Home జాతీయ వార్తలు ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్‌సభ ఒకె

ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్‌సభ ఒకె

Lok-Sabha

కాంగ్రెస్, టిఎంసితో పాటు మిత్రపక్షం జెడి(యు) వాకౌట్
కాషాయ అజెండా : ప్రతిపక్షం, సమానత్వానికి అండ : ప్రభుత్వం

ఓటింగ్‌లో అనుకూలం 303, ప్రతికూలం 82

న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును గురువారం లోక్‌సభ ప్రతిపక్షాల వాకౌట్లు, అంతకు ముందు తీవ్రస్ధాయి వాదోపవాదాల తరువాత ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది ఎంపిలు ఓటేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుతో ము స్లిం మగవారు ట్రిపుల్ తలాక్‌కు దిగితే జైలు శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో నెగ్గాల్సి ఉంటుంది.బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జెడియు, టిఎంసి సభ్యులు సభ నుంచి వాకౌట్ జరిపాయి. బిజెపి రాజకీయ అజెండాలో భాగంగానే ముస్లింలను లక్షం గా ఈ బిల్లు తీసుకువచ్చారని ప్రతిపక్షాలు విమర్శించా యి. ఇప్పుడున్న స్థితిలో బిల్లు తమకు ఆమోదయోగ్యం కాదని, సవరణలు అవసరం అని కాంగ్రెస్ స్పష్టం చేసిం ది. కాంగ్రెస్‌తోపాటు డిఎంకె కూడా బిల్లును స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని డిమాండ్ చేసింది.
వాడివేడి చర్చ
లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ గురువారం ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు, సభలో గందరగోళం మధ్య సాగింది. బిల్లు యధాతథ స్థితిలో తమకు ఆమోదయో గ్యం కాదని, దీనిని సమీక్ష కోసం స్థాయి సంఘానికి పంపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. దేశంలోని ముస్లింలపై గురిపెట్టుకునే ఈ చట్టాన్ని తీసుకురావాలని బిజెపి యత్నిస్తోందని కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. బిల్లులోని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయనే ప్రతిపక్షాల వాదనను న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. బిల్లును సభ ఆమోదానికి ఆయన ప్రవేశపెట్టారు. లైంగిక సమానత్వం, న్యాయం కోణంలోనే ఈ బిల్లును ప్రతిపాదించినట్లు న్యాయశాఖ మంత్రి చెప్పారు. మూడుసార్లు తలాక్‌లు చెప్పి భార్యకు విడాకులు ఇచ్చే పద్థతిని సుప్రీంకోర్టు 2017 ఆగస్టులో కొట్టివేసింది. అయినప్పటికీ తలాకేబిద్దత్ అనే ఈ పద్థతి కొనసాగుతోందని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు రావడాని కి ముందు 2017 జనవరి నుంచి ఆగస్టు వరకూ 574 ట్రిపుల్ తలాక్ ఘటనలు జరిగాయని, సుప్రీంకోర్టు తీర్పు తరువాత వీటి సంఖ్య 300కు పైగా ఉందని పత్రికలలో వార్తలు వచ్చాయని మంత్రి వివరించారు. ‘ఈ దశలో మనం ఏం చేయాల్సి ఉంటుంది? ముస్లిం మహిళలు మునుపటిలాగానే అణచివేతకు గురికావల్సిందే నా? అని మంత్రి ప్రశ్నించారు. పాకిస్థాన్, మలేసియా వంటి 20 ముస్లిం దేశాలే ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని నిషేధించాయని, మరి లౌకిక భారతదేశంలో ఎందుకు నిషేధించకూడదని మంత్రి ప్రశ్నించారు.

ట్రిపుల్ తలాక్‌పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించిన ఒక తీర్పు లో ట్రిపుల్ తలాక్‌పై స్పష్టమైన రూలింగ్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ట్రిపుల్ తలాక్ షెరియత్‌లో అంతర్భాగంగా ఉన్నందున ఈ ఆచారాన్ని నిలిపివేసేందుకు చట్టం తీసుకురావల్సి ఉందని స్పష్టం చేశారని, ఇందుకు అనుగుణంగానే బిల్లును తీసుకువచ్చినట్లు, సభ దీనికి ఆమోదం తెలియచేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లును రాజకీయ, మతపరమైన కోణంలో చూడరాదని న్యాయశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తారనే భయాందోళనలు అవసరం లేదని, ఇందుకు బిల్లులో మూడు సరికొత్త నిబంధనలు జోడించినట్లు వివరించారు. ఘటనల గురించి మంత్రి సభలో వార్తా పత్రికల పేర్లను చెప్పడం, వాటి ప్రతులను చూపించడం సరికాదని స్పీకర్ ఓం బిర్లా మంత్రికి సలహా ఇచ్చా రు. బాధితుల తరఫున కేవలం సమీప బంధువులే పిటిష న్ దాఖలు చేయాలి. రాజీకి వీలుంటుంది. బాధితురాలి వాదన విన్న తరువాత నిందితుడికి మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ఉద్ధేశం సరిగ్గా లేదు, సమీక్షించాల్సిందే : కాంగ్రెస్
బిల్లులోని అంశాలు సముచితంగా లేవని, దీనిని స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దురుద్ధేశంతో వ్యవహరిస్తోందని, స్పష్టత లేని బిల్లును ఆమోదించడం కుదరదని చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్ సభ్యులు మెహమ్మద్ జావెద్ స్పష్టం చేశారు. ముస్లింల్లో మగవారిని జైలు పాలుచేసి, కుటుబాలను దెబ్బతీసే విధంగా బిల్లులోని కరకు షరతులు ఉన్నాయని జవెద్ ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును సమీక్షించాల్సి ఉందని, కేవలం ముస్లిం వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు చెందిన విడాకులు పొందే మహిళలకు సంబంధించి చట్టాలు తీసుకువస్తే బాగుంటుందని సూచించారు. ముస్లిం మహిళలతో పోలిస్తే హిందువులలోనే ఎక్కువ మంది మహిళలు విడాకులు పొందారని అన్నారు. దేశంలో పలుచోట్ల సామూహిక దాడులు జరుగుతున్నాయని, వీటి గురించి ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను ఇతర మహిళలను వేరు చేసి చూసే పద్ధతి రాజ్యాంగంలోని 14వ అధికరణ ఉల్లంఘననే అవుతుందని విమర్శించారు.

బిజెపి నిర్థిష్ట అజెండాలో భాగంగానే ఈ బిల్లును తీసుకువస్తోందన్నారు. ఈ వాదనను బిజెపికి చెందిన మీణాక్షీ లేఖీ ఖండించారు. ఇది బిజెపి అజెండా కాదని దేశం అజెండా అన్నారు. యుపిలో అఖిలేష్ యాదవ్ సిఎంగా ఉన్నప్పుడు మతపరమైన అనధికార న్యాయస్ధానాలు తీర్పులు వెలువరించాయని లేఖీ చెప్పినప్పుడు సభలో నిరసన వ్యక్తం అయింది. లోక్‌సభ సభ్యుడు అయిన అఖిలేష్‌కు బిజెపి సభ్యురాలికి మధ్య వివాదం చెలరేగింది. ఈ దశలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కలుగచేసుకుని మహిళా ఎంపి మాట్లాడుతుండగా మగ ఎంపి అడ్డుతగలడం సరికాదన్నారు. ఐయుఎంఎల్ సభ్యులు పికె కున్హలికుట్టి స్పందిస్తూ బిల్లు వివక్షతతో ఉందన్నారు. ముస్లిం మహిళకు సంబంధించిన ఈ విషయంలో ఒక్క ముస్లిం సంస్థతో అయినా మాట్లాడారా? అని నిలదీశారు. గత జనగణన మేరకు చూస్తే ముస్లింలలో విడాకులు కేవలం 0.56 శాతం ఉన్నట్లు వెల్లడైందని, ఇతర వర్గాల్లో ఇది అత్యధికంగా ఉందని తెలిపారు.
ముస్లింలను టార్గెట్ చేసుకున్నారు
ఎన్‌కె ప్రేమచంద్ర ఆర్‌ఎస్‌పి సభ్యులు
బిజెపి వారి నిర్థిష్ట రాజకీయ అజెండాలో భాగంగానే , పూర్తి స్థాయి రాజకీయ దురుద్ధేశాలతోనే ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువచ్చారని ఆర్‌ఎస్‌ఫి సభ్యులు ఎన్‌కె ప్రేమాచంద్ర విమర్శించారు.న్యాయస్థానం మైనార్టీ తీర్పును ప్రాతిపదికగా చేసుకునే ఈ బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూకదాడుల నిషేధంపై ఎందుకు చట్టం తీసుకురావడం లేదని, శబరిమల దేవాలయ ఆచారాలపై ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ నిషేధ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు.
మిత్రపక్షం నిరసన వాకౌంట్
ట్రిపుల్ తలాక్ బిల్లును ఎన్‌డిఎ మిత్రపక్షం అయిన జెడియ వ్యతిరేకించింది. సభ నుంచి వాకౌట్ జరిపింది. ఈ బిల్లుతో సమాజంలో విశ్వసనీయత పోతుందని , అపనమ్మకాలు పెరుగుతాయని, వివిధ వర్గాల మధ్య అసమానతలు పెరుగుతాయని జెడియు సభ్యులు రజీవ్ రంజన్ సింగ్ విమర్శించారు. మైనార్టీ వర్గాలలో సరైన అవగావహన లీసుకువచ్చి, ఈ విధానం సరికాదని చైతన్యపరిస్తే మంచిదని సూచించారు. తమ పార్టీ ఈ బిల్లుకు సమ్మతం కాదని , సమాజంలో కటుతర చట్టాలతో నడవదని, ప్రతి ఒక్కరికి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయని తేల్చిచెప్పారు.
కళ్లల్లో కళ్లు పెట్టి చూడాలనే ఉంది
ఎస్‌పి ఎంపి ఆజం ఖాన్ వ్యాఖ్యల కలకలం
ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ దశలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపి ఆజంఖాన్ సభలో కలకలం రేకెత్తించారు. తలాక్ బిల్లుపై చర్చ దశలో ఆయన మాట్లాడుతూ ఉన్న దశలో సభాధ్యక్ష స్థానంలో ప్యానెల్ స్పీకర్‌గా బిజెపి సభ్యురాలు రమాదేవీ ఉన్నారు. ఆమెను ఉద్ధేశించి ఆజంఖాన్ ‘మేడం నాకు మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలనే ఉంది’ అన్నారు. దీనిపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు అనుచితం అని , ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని బిజపి వారు పట్టుపట్టారు. అయితే సభా కార్యక్రమాల దశలో తాను మాట్లాడింది సబబే అని, ఇందులో పార్లమెంటరీ సాంప్రదాయలకు భంగకరం ఏదీ లేదని, అన్‌పార్లమెంటేరియన్ వ్యాఖ్యలు లేనందున తాను క్షమాపణ చెపాల్పిన పనిలేదని, అయినా స్పీకర్ స్థానంలో ఉన్న సభ్యురాలు తనకు సోదరి వంటిదని ఖాన్ వివరణ ఇచ్చుకుని సభ నుంచి వాకౌట్ జరిపారు. సభలో చర్చ దశలో సభ్యుడు కేవలం సభాధ్యక్ష స్థానం వైపు చూస్తూనే మాట్లాడాల్సి ఉంటుందని, వేరు దిక్కు చూస్తూ ఇతరులను గమనిస్తూ మాట్లాడవద్దని స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి పేర్కొన్న దశలో వెంటనే ఖాన్ తాను కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలనే అనుకుంటున్నానని అనడం కలకలం రేపింది ఈ వ్యాఖ్యలను ఆ తరువాత సభాధ్యక్ష స్థానంలోకి వచ్చిన స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలిగించారు.

Lok Sabha passes Triple Talaq bill