజ్యసభను అలరించిన మరొక జర్నలిస్టు ఎడిటర్ రుస్సె కరంజియా. ఆర్.కె. కరంజియగా పిలువబడే ఈయన ‘బ్లిట్జ్’ ఆంగ్ల వార పత్రికకు సంపాదకుడే కాకుండా పబ్లిషర్ కూడా. ఈ పత్రికను 1941 నుండి నాలుగు దశాబ్దాల పాటు నడిపి భారతీ య పత్రికా రంగంలో కొత్త పంథాను ప్రవేశపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ వార్తలను సేకరించే విలేఖరిగా పని చేసిన కరంజియా 1991 నుండి 1997 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008లో ఈయన చనిపోయారు.
ఇంతవరకు రాజ్యసభ సభ్యుడి గౌరవాన్ని అందుకున్న తెలుగు రచయితలు ఇద్దరిలో సినారె ఒకరు. తెలుగు కవుల్లోనూ అగ్రగణ్యుడైన సి. నారాయణ రెడ్డి తెలుగు లోకానికి సుపరి చితులు. పద్య కావ్యాలు, వచన కవితలు, సినిమా పాటలు ప్రధాన రచనలు. ‘విశ్వంభర’ వీరికి జ్ఞానపీఠ్ అవార్డును సంపా దించి పెట్టిన కావ్యం. సి. నారాయణ రెడ్డి 1997 నుండి 2003 వరకు తన సుమధుర కావ్య కౌశలంతో సభ నలరించారు.
సుప్రసిద్ధ జర్నలిస్టు, కాలమిస్టు అయిన కులదీప్ నయ్యర్‌ను తెలియని పాఠకులు ఉండరు. 80కి పైగా పత్రికల్లో 14 భాషలలో తన వ్యాసాలు ప్రచురింపబడుతుంటాయి. ప్రగతి శీల రాజకీయ వ్యాఖ్యాతగా, మానవ హక్కుల కార్యకర్తగా వీరు క్రియాశీల పాత్ర పోషించారు. ఇందిర పాలనలోని ఎమర్జెన్సీ కాలంలో అకృత్యాలను ఎత్తిచూపుతూ ‘ది జడ్జ్‌మెంట్’ అనే విశ్లేషణాత్మక గ్రంథాన్ని రాశారు. ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, వాల్ ఆఫ్ వాగా వీరి ఇతర ప్రసిద్ధ రచనలు. కుల్‌దీప్ నయర్ 1997 నుండి 2003 దాకా రాజ్యసభలో ఉన్నారు.
తమిళ నటుడు, సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు అయిన ‘చో’ రామస్వామి తమిళనా టయే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తెలి సిన వారే. ఎప్పుడూ నున్నటి గుండు తో ఉండి, తన మాటల్లో, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించే ‘చో’ రామస్వామి తమిళ రాజకీయాల్లో కూడా కాలు మోపిన వాడే. ఆయన సంపాదక త్వంలో వచ్చే ‘తుగ్లక్’ పత్రిక రాజకీయ వ్యాఖ్యల కు తమిళంలో ప్రసిద్ధి. తమిళ సినిమాల్లో హాస్య నటుడిగా కొనసాగుతూ పలు సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా కూడా పని చేశారు. ప్రముఖ రాజకీయ వ్యంగ్య చిత్రం ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ ఈయన సృష్టియే. చో రామస్వామి 1999 నుండి 2005 వరకు రాజ్యసభ సభ్యులు.
ప్రస్తుతానికి హిందీ కవి, రచయిత జావేద్ అక్తర్ చివరి సాహితీ వేత్తగా అనుకోవచ్చు. మత విశ్వాసాలకు దూరంగా ఉండే జావేద్ మంచి భావుకుడు. మరో రచయిత సలీమ్‌తో జతకట్టి ‘సలీమ్ జావేద్’ జంటగా ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందించారు. జంజీర్, యాదోంకే బారాత్, దీవార్, షోలే సినిమాలు వీరి రచనా ప్రజ్ఞకి ప్రతిబింబాలు. 13 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న జావేద్ అక్తర్ పదవీకాలం 15 మార్చి 2016 తో ముగిసింది. 2010 నుండి ఆరేళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. జావేద్ అక్తర్ తన వీడ్కోలు సమావేశంలో సభను ఉద్దేశించి, జాతిని మేల్కొ ల్పే విధంగా భారత్ మాతాకీ జై” అని పలు మార్లు నినదించి ఒక సంచలనం సృష్టించారు.
ఇలా సాహితీవేత్తలే కాకుండా ఫృథ్వీరా జ్‌కపూర్, నర్గీస్ దత్, వైజయంతి మాల, షబనా ఆజ్మి, మృణాల్‌సేన్, శ్యాంబెనగల్ లాంటి సినీ దిగ్గజాలు, అబూ అబ్రహం, ఎం.ఎఫ్. హుస్సేన్ లాంటి ప్రసిద్ధ చిత్రకారులు రాజ్యసభ సదనాన్ని శోభితం చేశారు.
రాజకీయ పార్టీల ద్వారా కాకుండా స్వయం కృషితో రాజ్యసభ గౌరవాన్ని పొందిన కవులు, కళాకారులు ముమ్మాటికి వారివారి క్షేత్రాల్లో శిఖర సమానులే.