Friday, March 29, 2024

పంటల ‘మహమ్మారి’ మిడతల దండు

- Advertisement -
- Advertisement -

Locusts--attack

 ఇప్పటికే అనేక చీడ పీడలతో అన్నదాత సతమతం
మిడతల దండుపై అధికారులు, రైతుల్లో ఆందోళన
ఏడాదిలో2500 మంది ఆహారం.. ఒక్క మిడతే తినేస్తుంది
పచ్చిక బయళ్లను వదలని వైనం.. రాష్ట్రంలో యాసంగి పూర్తి
మూడు నెలలు కీలకం… మిడతలు వస్తే ఈ నెల రోజుల్లోనే మట్టుబెట్టాలి
పకడ్బందీ ప్రణాళిక.. సమన్వయం.. సామూహిక దాడితోనే సాధ్యం

హైదరాబాద్ : రాష్ట్ర రైతులను అనేక విపత్కర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి మిడతల దండు చేరింది. ఇప్పటికే పంటల విషయంలో అనేక చీడ, పీడల బెడద ఎదుర్కొంటుండగా ఇప్పుడు మిడతల బెంగ పట్టుకుంది. గత ఏడాదిలో కత్తెర పురుగు నష్టాలను మిగిల్చింది. పత్తికి గులాబీ రంగు పురుగు, వరికి దోమకాటు, అగ్గితెగులు ఇలా అనేక సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో యాసంగి పంట ఉత్పత్తులు చేతికొచ్చి రైతులు విక్రయాలు జరిపారు. ఇప్పుడే వానాకాలం సాగవుతోంది.

కొన్నిచోట్ల వరినాట్లు మొదలయ్యాయి. మరో నెల రోజుల్లో వానాకాలం సాగు పనులు ముమ్మరంగా సాగుతాయి. రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల వరకు పంటల సాగుపై ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ప్రధానంగా వరి, పత్తి, కంది, సోయాబీన్ పంటలు ఉన్నాయి. మిడతలు పచ్చిక బయళ్లనే వదలడం లేదని ఇక వరి, కంది, పత్తి పంటను నాశనం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాగు పంటలు లేనప్పటికీ మూడు నెలల్లో అవి రాష్ట్రానికి చేరుకుని ఇక్కడే తిష్ట వేస్తే ఏమిటనేది ఊహించడానికే భయంకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హరియాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని పంట పొలాలకు మిడతల దండుతో నష్టం వాటిల్లుతోంది. అయితే పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తే వీటిని ఎదుర్కొవచ్చునని చెబుతున్నారు. ఎక్కడిక్కడ అధికారులు, రైతులు చైతన్యవంతమై వీటిని తరిమికొట్టడమో.. చంపేయడమో చేయాలని సూచిస్తున్నారు. మిడతల దండు ఇప్పుడు మహారాష్ట్రకు చేరుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి దగ్గరలోనే ఉన్న అమరావతి వరకు వచ్చినట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. గాలి దిశ కారణంగా ఇవి నైరుతి వైపు కదులుతున్నట్లు మిడతల దండుపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న లోకస్ట్ వార్సింగ్ సెంటర్ చెబుతోంది. అయితే ఈ సమయంలో ఇప్పటి వరకు మిడతల దండును ఎదుర్కొనని మనకు ఇదొక సవాల్‌గా మారింది. ఇక్కడకు వచ్చింది ఎడాది మిడతలుగా అధికారులు చెబుతున్నారు.

మిడతల్లో ఇవి ఒక రకం. గుడ్ల నుంచి పుట్టి ఎగిరే జీవులుగా ఇవి పరిణామం చెందుతాయి. ఎడారి మిడతలు సాధారణంగా ఒంటరిగానే జీవిస్తుంటాయని, కొన్ని కొన్ని సార్లు మాత్రం వాటి స్వభావం ప్రమాదకరంగా మారుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఇలా ఒక్కటవుతాయి..

ముందుగా పచ్చటి గడ్డి మైదానాలపై ఈ మిడతలు పోగవుతాయి. ఒంటరితనాన్ని వదిలి సమూహంగా మారి, ప్రమాద రూపం తీసుకుంటాయి. గుంపుగా మారే ఈ కొత్త దశలో మిడతల రంగు కూడా మారిపోతుంది. క్రమంగా ఇవి దండుగా తయారవుతాయి. భారీ సమూహాలుగా ఎగురుతూ పంటలపై దాడులు చేసే మహమ్మారిలా పరిణమిస్తాయి. ఈ మిడతల దండు చాలా భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ గుంపు కొన్ని వందల కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉండవచ్చునని, అలాంటి దండు రోజుకు 200 కిలోమీటర్లు ప్రయాణించగలదని పేర్కొంటున్నారు.

మెరుగైన నియంత్రణ.. పర్యవేక్షణతోనే…

ప్రస్తుతం మిడతల నియంత్రణకు ఎక్కువగా అందుబాటులో ఉన్న పద్ధతి క్రిమి సంహారకాలు పిచికారమే చేయడమే. విమానాల సాయంతో, స్ప్రే పంపులు, డ్రోన్‌ల సాయంతో పిచికారీ చేసి వీటిని చంపుతున్నారు. అలాగే జీవ క్రిమ సంహారకాలు, మిడతలను తినే ఇతర జీవులను ప్రవేశపెట్టేవి ఇతర దేశాల్లోని కొన్నిచోట్ల చేస్తున్నారు. మనదేశంలోనూ రాజస్థాన్‌లో అప్పుడప్పుడు మిడతల ప్రభావం ఉంటున్నప్పటికీ 30 ఏళ్లలో ఈ స్థాయిలో ఉండటం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. గత డిసెంబర్‌లోనూ గుజరాత్‌లో మిడతల దాడితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మిడతల దండుపై నిరంతర పర్యవేక్షణ

మిడతల దండుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో 12వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో పాటు మార్కెట్‌కు అనుగుణంగా పంటలు పండించడంలో, డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత పాటించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో వర్సిటీ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. కొవిడ్ 19 నేపథ్యంలతో బోధన, పరిశోధన సహా వ్యవసాయంలోనే అనేక మార్పులు జరగనున్నాయని తెలిపారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు పథకాలకు ఆమోదం తెలిపింది.

Locusts to attack crops in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News