Home తాజా వార్తలు సరిహద్దులు దాటితే చలాన్ల వడ్డనే…!

సరిహద్దులు దాటితే చలాన్ల వడ్డనే…!

Lorry owners struggles at borders of telugu states

 

కౌంటర్ సిగ్నేచర్, సింగిల్ పర్మిట్ విధానంపై నిర్ణయం తీసుకొని ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు
ట్రిప్పునకు అదనంగా చెల్లిస్తున్నాం
ఆందోళన చెందుతున్న లారీల యజమానులు

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న రవాణా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఆంక్షలు, నిబంధనలు తొలగిపోయాయనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో సమస్య ఎదురయ్యింది. ఈ సమస్యతో తెలుగు రాష్ట్రాల లారీ పరిశ్రమ యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. సరకు రవాణా చేసే క్రమంలో ఎపి, తెలంగాణ సరిహద్దు దాటగానే వారికి చలాన్ల వడ్డన మొదలవుతోంది. ఒక్కో ట్రిప్పునకు వేలాది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సింగిల్ పర్మిట్ ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదాయంలో ఎక్కువ భాగం చలాన్ల చెల్లింపులకే పోతుందని లారీ యజమాన్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఏడాదికి ఒక్కో లారీకి రూ.80వేలు
ప్రస్తుతం సరిహద్దులు దాటాలంటే లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రిప్పునకు సుమారు 2వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి రావడమే. ఏడాదికి ఒక్కో లారీ నిర్వాహకుడు 80వేల రూపాయల పైచిలుకు చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం డీజిల్ ధరల పెరుగుదలతోనే ఆర్థిక భారం పెరుగుతుండగా చలాన్ల వడ్డనతో మరింత ఇబ్బందులు పడుతున్నామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏడేళ్లుగా ఇరు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎపి దాటితే మరో రూ. 2వేలు చెల్లించాల్సిందే..
తెలంగాణలో సుమారు 5లక్షల 60వేల సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 1,75,000 భారీ వాహనాలు ఉన్నాయి. ఈ భారీ వాహనాల్లో సుమారు 75వేల నుంచి 90వేల వరకు పాతవే. నిత్యం పాలు, కూరగాయలు, ఇసుక, సిమెంట్, ఇనుము, కంకర వంటి వాటిని లారీల్లో వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. పొరుగు రాష్ట్రంలో తిరిగేందుకు 5వేల రూపాయలు చెల్లిస్తే ఏడాది పొడవునా తిరిగే వెసులుబాటు ఉంటుంది. దాన్నే కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌గా పేర్కొంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు ఇదే విధంగా 5వేల రూపాయలు చెల్లించి లారీ నిర్వాహకులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు దాటి వెళితే అదనంగా 2వేలు చెల్లించాల్సి వస్తోందని యజమానులు పేర్కొంటున్నారు.

అంతరాష్ట్ర రవాణా ఒప్పందం కోసం లేఖ
2019 ఫిబ్రవరి 13న అంతరాష్ట్ర రవాణా ఒప్పందం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ లేఖ ఇచ్చింది. గతంలో ఉన్నటువంటి రూ.5 వేల రుసుముకు బదులు రూ.8వేలు చెల్లించి ఏడాది పొడవునా సరుకు రవాణా వాహనాలకు కౌంటర్ సిగ్నిచర్ పర్మిట్ తీసుకోవచ్చని లేఖ రాసింది. కానీ, అందుకు లారీ నిర్వాహకులు అంగీకరించలేదని అధికారులు పేర్కొంటున్నారు.

తెలంగాణ లారీలకు నేషనల్ పర్మిట్ లేదు
ఎపిలో ఉన్న లారీల్లో చాలా వాటికి రిజిస్ట్రేషన్ సమయంలోనే నేషనల్ పర్మిట్ తీసుకున్నారు. వారి లారీలు తెలంగాణకు సులువుగానే రాగలుగుతున్నాయి. కానీ తెలంగాణ లారీలకు నేషనల్ పర్మిట్ లేదు. వీళ్లు ఆంధ్రా సరిహద్దు దాటిన ప్రతిసారి రూ.1,500 చెల్లించాల్సి వస్తోంది. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో 2008 నుంచి ఇదే విధంగా 5వేలు చెల్లించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ తీసుకుంటున్నామని లారీ నిర్వాహకులు చెబుతున్నారు.

కొలిక్కిరాని సింగిల్ పర్మిట్
దేశంలో ప్రతి రాష్ట్రంలోని వాహనాలు వివిధ పనుల రీత్యా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా రాష్ట్ర సరిహద్దు దాటిన ప్రతిసారి కనీసం రూ.15 వందల వరకు చలాన్‌లు కడతారు. ఇలా రోజూ రాకపోకలు సాగించే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి వాహనాల కోసం పొరుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటాయి. దాన్నే సింగిల్ పర్మిట్ విధానం అంటారు. దీని ప్రకారం.. ఒక వాహనం తరచుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏటా 5 వేలు చెల్లిస్తే చాలు. ఏడాది పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో భాగంగా తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో ఒప్పందం చేసుకుంది. కానీ ఎపితో మాత్రం ఇంతవరకు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సింగిల్ పర్మిట్ అంశం ఎన్నో ఏళ్లుగా నలుగుతూనే ఉంది. ఫలితంగా లారీ యజమానులకు అదనపు చెల్లింపుల బాధ తప్పడం లేదు.

సింగిల్ ట్రిప్పునకు రూ.1,600లు
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లి రావాలంటే వేలకు వేలు చలానా కడుతున్నారు లారీల యజమానులు. ఆ ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా సింగిల్ పర్మిట్ విధానంపై అధికారులు నిర్ణయం తీసుకోలేదు. కోదాడ నుంచి చిల్లకల్లు పోయి రావాలంటే సింగిల్ ట్రిప్పునకు రూ.1,600లు కట్టాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మూడు నుంచి నాలుగు వందల ఖర్చు ఉంటోంది. ఈ విధంగా ప్రతి ట్రిప్పునకు రెండువేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. మహబూబ్‌నగర్ నుంచి కర్నూల్‌కు వెళ్లి రావాలంటే సరిహద్దు దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్క ట్రిప్పునకు 2వేల వరకు అదనంగా ఖర్చవుతోంది.