Friday, March 29, 2024

దేనికైనా రెడీ

- Advertisement -
- Advertisement -

cm kcr

 

లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా వంటి దేశం కూడా ఈ వ్యాధి తో అనేక ఇబ్బందులు పడుతోంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ స్థాయిలో ఇండియాలో కరోనా వస్తే 20 కోట్ల మంది వ్యాధి బారిన పడుతారని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు దయచేసి స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించండి. దీనిని ఎదుర్కొవడం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం ప్రధానమంత్రి మోడీ నాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

                                                                                – ముఖ్యమంత్రి కెసిఆర్

60వేల మందికి కరోనా సోకినా వైద్యానికి సిద్ధం
స్వీయ నిర్బంధంలో 20వేల మంది
14వేల మందితో డాక్టర్ల బృందాలను సిద్ధం చేశాం
ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్య పరీక్షలు
ఇప్పటికే 1400 ఐసియు బెడ్లు ఉన్నాయి
500 వెంటిలేటర్లు ఆర్డరిచ్చాం
అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ
గ్రామాల్లో కంచెలు తొలగించాల్సిందే
రాష్ట్రంలో ఆకలి మాటే వినిపించన్వివం
మాంసం, చికెన్ తింటే కరోనా వస్తుందనేది దుష్ప్రచారమే, సి విటమిన్ అందించే బత్తాయి, కమలా పండ్లు తినండి
రూ.35వేల కోట్లతో పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొంటాం : సిఎం కెసిఆర్
ఒక్క రోజులోనే 10 పాజిటివ్ కేసులు
15 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 15వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ మంచి ఫలితాలు ఇస్తుందని, కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా పొడిగించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్దతతో ఉందన్నారు. 60 వేల మందికి సోకినా వై ద్యసేవలు లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. 14వేల అదనపు డాక్టర్ల బృందాన్ని కూడా సిద్దం చేశామని పేర్కొన్నారు. శుక్రవారం నాడు 10 మ ందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. వరి, మొక్కజొ న్న రైతులు ఆగమాగం కావొద్దని, ప్రతీ గింజను మద్ధతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ, గ్రామాన రూ.35 వేల కోట్లతో కొనుగోలు చేస్తుందని తెలిపారు.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు,వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సిఎం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 59కి చేరిందన్నారు. ఇందులో ఒకరు డిశ్చార్జి కాగా 58 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. అలాగే మరో 20 వేల మంది హోమ్ క్వారంటైన్, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారని అభినందించారు. ఇలాంటి ఆంక్ష లు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవారమన్నారు. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదని, అన్ని దేశాలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.

అమెరికా వంటి దేశం కూడా ఈ వ్యాధి తో అనేక ఇబ్బందులు పడుతోందన్నారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ స్థాయిలో ఇండియాలో కరోనా వస్తే 20 కోట్ల మంది వ్యాధి బారిన పడుతారని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు దయచేసి స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని ఎదుర్కొవడం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ విషయంపై శుక్రవారం ప్రధానమంత్రి మోడీ తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సిఎం తెలిపారు.

80.9 శాతం మందికి ఇబ్బంది ఉండదు..
కరోనా సోకిన వారిలో 80.9శాతం మందికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పలు రిపోర్ట్‌లు స్పష్టం చేస్తున్నాయని, వీరికి కరోనాను తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉంటుందని సిఎం తెలిపారు. అయితే వీరు హోం క్వారంటైన్‌ను తప్పక పాటించాలని సూచించారు. ఇక 13.2 శాతం మందికి ఐసోలేషన్ చికిత్స అందిస్తే సరిపోతుందని వివరించారు. కేవలం 4.2 శాతం మందికి మాత్రమే ఐసియూలో ఉంచాల్సి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇతరుల మీద ఆధారపడి ఉండకుండా వైద్యులు, నర్సులకు కల్పించాల్సిన ఇతర ఏర్పాట్లపై కూడా సమీక్షించామని సిఎం చెప్పారు. డాక్టర్లకు ,నర్సులకు ఇతర సిబ్బందికి కావాల్సిన భోజనం, ఇతర సౌకర్యాలతో పాటు రవాణా సౌకర్యాలను కూడా సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 1400 ఐసియూ బెడ్స్‌ను సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇది కాకుండా గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. వెంటిలేటర్లు కూడా 500 ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. 11,500 మంది ఐసోలేషన్‌లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 11వేల మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నిర్ధారణకు విజయ డయాగ్నోస్టిక్స్, అపోలో కేంద్రాలకు ఐసిఎంఆర్ వాళ్లు అనుమతి ఇచ్చారని, పరిస్థితుల రీత్యా రాష్ట్ర ప్రభుత్వ ఐదు కేంద్రాల్లోనే పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు. సిసిఎంబి అందుబాటులోకి వస్తే రోజుకు 800 టెస్ట్‌లు చేయించవచ్చునన్నారు.

వచ్చే నెల 10వ తేదీ వరకు నీటి సరఫరా
రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పంటలు సిద్దంగా ఉన్నాయని సిఎం తెలిపారు. పంట చేతికి వచ్చే సమయమని, అవి వస్తేనే మనం తింటామన్నాని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి, నాగార్జున సాగర్, కాళేశ్వరం, జూరాల కింద నీళ్లు ఏప్రిల్ 10వ తేదీ వరకు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఒక్క ఎకరం పంట కూడా ఎండకుండా పంట పండించుకోవాలన్నారు.

నాది ముందు.. నీది ముందు గాభ వద్దు
రాష్ట్రంలలో 50 లక్షల ఎకరాల్లో పంట సాగులో ఉందని, రైతులు పండించిన ప్రతి పంట గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆగమాగం కావొద్దన్నారు. పంట కోత సక్రమంగా జరగాలని, కోత యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో ఓల్డ్ సిటీలో తప్ప ఎక్కడైనా కర్వూ చూశామా అని వ్యాఖ్యానించారు. రైతులు అనుసవరంగా గబరా పడొద్దన్నారు. నాది ముందు నీది ముందు అని ఆందోళన చెందకుండా ప్రతి రైతు నుంచి ఎంఎస్‌పికి పంట కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఐకెపి కేంద్రాలు పెట్టామని, పౌరసరఫరా, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ గ్రామాల్లో ఉంటారన్నారు. పంట కొనేందుకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రైతులకు చెక్‌లు ఇస్తామని, వారు వచ్చే ముందు బ్యాంకు ఖాతాలను తీసుకరావాలని సూచించారు. మీ డబ్బులు ఎటుపోవు, కొంత అటు ఇటు మీ ఖాతాలో పడతాయన్నారు.

రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యం గోదాంలలో పెడుతామని, అవి కూడా సరిపోకపోతే తాత్కాలికంగా ప్రభుత్వ స్కూల్ లలో పెడుతామన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయవచ్చునని, అయితే కచ్చితంగ ఎంఎస్‌పికే కొనుగోలు చేయాలన్నారు. ఊర్లలో వేసిన కంచెలను కూడా తొలగించాలని, ఊరు పంటలు కొనాలంటే లారీలు, ఇంకా ఇతర రవాణా సరుకులు రావాలని పేర్కొన్నారు. రైతులు అనవసరంగా పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెట్‌లోకి రావొద్దని సూచించారు. వాటిని పూర్తిగా మూసివేశామన్నారు. సిఎండి ప్రభాకర్ రావు మంచి సందేశం ఇచ్చారని, విద్యుత్ శాఖ సిబ్బంది ఇంకో 15 రోజులు 24 గంటల కరెంట్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఏఒక్కరి నుంచి ఆకలి మాట అనేది వినబడకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆలయాల దగ్గర, యాచకులు, అనాధలు ఎవరూ ఆకలికి ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో పనిచేస్తున్న వారికి వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. 5 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు తెలంగాణలో భవన నిర్మాణం, ఇరిగేషన్, రైస్ మిల్లులలో హమాలీలుగా పనిచేస్తున్నారన్నారు. వాళ్ళను రక్షించుకోవటం మన బాధ్యత అని, అలాంటి వారందరికి షెల్టర్లు, ఆహారం, నీళ్ళు, మందులు ఇస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనాలని సూచించారు. కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ మంత్రితో సమన్వయం చేసుకుని వారికి కావల్సిన సౌకర్యాలను కల్పించాలని సిఎం సూచించారు. హాస్టళ్లు కూడా ఉంటాయన్నారు.

గుడ్లు, చికెన్ తింటే కరోనా రాదు..
చికెన్ తింటే కరోనా వైరస్ వస్తదని అందరూ ప్రచారం చేస్తున్నారని ఇది అవాస్తవమన్నారు. చికెన్, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని సిఎం తెలిపారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సి విటమిన్ ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ, సంత్రాలు, బత్తాయితో పాటు దానిమ్మ పండ్లు బాగా ఉపయోగపడుతాయన్నారు. మామిడి పండ్లు కూడా బ్రహ్మాండంగా తినొచ్చు అని మన పండ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా మనమే తినేలా చర్యలు తీసుకుంటామని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశుగ్రాసం తరలించే, కూరగాయలు, పాలు, వాహనాలకు అనుమతి ఉందన్నారు.

రాష్ట్రంలో కరోనా అప్‌డేట్

మొత్తం కేసులు                              59
డిశ్చార్జి                                        1
ట్రీట్‌మెంట్‌లో                                 58
క్వారంటైన్‌లో                           20,000
శుక్రవారం                                     10 పాజిటివ్
మరణాలు                                     నిల్
పరీక్షా కేంద్రాలు                                5 (ప్రభుత్వ)
అనుమతించినవి                               5 (ప్రైవేట్)

Lockdown in Telangana until 15th April
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News