Home తాజా వార్తలు క్రిప్టోపై ఇన్ని ఊహాగానాలా?

క్రిప్టోపై ఇన్ని ఊహాగానాలా?

Lot of unhealthy speculation on crypto taking place

 

మంచిది కాదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అది ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు కేంద్రం బిల్లు తీసుకువస్తున్న వేళ శనివారం ‘హిందుస్థాన్ టైమ్స్ సమ్మిట్’లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో క్రిప్టోపై అడిగిన ఓ ప్రశ్నకు‘ క్రిప్టోకరెన్సీపై చాలావరకు ఊహాగానాలు వస్తున్నాయి. అది ఏమాత్రం సమంజసం కాదు’ అని ఆమె సమాధానమిచ్చారు. ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 నుప్రభుత్వం ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది.

ప్రైవేటు క్రిప్టో కరెన్సీల నిషేధంతో పాటుగా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకు వస్తోంది. అయితే క్రిప్టో కరెన్సీ వినియోగం వెనుక ఉన్న సాంకేతికతను ఉపయోగించుకునే విధంగా కొన్ని మినహాయింపులు కూడా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మీడియాలో తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోందా అని అడగ్గా అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అధ్యయనం చేయడం జరుగుతోందని, వాటిని పరిశీలించడం జరుగుతుందని ఆమె చెప్పారు. కాగా డిసెంబర్ 31 నాటికి ఎయిర్ ఇండియాను టాటా ్రగ్రూప్‌నకు అప్పగించడం జరుగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ చెప్పారు.

Lot of unhealthy speculation on crypto taking place