Thursday, April 25, 2024

తమిళనాడు లాకప్ మరణాలు

- Advertisement -
- Advertisement -

Lockup deaths are police killings

 

లాకప్ మరణాలు పోలీసులు చేసే హత్యలేనని చాలా కేసుల్లో పదేపదే నిర్ధారణ అవుతున్నది. చట్టం అనుమతి లేకుండా క్రూరంగా హింసించడం, దాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోడంలో సామాన్యుల కంటే పోలీసులదే పైచేయి అనేది కూడా రూఢి సత్యమే. యూనిఫాం దురాగతాలు తగ్గుముఖం పట్టకపోడానికి కారణాలను సరిగ్గా పట్టుకొని నిర్మూలించవలసిన అవసరం ఉంది. అమెరికా, మినియా పొలీస్ నగరంలో సంభవించిన జార్జి ఫ్లాయిడ్ దారుణోదంతం మరచిపోక ముందే తమిళనాడు, తూత్తుకుడి సమీపంలోని సంతకుళంలో తండ్రి కొడుకులైన వ్యాపారులిద్దరు పోలీసుల చిత్ర హింసలకు బలైపోయిన ఘటన ఆందోళన కలిగిస్తున్నది. న్యాయమూర్తులు, శిక్షలు అమలు చేసేవారు ఈ రెండూ తామే అయిపోయి దేశంలోని పోలీసులు ఎంతకు తెగిస్తున్నారో, ఖాకీ దుస్తుల మాటున ఎందరి ప్రాణాలను నేరుగా తీస్తున్నారో కదా అనే అభిప్రాయాన్ని సంతకుళం ఘటన మరింత గట్టి పరిచింది.

ఆ పట్టణంలో లాక్‌డౌన్ కర్ఫ్యూను అమలు చేస్తున్న గస్తీ బృందాన్ని జయరాజ్ అనే మొబైల్ ఫోన్స్ దుకాణ యజమాని విమర్శించాడని ఎవరో చెప్పగా కోపంతో ఊగిపోయిన స్థానిక పోలీసులు ఆ మరునాడు అతడిని నిర్బంధించి తీసుకు వెళ్లారు. జయరాజ్ కుమారుడు బెంకిన్స్ కూడా వారి వెంట పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ తన తండ్రిని కొడుతున్న పోలీసు అధికారిని అడ్డుకున్నందుకు అతడిని కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. తండ్రికొడుకులిద్దరినీ పోలీసు స్టేషన్‌లో గంటల తరబడి చితకబాదారు. శరీరం మీద, లోపల కూడా బాగా గాయాలై ఇద్దరికీ రక్తం ధార కట్టడం మొదలయింది. ఆ మరుసటి రోజు ఆ స్థితిలోనే వారిని పోలీసులు కోర్టుకు తీసుకు వెళ్లారు. కోర్టు భవనం మొదటి అంతస్తు నుంచే పోలీసులు చెప్పింది విని మేజిస్ట్రేటు రిమాండు చెప్పగా, వారిద్దరినీ సబ్ జైలుకు తరలించారు. అప్పటికీ రక్తం ఆగకపోయే సరికి ఆసుపత్రిలో చేర్చగా వారు ఒకరి తర్వాత ఒకరు కొద్ది గంటల వ్యవధిలోనే చనిపోయారు.

ఈ ఘటనపై వెంటనే తీవ్రంగా స్పందించి ఉండవలసిన ఉన్నత స్థాయి పోలీసులుగాని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగాని అలా చేయలేదు. ఆలస్యంగా కొందరు పోలీసులపై శాఖాపరమైన చర్య తీసుకొని సస్పెన్షన్‌లో పెట్టారు. ఈ సమాచారం దావానలంలా వ్యాపించి రాష్ట్ర మంతటా నిరసనలు వెల్లువెత్లాయి. అప్పటికి తేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలుత న్యాయ దర్యాప్తుకు ఆదేశించి అనంతరం కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. ఎవరినైనా, ఎంతటి నేరస్థులనైనా నిందితులుగా మాత్రమే పరిగణించి కస్టడీలోకి తీసుకోడం, అరెస్టు చూపించడం వరకే పోలీసుల పని, తమ వద్ద ఉన్నంత వరకు వారి ప్రాణ రక్షణ బాధ్యత కూడా వారిదే. నిందితుల మీద చేయి వేసే అధికారం గాని, ఇతర అసౌకర్యం కల్పించే స్వేచ్ఛగాని పోలీసులకు ఉండవు. చట్టానికి అప్పగించే పనే వారు చేయవలసింది. అందుకు విరుద్ధంగా చిత్ర హింసలకు గురి చేయడం, ఎన్‌కౌంటర్ పేరిట చంపడం వంటి ఎన్నో హంతకోన్మాదాలను పోలీసులు ప్రదర్శిస్తున్నారు.

ఇది వారు పొందుతున్న శిక్షణ లోపం వల్లనే అయి ఉండాలి. అదే నిజమైతే దానిని సమూలంగా మార్చాలి. పోలీసుల తలకెక్కుతున్న ఫ్యూడల్, పెత్తందారీ, నిరంకుశ పోలీసింగ్ లక్షణాలను పూర్తిగా తుడిచిపెట్టాలి. ఇలాంటి కస్టడీ హత్యలకు పాల్పడుతున్న పోలీసులకు, వారి తక్షణ పై అధికారులకు హంతకులకు విధించే కఠినమైన శిక్షలు అమలయ్యేలా చూడాలి. 2019లో దేశంలో 1731 కస్టడీ మరణాలు సంభవించాయి. రోజుకి ఐదుగురు వంతున చనిపోయారు. వీరిలో 1606 మంది జ్యుడిషియల్ కస్టడీలో, 125 మంది ప్రత్యక్ష పోలీసు నిర్బంధంలో ప్రాణాలు విడిచారు. పోలీసుల లాకప్‌లో మరణాలు 125లో 14 ఉత్తరప్రదేశ్‌లో సంభవించాయి. చెరి 11తో, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి. చిత్ర హింసల వ్యతిరేక జాతీయ సంస్థ నివేదిక ఈ లెక్కలను ఇటీవల బయట పెట్టింది. తమిళనాడు సంతకుళం జంట లాకప్ మరణాల ఉదంతంలో నిందితులిద్దరి పరిస్థితిని స్వయంగా పరిశీలించకుండా రిమాండ్‌కు పంపిన మేజిస్ట్రేట్ తొందరపాటుతనం కూడా ఉంది.

దేశం మొత్తమ్మీద పోలీసు దృష్టి పరమ నిరంకుశంగా తయారయింది. తలచుకున్నదే తడవుగా ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకొని హద్దు మీరి వ్యవహరించడం తమ హక్కుగా వారు భావిస్తారు. ఇందుకు దేశంలోని న్యాయ వ్యవస్థ అసమగ్రత, తగినన్ని ధర్మాసనాలు లేకపోడం వంటి కారణాలెన్నో! పాలకులు చెప్పినట్టు నడుచుకుంటే చాలుననే ధోరణి పోలీసుల్లో ప్రబలిపోయింది. చట్టాన్ని గౌరవించి అది చెప్పినట్టు నడచుకునేతనం వారి నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఈ దుస్థితిని కూకటివేళ్లతో పెకలించకపోతే దేశంలోని సామాన్యులకు పోలీసుల నుంచి రక్షణ లభించదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News