Home బిజినెస్ మూరత్ ట్రేడింగ్‌లో నష్టాలు

మూరత్ ట్రేడింగ్‌లో నష్టాలు

MOORATH 

లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్ల మొగ్గు

 సెన్సెక్స్ 194 పాయింట్లు పతనం

న్యూఢిల్లీ : పండుగ రోజు ముహూరత్ ట్రేడింగ్‌తో స్టాక్ మార్కెట్లలో సంవత్ 2074 ప్రారంభమైంది. ఈ మూరత్ ట్రేడింగ్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 194 పాయింట్లు క్షీణించి 32,390 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 10,146 వద్ద స్థిరపడ్డాయి. దీపావళి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీపావళి లక్ష్మీపూజ అనంతరం షేర్లలో లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సాయంత్రం గంటపాటు మూరత్(ముహూరత్) ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ముహూరత్ ట్రేడింగ్‌లో సూచీలు భారీగా నష్టపోయాయి. కాగా శుక్రవారం(20న) బలి ప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ట్రేడింగ్ తిరిగి సోమవారం(23న) ప్రారంభం కానుంది. మూరత్ ట్రేడింగ్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీంతో కొత్త ఏడాది నష్టాలతో ప్రారంభమైంది. గడిచిన ఏడాది అంటే సంవత్ 2073లో మార్కెట్లు పరుగులు తీయగా, మూరత్ ట్రేడింగ్‌లో ట్రేడర్లు లాభాలు బుక్ చేసుకునేందుకు మొగ్గు చూపారు. ప్రధానంగా బ్యాంక్ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఇలో బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం పతనమైంది. అన్నిరంగాలూ నష్టపోగా మెటల్ రంగం కూడా 1 శాతం తగ్గుముఖం పట్టింది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్, ఐసిఐసిఐ, టాటా మోటార్స్, కొటక్ బ్యాంక్, ఎన్‌టిపిసి, యస్‌బ్యాంక్, అంబుజా, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ పతనమయ్యాయి. అదే సమయంలో ఎంఅండ్‌ఎం, ఐబి హౌసింగ్, ఇన్ఫోసిస్, యుపిఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను నమోదు చేశాయి. అయితే చిన్న షేర్లలోనూ అమ్మకాలు మొదలయ్యాయి. బిఎస్‌ఇలో ట్రేడైన మొత్తం షేర్లలో 1493 నష్టపోగా 982 మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు 45 రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) రూ. 1251 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత రెండు రోజుల్లో నగదు విభాగంలో రూ.500 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌పిఐలకు ధీటుగా దేశీ ఫండ్స్(డిఐఐలు)కొనుగోళ్లు జరిపాయి. కాగా బుధవారంనాడు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు ఆఖరికి నష్టాలతో ముగిశాయి. గత ఏడాది కాలంగా భారత స్టాక్ మార్కెట్లు నిలకడగా వృద్ధి సాధిస్తున్నాయి. నిప్టీ 10వేల పాయింట్లక కీలకమైన స్థాయిని అధిగమించింది. యాక్సిస్ బ్యాంక్‌కు మొండి బాకీలు పెరగడంతో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో భారీగా నష్టపోయింది. యాక్సిస్ క్యూ2 ఫలితాల ప్రభావంతో ఇతర ప్రైవేట్ రంగ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యింది. రెండో త్రైమాసికంలో ఈ బ్యాంకు నికర లాభంలో 36 శాతం వృద్ధి సాధించినా.. దివాలా ఖాతాల కింద ఆర్‌బిఐకి పంపిన రెండు జాబితాల్లో బ్యాంకు రుణాల వాటా ఎక్కువగా ఉంది. దీంతో ఈ ప్రభావం షేర్లపై పడింది.
వచ్చే వారంలో లిస్ట్ కానున్న ఐఇఎక్స్
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్(ఐఇఎక్స్) సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఈ సంస్థ అక్టోబర్ 11న ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ను ముగించుకుంది. ఈ సంస్థ ఇష్యూ ధర రూ. 1650, తద్వారా కంపెనీ రూ. 1,001 కోట్లను సమీకరించింది. ఇష్యూ 2.3 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 300 కోట్లను సమీకరించింది. 23 సంస్థలకు షేరుకి రూ. 1650 ధరలో 7.89 లక్షల షేర్లను విక్రయించింది. దేశీయంగా విద్యుత్ కొనుగోలు, అమ్మకానికి వీలుకల్పిస్తూ ఏర్పాటైన తొలి ఎక్స్ఛేంజీగా ఐఇఎక్స్ ఇప్పటికే పేరుగాంచింది. ఎలక్ట్రిసిటీ ఫిజికల్ డెలివరీ కోసం ట్రేడింగ్‌కు వీలు కల్పించడంతోపాటు పునరుత్పాదక ఇంధన సర్టిఫికెట్లనూ అందిస్తుంది. పవర్ ట్రేడింగ్‌లో ప్రైస్ డిస్కవరీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌లకు వీలు కల్పిస్తోంది. పవర్ ట్రేడింగ్‌లో 99 శాతం మార్కెట్ వాటాను ఆక్రమిస్తోంది. దేశీయంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 4 శాతం వరకూ ఎక్స్ఛేంజీల ద్వారా ట్రేడవుతుంటుంది. ఐఇఎక్స్ ఆదాయం గత ఐదేళ్లలో దాదాపు 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తూ వచ్చింది.

Losses in Moorath Trading