Friday, March 29, 2024

బతుకు బండి పరుగు

- Advertisement -
- Advertisement -

Lockdown-Relaxation

హైదరాబాద్:  రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ జనజీవనం ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్ సందర్భంలో 56 రోజుల సుదీర్ఘ విరామం అనంతర సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి బస్సులు మంగళవారం ఉదయం నుంచే రోడ్లెక్కాయి. ఇతరత్రా వాహనాలు, కార్లు, ఆటోలు సైతం రోడ్లపై పరుగులు దీస్తున్నాయి. అన్ని రకాల వ్యాపార సముదాయాల ద్వారాలు ఇప్పటికే తెరుచుకున్నాయి.

ఎలక్రికల్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ షాపుల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. సమ్మర్ కావడంతో ఎసిలు, ఫ్రిజ్‌లు, రిఫ్రిజరేటర్ తదితరాలను కొనేందుకు వినియోగదారులు పోటెత్తారు. జిల్లాల్లో వ్యాపార సముదాయాలు పూర్తిస్థాయిలో నిర్వహణలోకి రాగా.. హైదరాబాద్‌లో మాత్రం సరి, బేసి సంఖ్యలో ఆయా వ్యాపార సముదాయాలకు(జ్యువెల్లరీ షాపులతో సహా) అనుమతులను ఇచ్చారు. సెల్‌ఫోన్ విక్రయాలకు అడ్డా అయిన ఆబిడ్స్ జగదీష్ మార్కెట్లో అమ్మకాలు షురూ అయ్యాయి. సరిబేసి సంఖ్యలో వాహనాల కేటాయింపుల వల్ల వారంలో మూడు రోజులు మాత్రమే షాపులు తెరిచే సమయం ఆయా షాపులకు దక్కనుంది.

ఈ రకంగా వ్యాపారాలు నిర్వహించుకోవడం వల్ల తమకు నెలకు 12 రోజులు మాత్రమే షాపులు తెరుచుకునే సౌలభ్యం ఉంటుందని, తద్వారా తమ తమ షాపులలో సిబ్బందిని తగ్గించుకుని నడపాల్సి పరిస్థితి ఉంటుందన్నారు. నిర్దేశిత షాపులలో పనిచేస్తున్న సదరు సిబ్బందికి బయటకెళ్లినా ఎక్కడా పనిచేయలేని పరిస్థితి నెలకొనే అవకాశం లేకపోలేదని షాపుల నిర్వాహకులు వాపోతున్నారు. ఈ విధానం వల్ల షాపుల అద్దెలను కూడా కట్టుకునే పరిస్థితి ఉండబోదని కొందరు షాపు వ్యాపారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

అయితే, ఈ విధానానికి త్వరలో ముగింపు ఉండొచ్చన్న ఆశాభావంతో ఉన్నామని సదరు షాపుల నిర్వాహకులు అంటున్నారు. కాగా, షాపుల(దుకాణాల) నిర్వాహకులు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంది. మాస్క్ ధరించిన వినియోగదారులను షాపుల్లోకి అనుమతించాలి. శానిటైజేషన్ కంపల్సరీ. భౌతిక దూరం అనివార్యం. ఈ రకంగా అన్నీ ఓపెన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువులను ఆయా షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.

కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరగకపోయినప్పటికీ ప్రత్యామ్నాయంగా ఆటోలు, కార్లకు అనుమతి లభించింది. అదీ కూడా నిబంధనలతో నడిపే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రజలు వాటిని వినియోగించుకుని షాపింగ్‌కు వెళుతూ తమకు కావాల్సిన వస్తువులను సంబంధిత షాపులలో కొనుగోలు చేస్తున్నారు.

బస్సులలో ప్రయాణీకుల రద్దీ

జిల్లాల వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి ప్రారంభమవ్వగా తొలి రోజు ప్రయాణీకులు పలుచగా ఉన్నప్పటికీ బుధవారం మాత్రం ఆయా జిల్లాల ప్రధాన బస్టాండ్‌లు పయాణీకుల రద్దీతో కిటకిటలాడాయి. బస్ డిపోల నుంచి బస్సులను బుధవారం కూడా పూర్తిస్థాయిలో శానిటైజేషన్ ప్రక్రియ ముగించిన తర్వాత ఆయా బస్ డిపోల నుంచి బయటకు దీశారు. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు మాస్క్‌లు, శానిటైజేషన్‌లను ఇచ్చి పంపారు.

కొన్ని చోట్ల శానిటైజేషన్‌ల పంపిణీ జరగలేదు. బుధవారం యధావిధిగా ఉదయం 6 గంటలకే బస్సులన్నీ బయల్దేరాయి. బస్టాండ్‌లలో ప్రయాణీకుల రద్దీ ఉండటంతో తొలి రోజు 20 నుంచి 30 శాతం మేర ఉన్న ఆక్యుపెన్సీ రేటు బుధవారం 50 శాతం ఆక్యుపెన్సీకి చేరింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

ప్రయాణీకుల రద్దీతో బస్సుల సంఖ్య పెంపు

ఇదిలా ఉండగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62౦౦ బస్సులలో 2900 బస్సు సర్వీసులను నడపగా.. బుధవారం ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం మొత్తం 35౦౦ బస్సు సర్వీసులను నడిపారు. ఆక్యుపెన్సీ శాతానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుకుంటూ పోతూ మొత్తంగా 6200 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. ఆయా జిల్లాల నుంచివచ్చే బస్సులన్నీ హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాలైన ఉప్పల్ చౌరస్తా, జేబీఎస్, ఆరాంఘర్, హయత్‌నగర్‌ల వరకే నడుపుతున్నారు. ఆయా జిల్లాల నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరే బస్సులన్నీ సాయంత్రం 7 గంటల కల్లా సంబంధిత డిపోలకు కచ్చితంగా చేరుకోవాల్సిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News