Home తాజా వార్తలు బతుకుదెరువు కోసం వచ్చి బలైతున్న కూలీలు…

బతుకుదెరువు కోసం వచ్చి బలైతున్న కూలీలు…

 Workers

 

కుత్బుల్లాపూర్‌: బతుకుదెరువు కోసం వచ్చిన కూలీల బతుకులు గాల్లోనే కలిసిపోతున్నాయి… బహుళ అంతస్థుల భవన నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. పొట్టచేతబట్టుకొని నగరానికి వచ్చిన కూలీలు ఆకాశహర్మాల పుణ్యమాని జీవితాలను కడతేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలు కాస్తా రోడ్డున పడుతున్నాయి. కూలీలకు రక్షణ కల్పించాల్సిన బిల్డర్‌లు తమ ప్రాణాలు కాదుకదా..! అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నగరంలో నిత్యం ఏదో ఓ చోట బహుళ అంతస్థుల భవనాలపై నుంచి పడి కార్మికులు మృతి చెందిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే రక్షణల కోసం ఆలోచించే కాంట్రాక్టర్‌లు, బిల్డర్‌లు ఆ తరువాత యథావిధిగా తమ పనులను చేసుకుంటూ పోతున్నారు.

పదిరోజుల్లోనే ముగ్గురు మృతి…

బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనాలపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృత్యువాతకు గురయ్యారు. ఇదే నెల 16వ తేదిన ప్రకాశం జిల్లాకు చెందిన దొడ్డి సత్యనారాయణ మేస్త్రీ బాచుపల్లి ఆర్టిసికాలనీలోని పున్నారెడ్డికి చెందిన భవనంలో మూడవ అంతస్థులో పనిచేస్తుండగా ముందు గోడ కూలి కిందపడిపోయి మృత్యువాతకు గురయ్యాడు. తాజాగా నిజాంపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలోపనిచేస్తున్న ముగ్గురు కార్మికులు 9వ అంతస్తు నుంచి ఎస్సార్పీలో కిందికి వస్తుండగా అది 8వ అంతస్తుకు రాగానే తలకిందులై కార్మికులు ముగ్గురు కిందపడిపోయారు. ఇందులో రహమాన్ (20), తహీర్(21)లు మృతి చెందగా, మోదురు తీవ్రగాయాలపాలయ్యడు. రెండు నెలల క్రితం ఇదిపోలీసుస్టేషన్ పరిధిలో ఓ కార్మికుడు కింద పడిమృతి చెందిన సంఘటలు ఉన్నాయి.

వెలుగులోకి రానివి మరెన్నో..?

బహుళ అంతస్థుల భవన నిర్మాణాల వద్ద జరుగుతున్న ప్రమాదాలు చాలా వరకు వెలుగుచూడటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు అప్రమత్తమవుతున్న బిల్డర్‌లు మృతులను, క్షేతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. కార్మికులకు సంబంధించిన కాంట్రాక్టర్‌లతో మాట్లాడి..కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రాకముందే నయానో బయానో ఒప్పించి, ఎంతో కొంత ముట్టజెప్పి స్వంత గ్రామాలకు పంపించి వేస్తున్నారు. ఇలాంటివి పోలీసు స్టేషన్ వరకు కూడా రావడం లేదు. అనుకున్న విధంగా ఒప్పందాలు జరగనప్పుడు కొన్ని పోలీసు స్టేషన్‌కు చేరుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. పోలీసులు సైతం భవన నిర్మాణాలపై కార్మికులు పడిన విషయం తెలిసినా…ఫిర్యాదులు అందనట్లయితే తమకు సంబంధం లేదన్నట్లుగానే తెలిసి తెలియనట్లుగా వ్యవహిస్తున్నారు.

భద్రత కరువు…

వాస్తవానికి బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు నిర్మాణదారులు కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. పైనుంచి కిందపడినా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఉండేందుకు భవనం చుట్టూ జాలి తెరలను అమర్చాలని నిపుణులు తెలుపుతున్నారు. కానీ ఏ ఒక్క నిర్మాణదారుడు ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. కార్మికులకు సరైన రక్షణలు కల్పించకపోవడం వల్లే ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పొవాల్సిన దుస్థితి నెలకొంటుందని పలువురు కార్మికులు వాపోతున్నారు.

కార్మిక శాఖ గుర్తింపు లేని కార్మికులే ఎక్కువ…

వాస్తవానికి భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికుల భద్రత దృష్టా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పథకాన్ని అమలుచేస్తుంది. సంవత్సరానికి రూ.22 చొప్పున చెల్లించి కార్మిక శాఖలో గుర్తింపు పొందాల్సి ఉంటుంది. తద్వారా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే రూ.6,20,000 కార్మికుడి కుటుంబానికి వస్తుంది. ఇలాంటి ఇన్సురెన్స్ పథకం అమలులో ఉన్నా వీటిని సదరు కాంట్రాక్టర్‌లు కనీసం అవగాహన కల్పించడం లేదు. అంతే కాకుండా భవనాలను నిర్మిస్తున్న నిర్మాణదారులు సైతం కార్మిక శాఖకు కార్మికుల పేరిట సెస్సును చెల్లించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ అధికారులు సైతం ఇన్ని భవనాలు నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ పథకాలపై అటు భవన నిర్మాణదారులకు గానీ ఇటు కార్మికులకు గానీ అవగాహన కల్పించిన పాపానపోవడం లేదు.

lives of Workers are Deteriorating