Friday, March 29, 2024

ఒక్కరోజే రూ.122 కోట్ల విక్రయాలు

- Advertisement -
- Advertisement -

ఉదయం 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఓపెన్
11 రోజుల వ్యవధిలో 670.95 కోట్ల మద్యం విక్రయాలు
మంగళవారం ఒక్కరోజే ప్రభుత్వ డిపోల నుంచి రూ.122 కోట్ల విక్రయాలు
లాక్‌డౌన్ ప్రకటన అనంతరం వైన్‌షాపుల్లో 100 కోట్ల విక్రయాలు

మన తెలంగాణ/హైదరాబాద్: మందుబాబులకు ఇది నిజంగా ఇది గుడ్ న్యూసే. నేటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అబ్కారీ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరిచేందుకు అవకాశం లేదు. ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో అబ్కారీ శాఖ అధికారులు మద్యం దుకాణాలను తెరిచే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడగా.. ప్రభుత్వం నిబంధనలను సడలించింది. నేటి నుంచి ఈ నెల 21 వరకు పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అవకాశమిచ్చింది. ఆ తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి వస్తాయి. తదనుగుణంగా బార్లు, పబ్‌లు, మైక్రో బ్రూవరీలను తెరిచేందుకు పెద్దగా అవకాశం లేదని కానీ, రిటైల్ మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం విక్రయించుకునేందుకు అనుమతినిస్తున్నామని అబ్కారీ శాఖ పేర్కొంది.

ఈ మేరకు రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలకు అధికారంగా సమాచారమిచ్చింది. ఇప్పటివరకు ఉదయం 10 గంటలకు తెరుస్తున్న మద్యం షాపులు నేటి నుంచి 6 గంటలకే తెరుచుకోనున్నాయన్న మాట. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం సమావేశమై లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి నిత్యావసరాలు, వైద్య సంబంధిత, ఇతర పరిమిత రంగాలకు ప్రభుత్వం మినహాయింపులనిచ్చింది. ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపులకు అవకాశం లేకుండా మిగతావాటికి అనుమతులిచ్చింది. పాలు, కూరగాయలు, నిత్యావసరాలతో పాటు మద్యం దుకాణాలకు ఈ సందర్భంగా అనుమతులను జారీ చేసింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కోవిడ్ నిబంధనలను అనుసరించి మద్యం విక్రయించాలని, షాపుల ముందు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించి మందుబాబులు మద్యం కొనుగోలు చేయాలని అబ్కారీ శాఖ సూచించింది. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ నెలలో 11 రోజులకుగానూ రూ.670.95 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లాక్‌డౌన్ భయంతో మందు బాబులు భారీగా గత కొంతకాలంగా భారీగా మద్యం కొనుగోలు చేస్తూ వచ్చారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఎపి, చెన్నైలలో లాక్‌డౌన్ కారణంగా ముందస్తు అంచనాలతో భారీ ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే రూ.122 కోట్ల మద్యం విక్రయాలకు ప్రభుత్వ డిపోల నుంచి జరిగింది. లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం వైన్‌షాపులలో మరో రూ.100 కోట్లు మద్యం విక్రయమవ్వడం గమనార్హం.

కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందుబాబులు ఆయా మద్యం షాపుల ముందు పోటెత్తారు. కొన్ని చోట్ల ఆయా షాపుల ముందు కిలోమీటర్ల మేర మందుబాబులు క్యూలు కట్టి మద్యం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. ఆ క్రమంలో భౌతిక దూరం నియంత్రణ పాటించిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఆయా షాపుల వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శాయశక్తులా యత్నించారు. అదే క్రమంలో లాక్‌డౌన్ సడలింపు సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంటాయి కదా.. ఇదేంది బాయ్.. ఈ విధంగా మందు కోసం పోటీ పడుతున్నారంటూ చెప్పినా మందుబాబులు వినిపించుకోలేదు. పోటీపడి మరీ పెద్ద సంఖ్యలో మందుబాటిల్స్ కొనుగోలు చేయడం గమ నించదగిన పరిణామం.

Lockdown Effect: Wine Shops to Open 4 hrs in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News