Home నిర్మల్ సరిహద్దుల్లో ప్రేమ జంట దారుణ హత్య

సరిహద్దుల్లో ప్రేమ జంట దారుణ హత్య

                      Love-Couple-Murder

కుభీర్ : మండలంలోని నిగ్వా – మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం మహారాష్ట్రకు చెందిన ప్రేమ జంట దారుణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వారు తెలంగాణ సరిహద్దుల్లోనా మహారాష్ట్ర సరిహద్దుల్లోనా అని తెలుసుకోవడానికి పోలీసులకు గంటన్నర సమయం పట్టింది. తుదకు మహారాష్ట్ర సరిహద్దుల్లో హత్యలు జరిగినట్లు గుర్తించారు. పూజ(20), గోవింద్(25) ప్రేమికులు బోకర్ తాలుకాలోని షెర్బాన్ గ్రామానికి చెందినవారు. వీరు శనివారం ఇంటి నుండి బయ టకు వెళ్లారు.

పూజ కుటుంబీకులు బోకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. పూజ, గోవింద్‌లు ముథోల్ నియో జకవర్గంలోని తానూర్ గ్రామానికి వెళ్లినట్లు పూజ అన్న దిగంబర్ తెలుసుకుని వారితో మాట్లాడి స్వగ్రామానికి తీసుకవెళ్తున్నట్లు నమ్మించాడు. కుభీర్ మండలంలోని సరహద్దు దాటగానే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకవెళ్లి గోవింద్‌ను హత్య చేశాడు.

పూజ గొంతు కోయడంతో పరిగెత్తి రోడ్డుపై పడి మృతి చెందింది. హంతకుడు పూజకు స్వయానా సోదరుడు. సంఘ టన తర్వాత హంతకుడు బోకర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని మహారాష్ట్ర పోలీసులు వివరించారు. సరిహద్దుల్లో ప్రేమ జంట హత్యకు గురికావడంతో ఇరు ప్రాంతాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇరు ప్రాంతాల గ్రామస్తులు సంఘటనా స్థలాన్ని చూడటానికి తండోపతండాలుగా వెళ్లారు. సరిహద్దుల్లో ప్రేమ జంట దారుణ హత్య జరిగిందని తెలుసుకున్న భైంసా సిఐ సైతం సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి మహారాష్ట్ర సరిహద్దుల్లో హత్యలు జరగడంతో తిరిగి వెళ్లిపోయాడు. ఎస్‌ఐ కె. రమేష్, సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉండి మహారాష్ట్ర పోలీసులకు సహకరించారు. మహారాష్ట్ర పోలీసులు పంచనామా నిర్వ హించి పోస్టుమార్టంకు తరలించారు.