Home ఖమ్మం లండన్‌లో అదృశ్యమైన శ్రీహర్ష మృతి

లండన్‌లో అదృశ్యమైన శ్రీహర్ష మృతి

Sri-harsha

 ఇటీవల బీచ్ వద్ద లభించిన మృతదేహం శ్రీహర్షదిగా నిర్ధారణ
 డిఎన్‌ఏ నివేదికతో తేల్చిన యుకె పోలీసులు
 రేపు ఖమ్మంకు రానున్న మృతదేహం
 జపాన్ ప్రాజెక్టు వర్కే ప్రాణంమీదికి తీసుకొచ్చిందా?
 గాయాలతో మృతి చెందినట్లు దృవీకరించిన లండన్ పోలీసులు
 విచారణ కొనసాగుతుందని ప్రకటించిన యుకె అధికారులు

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : లండన్‌లో గత నెల 21న అదృశ్యం అయిన ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు సన్నే ఉదయ్ ప్రతాప్ కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష ఎట్టకేలకు మృతి చెందినట్లు నిర్థారించారు. పక్షం రోజుల క్రితం లండన్‌లోని బీచ్ వద్ద లభించిన గుర్తు తెలియని మృతదేహం శ్రీహర్ష ది గా అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది.గత నెల 21న యూనివర్శిటీకి వెళ్తున్నానని చెప్పి తాను ఉండే హాస్టల్ నుంచి ఉదయం నాలుగు గంటలకు బయలుదేరిన హర్ష కనిపించకపోవడంతో యూనివర్శిటీ అధికారులు మిస్సింగ్ కేసుగా అక్కడి పోలీసుకు ఫిర్యాదు చేయడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 1వ తేదీన లండన్ బీచ్ సమీపంలో ఒక మృతదేహాన్ని కనుగొన్న అక్కడి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అక్కడి ఆసుపత్రిలో భద్రపరిచిన మృత దేహాన్ని తల్లిదండ్రులకు చూపించగా అతని జేబులో లభించిన పర్స్ ఆధారంగాతో మృత దేహం శ్రీహర్షదిగా నిర్ధారించారు. అయితే శవం బాగా కుళ్ళిపోవడంతో డిఎన్‌ఏ పరీక్షకు పంపించారు. డిఎన్‌ఏ నివేదిక సోమవారం రావడంతో బిచ్ సమీపంలో లభించిన మృతదేహం శ్రీహర్షదిగా నిర్దారించారు. దీంతో అతని మృతదేహాన్ని బుధవారం లండన్ నుంచి హైదరాబాద్‌కు పంపించనున్నారు. ఇప్పటికే సన్నే ఉదయ్ ప్రతాప్ కుటుంబసభ్యులు ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం కల్లా శ్రీహర్ష మృతదేహం చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవలనే నెల రోజుల పాటు ప్రాజెక్టు వర్క్ మీద జపాన్ దేశంలో పర్యటించి విజయవంతంగా వచ్చారు. అక్కడి ప్రాజెక్టు వర్క్ పై సమర్పించిన ప్రాజెక్టు నివేదకే ప్రాణం మీదికి తీసుకొచ్చినట్లు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. శ్రీహర్షకు సంబంధించిన సెల్‌ఫోన్ లాక్‌ను లండన్ పోలీసులు తీయలేకపోయారు. మూడు రోజుల క్రితం ఆ సెల్‌ను అతని తండ్రి ఉదయ్ ప్రతాప్ హైదరాబాద్‌కు తీసుకొచ్చి లాక్‌ను అన్‌లాక్ చేయించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్ లిస్ట్, టెక్ట్ మెస్సేజ్‌లు ఇతర అన్ని రకాల డెటాను పెన్‌డ్రైవ్‌లో భద్ర పరిచి లండన్ పోలీసులకు పంపించారు. సెల్ ఫోన్‌ను లాక్ తీసే సమయంలో కొంత డెటా మిస్స్ అయింది. ఆ డేటాను కూడా రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరణ ధృవీకరణ పత్రంలో మాత్రం గాయాలతో మృతిచెందినట్లు పేర్కొన్నారని పూర్తి స్థాయి నివేదిక తరువాత మరణానికి గల కారణాలను తెలియజేస్తామని అక్కడి పోలీసులు తెలిపారని ఉదయ్ ప్రతాప్ ‘మన తెలంగాణ’ ప్రతినిధికి తెలిపారు. ఆత్మహత్య చేసుకునేవాడైతే తల్లికి చెప్పేవాడని లేదా లేఖ రాసేవాడని కనీసం ఒక చిన్న మెస్సేజ్ పెట్టేవాడని కాని అతని రూంలోగాని, అతని ల్యాప్‌ట్యాప్‌లోగాని ఎలాంటి చిన్న విషయం కూడా లేదన్నారు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నందున పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అక్కడి పోలీసులను కోరామని ఆయన చెప్పారు. కాల్‌డేటా సంపాదించడంలో గానీ, సెల్‌లాక్‌ను తీయడంలోగానీ, బ్యాంక్ ఖాతాలో స్టేట్‌మెంట్‌ను సంపాదించడంలో చొరవ చూపని పోలీసులు తాము వెళ్ళి అక్కడ గాలిస్తున్న సమయంలో మృత దేహాన్ని గుర్తించడం కూడా తమకు అనుమానం కలుగుతుందన్నారు.
మ్యూజిక్ కోర్సులో అవార్డు ఇస్తాం… శ్రీహర్ష తల్లిదండ్రులకు లేఖ
లండన్‌లో ఎంఎస్ అయిపోయిన తరువాత తనకు ఇష్టమైన మ్యూజిక్ కోర్సులో కూడా చేరారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మ్యూజిక్ పోటీలకు కో ఆర్డ్డినేటర్‌గా వ్యహరించి ఒక పేపర్‌ను కూడా ప్రజెంట్ చేశారు. అతి చిన్న వయస్సులోనే అతను సమర్పించిన పేపర్ ప్రజెంటేషన్‌ను సంబంధిత యూనివర్శీటి డీన్ అభినందించారు. ఈ సందర్భంగా లండన్ యూనివర్శిటీలో ప్రతిభావంతులైన విద్యార్థులకు చనిపోయిన తరువాత ఇచ్చే అవార్డు ఇవ్వదలిచామని లండన్ యూనివర్శిటీ డీన్ శ్రీహర్ష తల్లిదండ్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

London police confirm Sriharsha death at beach