నాలుగు రోజుల్లో ఇది రెండోసారి
న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నాయి. సోమవారం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.25 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.819 చేరింది. కొత్త ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమేరకు ఆయిల్ కంపెనీ సోమవారం ప్రకటించాయి. గ్యాస్ రేటు పెంపు నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. ఇంతకుముందు ఫిబ్రవరి 25న కూడా వంట గ్యాస్ ధర రూ.25 పెరిగింది. ఫిబ్రవరి నెలలో మూడు సార్లు సిలిండర్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 4న, అలాగే ఫిబ్రవరి 14న వరుసగా రూ.25, రూ.50 చొప్పున గ్యాస్ సిలిండర్ రేట్లను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఇక డిసెంబర్ నెలలోనూ రెండుసార్లు పెంచారు. మొత్తంగా సిలిండర్‌పై ఇప్పటివరకు 150 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా ఇంధన రేట్లలో ఎలాంటి మార్పు లేదు.