Home జాతీయ వార్తలు 8 నుంచి మాల్స్ హోటళ్లు, రెస్టారెంట్లు ఖుల్లా

8 నుంచి మాల్స్ హోటళ్లు, రెస్టారెంట్లు ఖుల్లా

Lockdown

 

లాక్‌డౌన్‌పై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష

గుళ్లు, ప్రార్థనామందిరాలు కూడా

కంటైన్‌మెంట్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్

విద్యాసంస్థలపై జులైలో నిర్ణయం

కేంద్రం 5.0 మార్గదర్శకాలు

రెండువైపులా అనుమతితో అంతర్రాష్ట్ర రవాణాకు పచ్చజెండా
రాత్రి 9గం.వరకు కర్ఫూ సడలింపు

వీటికి అనుమతి లేదు

అంతర్జాతీయ విమాన సర్వీసులు
మెట్రో రైలు సేవలు, సినిమా హాళ్లు
జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్
బహిరంగ సమావేశాలు
క్రీడలు, రాజకీయ సదస్సులు,
వినోద కార్యక్రమాలు
విద్యా సంబంధిత సంస్థలు
మతపరమైన కార్యక్రమాలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్ జోన్లకే పరిమితం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వరకు అంటే లాక్‌డౌన్‌ను మరో నెల రోజుల పాటు పొడిగించింది.

కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిచ్చింది. నాలుగో విడత లాక్‌డౌన్ గడువు ఆదివారంనాటితో ముగియనున్న నేపథ్యంలో శనివారంనాడే లాక్‌డౌన్ ఐదోదశకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కంటైన్‌మెంటేతర జోన్లకు మరిన్ని సడలింపులు వర్తింప జేసింది. వీటిని మొత్తం మూడు దశలుగా విభజించింది. మొదటి దశలో జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య రంగాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. రెండో దశలో స్కూళ్లు, కాలేజీలు, వివిధ విద్యా సంబంధిత సంస్థలకు అనుమతినిచ్చినప్పటికీ కేంద్రంతో చర్చించాకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు తల్లిదండ్రులు, విద్యార్థులతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. వారి అభిప్రాయం మేరకు జులై మాసంలో విద్యాసంస్థలపై నిర్ణయం ఉంటుంది.

ఈ నిర్ణయాధికారిన్ని తుదకు రాష్ట్రాలకే వదిలేదసింది. కర్ఫూ సమయాన్ని కూడా కేంద్రం సడలించింది. బహిరంగ ప్రదేశాల్లో జనసంచారానికి ఇప్పటి వరకు సాయంత్రం 5గంటల వరకు ఉన్న సమయాన్ని రాత్రి 9గంటల వరకు పెంచింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం అనుమతినివ్వలేదు. మెట్రో రైలు సర్వీసులు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, పార్కులు, రాజకీయ, మతపరమైన సదస్సులపై నిషేధం కొనసాగుతుంది. వీటిపై మాత్రం మూడో దశలో నిర్ణయం ఉంటుంది. అప్పటి పరిస్థితులను ఆధారంగా అనుమతి ఇవ్వాలా.. వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర ఆరోగ్య శాఖను సంప్రదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విద్యా సంస్థలను తెరిచే విషయమై కూడా ఆరోగ్యశాఖ చెప్పినట్టే చేయాల్సి ఉంటుందని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలు, జిల్లాలు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను అనుసరించి తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది.

సరుకు రవాణా వాహనాలకు ప్రత్యేక పర్మిషన్లు, ఈపర్మిట్లు అక్కరలేదని స్పష్టం చేసింది. అయితే రవాణాపై తుది నిర్ణయం రెండు రాష్ట్రాలదేనని పేర్కొంది. ప్రయాణికుల రైళ్లు, శ్రామిక్ రైళ్లు, వందేభారత్ మిషన్‌లో భాగంగా విమాన సర్వీసులు యథాతథంగా ఉంటాయని పేర్కొంది. బయటికి వస్తే మాస్కు తప్పనిసరి అని, లేకపోతే జరిమానా ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. 65ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదేశాల్లో తిరగవద్దని సూచించింది. ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా వాడాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. పాన్ మసాలాలు, గుట్కా, పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిషేధ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. వివాహ కార్యక్రమాలకు 50మంది, అంతిమయాత్రలు, కర్మకాండలకు 20మంది వరకే అనుమతినిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.

Lockdown in containment zones extended till june 30