Thursday, March 28, 2024

వినకపోతే ఖబడ్దార్

- Advertisement -
- Advertisement -

kcr

 

మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా… ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా పాటించాల్సిందే
సాయంత్రం 6గంటలకే దుకాణాలు బంద్, రాత్రి 7 నుంచి ఉదయం
6 గంటల వరకు కర్ఫూ
ధిక్కరిస్తే 24 గంటలూ కర్ఫూ విధిస్తాం, అప్పటికీ దారికి రాకపోతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు, దారికి రాకపోతే రంగంలోకి ఆర్మీ
ధరలు పెంచితే పి.డి. యాక్ట్
ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు?
కథానాయకులుగా మారి స్థానిక ప్రజల్లో చైతన్యం తెండి
సరిహద్దుల్లోని 3,400 వాహనాలకు టోల్‌ఫ్రీ ఎంట్రీ
సహాయం కావాలంటే డయల్ 100కు ఫోన్
రాష్ట్ర భవిష్యత్తు దృష్టా కఠిన నిర్ణయాలు తప్పవు
మీడియాకు పోలీసులు సహకరించాలి
రేపటి నుంచి బియ్యం పంపిణీ,
రూ. 1500 నేరుగా అకౌంట్‌లో వేస్తాం
వ్యవసాయ పనులకు, నరేగా కూలీలకు అనుమతి
మొక్కజొన్న, వరిధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం, రైతులు ధైర్యం చెడొద్దు
వినకపోతే పెట్రోల్ బంక్‌లు బంద్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు స్పందన లభిస్తోంది : ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనాపై ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్, కర్ఫూ ఆదేశాలను ప్రజలందరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనని, లేనిపక్షంలో 24 గంటల పాటు కర్పూ విధించాల్సి ఉంటుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అప్పటికి మాట వినకపోతే షూట్ అండ్ సైట్ ఆదేశాలను కూడా ఇవ్వాల్సి వస్తోందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మంగళవారం నుంచే రాష్ట్రంలో కర్ఫూ కొనసాగుతుందని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే నిత్యావసరాల కో సం నేరుగా అకౌంట్‌లోనే రూ.1500 వేస్తామన్నారు. అకౌంట్ వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య శాఖకు నిధుల కొరత రావొద్దని, మిగతా అన్నింటికీ ఆపి వారికి ఇవ్వాలని పో లీసు శాఖకు కూడా అవసరాల మేర ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఆదేశించారు. అత్యున్నత స్థాయి, అత్యసవర సమావేశం తరువాత సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అమెరికా దేశం మాదిరి రాష్ట్రంలో ఆర్మీని రంగంలోకి దించే పరిస్థితులు తెచ్చుకోవద్దన్నారు.

అక్కడ స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఆర్మీని దింపారన్నారు. లాక్‌డౌన్‌లో జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పిలు, పోలీసు, అధికార సిబ్బంది కనిపిస్తున్నారని, ప్రజా ప్రతినిధులు, జిహెచ్‌ఎంసిలో 150 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించా రు. తక్షణమే వారి వారి పరిధిలోని మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మెన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు రంగంలోకి దిగాలన్నారు. ఎక్కడికక్కడ కథానాయకులుగా మారాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. వైద్య, వ్యవసాయ, మున్సిపల్ మంత్రులు మాత్రమే హైదరాబాద్‌లో ఉండాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కర్ఫూ విషయంలో చాలా వరకు బాగున్నాయని, హైదరాబాద్, సైబరాబా ద్, రాచకొండలోనూ పరిస్థితులు ఆదుపులోకి వచ్చాయని తెలిపారు. ఇప్ప టి వరకు రాష్ట్రంలో 36 కరోనా కేసులు నమోదయ్యాయని, అందులో ఒక రు ఇప్పటికే డిశ్చార్జి అయ్యారని సిఎం తెలిపారు.

మిగతా వారు కూడా ఏప్రి ల్ 7వ తేదీ కల్లా కోలుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు ఉన్నారని, స్వతహాగా నియంత్రణ పాటించి ఎక్కడి వారు అక్కడ ఉండాలని సిఎం సూచించారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందన్నారు. రాష్ట్రంలో 19,313 మందిపై నిఘా ఉందన్నారు. లోకల్‌గా వైరస్ ట్రాన్సిమిషన్ అయిన కేసులు వస్తలేవన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులు బయట తిరుగుతున్నారని, వారి పాస్‌పోర్టులు సీజ్ చేస్తామన్నారు. అవసరమైతే పాస్‌పోర్టులను సస్పెండ్ కూడా చేస్తామన్నారు. సమాజ శ్రేయస్సుకు భంగం కలిగిస్తే సమాజం నుంచి వారు ప్రయోజనాలు పొందే అవకాశం ఇవ్వబోమన్నారు.

కరోనా సోకని దేశం లేదని, ఇప్పటికే 195 దేశాలకు పాకిందని, విదేశీల నుంచే ఈ వ్యాధి వస్తుందన్నా రు. 82 మంది విదేశాల నుంచి వచ్చారని వారినుంచే కరోనా వ్యాప్తి చెందిందన్నారు. నిర్మల్‌లో క్వారంటైన్ నుంచి ఒక వ్యక్తి మూడు సార్లు తప్పించుకున్నారన్నారు. మన దగ్గర కరోనా అనుమానితుల సంఖ్య తక్కువగా ఉందని, అయినా ఇది ప్రత్యేక పరిస్థితి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్‌డౌన్ విధించడంతో బార్డర్ల దగ్గర మూడు, నాలుగు వేల వాహనాలు చేరుకుని ఉన్నాయని, వాటిలో రాష్ట్ర ప్రజల అవసరాలకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయన్నారు. మంగళవారం రాత్రి వాటికి అనుమతి ఇస్తున్నామని, ఒక్క రోజుకు టోల్ మాఫీ చేస్తున్నట్లు చెప్పారు.

అత్యసరమైతే.. 100 డయల్
మరణాలు, అత్యవసర ఆరోగ్య సమస్యలు వంటివి ఉంటాయని ,అటువంటి వాటికి అత్యవసర సమయంలో 100 డయల్‌కు ఫోన్ చేసి అధికారుల సా యం తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వాహనాలను కూడా పోలీసులే సమకూరుస్తారన్నారు. రైతాంగం వ్యవసాయ పనులు చేసుకోవచ్చున ని, అయితే గుంపులుగా వెళ్లొద్దని సూచించారు. మొక్కజొన్న, వరిధాన్యాన్ని మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎక్కడిక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అకౌంట్‌లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. అయితే రైతులు టౌన్‌లో ఉన్న మార్కెట్ కమిటీలకు రావొద్దన్నారు. రైతుబంధు సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయని, అవి వస్తేనే మనకు తిండి గింజలు దొరుకుతాయన్నారు. కూలీలకు ఉపాధి దొరికే అవకాశం కావున దూరం దూరంగా ఉంటూ కొనసాగించాలి. ఇరిగేషన్ పనులు గుంపులు, గుంపులుగా కాకుండా పనిని కొనసాగించాలని, హై శానిటైజేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

అల్లకల్లోలం ఉంటే.. కొల్లగొడుతారా !
కొన్ని కూరగాయల ధరలు పెంచినట్లు చూశానని, ఇది బాధకార విషయమన్నారు. ఏడాదికి రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల ఉత్పత్తి వస్తుందని, ఇందులో 27 లక్షల టన్నులు వినియోగం అవుతాయన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉత్పత్తి అవుతున్నా, ఎక్కువ ధరలు పెంచుతామంటే నడవదని సిఎం హెచ్చరించారు. ఎక్కువ ధరలకు అమ్మితే పి.డి యాక్ట్ అమలు చేసి జైలుకు పంపుతామన్నారు. నిత్యావసరాల ధరలు పెంచినా దుకాణాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఒపెన్ చేయకుండా, లైసెన్స్‌లు రాకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. సాయంత్రం 6గంటలకే అన్ని రకాల దుకాణాలు బంద్ చేయాలి. 7 గంటలలోపు ఇంటి కి వెళ్లాలి. ఒక్క నిమిషం ఆలస్యం చేసినా షాప్ సీజ్ చేస్తామని తెలిపారు.

ఎక్కడికీ పోయే అవకాశమే లేదు
వేరే దేశం, రాష్ట్రం, పుణ్యక్షేత్రం పొదామంటే ఎక్కడికి అవకాశం లేదని సిఎం అన్నారు. ప్రజలందరికీ దండం పెట్టి మనవి చేస్తున్నాం, అపత్కాల సమయంలో నియంత్రణలో ఉండాలని, ఎట్టి పరిస్థితులలో బయటకు పోవొద్దని వ్యాఖ్యానించారు. చాలా గ్రామాలు కంచెలు వేసుకుంటున్నాయని, తాము వేరే ఊరికి వెళ్లం. మా ఊరికి వేరే వాళ్లు రావొద్దంటున్నారన్నారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైళ్లు, డొమెస్టిక్ విమానాలన్నీ బంద్ అయ్యాయని తెలిపారు. వేరే దేశం, రాష్టాల నుంచి వైరస్ వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అయితే ఇప్పటికే చేరుకున్న వైరస్‌ను నివారించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు. అలా అయితేనే భవిష్యత్ బాగుంటుందని వ్యాఖ్యానించారు. వేరే దగ్గర నుంచి డాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు. దండం పెట్టినా మనకు డాక్టర్లు దొరకరు. ఉన్న డాక్టర్లను కాపాడుకునేలా మంత్రి ఈటల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు శాఖ కూడా ముఖ్యం. మెట్రోరైళ్లో ఉన్న పోలీసు సిబ్బంది రెగ్యులర్ విధుల్లో పనిచేస్తారని సిఎం వ్యాఖ్యానించారు.

వనమాకు ప్రశంస
కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వర్‌రావు మనుమరాలి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఎంతో ఘనంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుని, సమాజహితాన్ని కోరి కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా వేసుకున్నారని పేర్కొన్నారు.

వినకపోతే పెట్రోల్ బంకులు బంద్
గుంపు, గుంపులు జమ కావొద్దు, ప్రజలు ఒక చోట గుమికూడవద్దనేది మా ఉద్దేశ్యం. అలుసుగా తీసుకోవద్దు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా.. నాలుగు రోజులు కండ్లు మూసుకుంటే రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఎవరూ ఎక్కువ దూరం కూడా పోలేరు. విపరీతమైన చెక్‌పోస్టులు ఉన్నాయి. కూరగాయలు కానీ, నిత్యావసరాలు కానీ మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయని కెసిఆర్ తెలిపారు. ఎవరు వినకపోతే పెట్రోల్ బంకులు మూసేయాల్సి వస్తుందన్నారు.

ఇదంతా ప్రభుత్వానికి ఇష్టమా
కర్ఫూ, లాక్‌డౌన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టమా.. రోజుకు కొన్ని వందల కోట్ల రూపాయాల నష్టం జరుగుతుందని, ఆర్థికంగా రాష్ట్రానికి నష్ట వస్తున్నా అన్నీ దిగమింగుకుంటూ తప్పనిసరి పరిస్థితుల్లో ఆదేశాలు ఇచ్చామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. దయచేసి ప్రతీ ఒక్కరూ కూడా తమకు తాము స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

క్వారంటైనే.. మన వాలంటైన్ గొప్ప భావం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్వారంటైన్‌పై కవయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మీ రాసిన కవితపై సిఎం కెసిఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్ అనుకోవాలంటూ రాసింది అధ్బుతంగా ఉందన్నారు. ఆ కవితలో గొప్ప భావం ఉందని ప్రశంసించారు. కవులు, గాయకులు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. సానుకూల దృక్ఫథంతో, చైతన్యం, ధైర్యం పెంపొందించేలా వారు పత్రికలకు, సోషల్ మీడియాలో రచనలు చేయాలని చేయాలని కోరారు.

మీడియాకు అనుమతి ఉంది
పోలీసులకు నేను చెబుతున్నా… మీడియాకు అనుమతించినం.. కొన్నిచోట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిసింది. అపార్థం చేసుకోవద్దు. వార్తాలు ప్రజలకు చేరాలి. మీడియాతో ఘర్షణ పద్ధతి వద్దన్నారు. రిపోర్టర్లు సమాజం కోసం పనిచేస్తారని, ఎక్కడా కూడా వారితో దురుసుగా ప్రవర్తించవద్దని డిజిపికి ఆదేశాలు కూడా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

 

Lockdown curfew must be followed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News