Home తాజా వార్తలు కాలేయ మార్పిడి అవసరం లేని కొత్త వైద్యచికిత్స

కాలేయ మార్పిడి అవసరం లేని కొత్త వైద్యచికిత్స

Liverలండన్ : కాలేయం చెడిపోతే కాలేయాన్ని దానం ఇచ్చే వారి కోసం నిరీక్షించక తప్పడం లేదు. దానం ద్వారా కాలేయాలను స్వీకరించడం అంత సులువు కాదు. డబ్బు ఎంత ఖర్చు పెట్టినా దాత అందించే కాలేయం రోగికి మార్చేటప్పుడు భౌతికంగా, వైద్యపరంగా ఎన్నో చిక్కులు ఎదురవుతుంటాయి. అలాగే కాలేయం మార్చిన తరువాత కూడా ఏవేవో వైద్య ఇబ్బందులు వెంటాడుతుంటాయి. ఈ నేపథ్యంలో కాలేయం మార్పిడి అవసరం లేకుండా చెడిపోయిన కాలేయాన్ని బాగు చేయగల కణచికిత్సను పరిశోధకులు కనుగొన గలిగారు. వైఫల్యం చెందిన కాలేయాన్ని మరమ్మతు చేయడంతోపాటు కాలేయ కండరాను తిరిగి ఉత్పత్తి చేయగల కొత్త రకం కణాన్ని వెలుగు లోకి తెచ్చారు.

ఒక కణం ఆర్‌ఎన్‌ఎను ఉపయోగించి ఈ కణం ఉనికిని కనుగొన్నారు. ఈ కణవిధానాన్ని హైపటో బిలియరీ హైబ్రిడ్ ప్రొజెనిటర్ (హెచ్‌హెచ్ వైపి) అని పిలుస్తారు. తల్లి కడుపులో బిడ్డ రూపొందుతున్నప్పుడే ఇది ఏర్పడుతుంది. వయసు పెద్దదైనా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎదిగిన వారి కాలేయంలో హెపటో సైటిస్, బొలాంజియో సైటెస్ అనే రెండు ప్రధాన కణవిధానాలుగా ఇది పెరుగుతుంది. ఈ పరిశోధనలో హెచ్‌హెచ్‌వైపిఎస్ ను పరీక్షించి చూడగా, ఎలుక లోని మూలకణాలతో ఇవి సరిపోలాయని లండన్‌కు చెందిన కింగ్స్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఎలుక కాలేయాన్ని ఈ కణాలు వేగంగా బాగు చేయడాన్ని గమనించారు. సిరోసిస్‌లో జరిగినట్టు గానే ఇక్కడ కూడా జరిగిందని చెప్పారు. వాస్తవమైన మూలకణాలను ఈ కణాలు పోలి ఉండడాన్ని మొదటి సారి తాము చూశామని, మానవ కాలేయం లోనూ ఇవి ఉండగలవని తాము తెలుసుకున్నామని కింగ్స్ కాలేజీ పరిశోధకుడు తమీర్ రషీద్ చెప్పారు.

అంతేకాదు కాలేయ మార్పిడి అవసరమే లేకుండా కాలేయ వ్యాధిని చికిత్స చేయగల మందులను ఉత్పత్తి చేయగల విస్తృత స్థాయిని ఇవి కల్పిస్తాయని రషీద్ వివరించారు. జీవన విధానంలో ఆధునిక అలవాట్ల వల్ల వస్తున్న మార్పులతో ఈ కాలేయ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. అంటే స్థూలకాయం, ఆల్కహాలును దుర్వినియోగించడం, వైరస్‌లు సోకడం, జన్యుపరమైన వ్యాధులు సంక్రమించడం ఇవన్నీ కాలేయ వ్యాధి రాడానికి కారణాలు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చకామెర్లు, దురద, బలహీనంగా ఉన్నట్టు అనిపించడం, అలసట, సిరోసిస్, వంటివి కాలేయ వ్యాధికి లక్షణాలు.

కాలేయ మార్పిడి అంత సులువు కాదు కాబట్టి శరీరంలో ఎక్కడ నుంచైనా మూలకణాలను (ప్లూరిపోటెంట్ మూలకణాలు) ఉపయోగించి హెచ్‌హెచ్‌వై పిఎస్ కణాలుగా మార్చ గలిగే ప్రక్రియను సాధించ గలిగితే రోగి ఇష్టప్రకారం వాటిని రోగికి సమకూర్చ వచ్చు. ఆ ప్రక్రియ సాధన కోసం గట్టిగా ఇప్పుడు ప్రయత్నించ వలసిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తులో కణాల మార్పిడి లేదా అవయవ మార్పిడి అవసరం లేకుండా సంప్రదాయ ఫార్మకోలాజికల్ ఔషధాలను ఉపయోగించి శరీరంలో హెచ్‌హెచ్‌వైపిఎస్‌ను తిరిగి అన్నిటికీ పనిచేసేలా పరిశోధనలు సాగిస్తామని రషీద్ చెప్పారు.

Liver Transplants New medical treatment

 సైన్స్ విభాగం