Home తాజా వార్తలు ఎల్‌ఆర్‌ఎస్ ఊరట

ఎల్‌ఆర్‌ఎస్ ఊరట

LRS fee collected based on land value at registration

 

రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఫీజు వసూలు
నేడు సవరించిన జిఓ విడుదల
పేద, మధ్యతరగతి ప్రజలపై గౌరవంతోనే నిర్ణయం, అసెంబ్లీ వేదికగా మంత్రి కెటిఆర్ ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. లే ఔట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ఫీజు ఎక్కువగా ఉందన్న ప్రజల ఫిర్యాదులపై మంత్రి కెటిఆర్ స్పందించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇటీవల జారీ చేసిన 131 జిఓ సవరిస్తామని మంత్రి కెటిఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఫీజు వసూలు చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రజలు, శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు 131 జిఓను సవరించి గురువారం జిఓను విడుదల చేస్తామని మంత్రి కెటిఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల పట్ల తనకు గౌరవం ఉందన్నారు. అందులో భాగంగానే మొన్న తీసుకువచ్చిన జిఓను సవరిస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాటి వాల్యూకు అనుగుణంగానే సవరించిన జిఓను గురువారం విడుదల చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం రుసుములను వసూలు చేస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. మంత్రి ప్రకటనతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు తగ్గనున్నాయని ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చేనెల 15 చివరి తేదీ
అనధికారిక లే ఔట్లలో తెలియక ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఎల్‌ఆర్‌ఎస్ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం 131 జిఓను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న అనధికార ప్లాట్లు, లే ఔట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని ప్రభుత్వం పేర్కొంది. వచ్చేనెల 15వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అవకాశమిచ్చింది.

131 జిఓ కింద ఎల్‌ఆర్‌ఎస్ స్కీమును సద్వినియోగం చేసుకుంటే యజమానులకు భూములపై సర్వహక్కులతో పాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలు పొందడానికి అర్హులవుతారని ప్రభుత్వం ఈ జిఓలో పేర్కొంది. క్రబమద్ధీకరణ ఫీజులను జనవరి 31వ తేదీలోగా చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు అధికంగా అవుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన నేపథ్యం లో మంత్రి కెటిఆర్ జిఓ 131 సవరించడానికి ఒప్పుకున్నారు. ప్రజలకు మేలు చేసేలా సవరించిన జిఓను ప్రజలకు అందుబాటులోకి గురువారం తీసుకురానున్నారు.

LRS fee collected based on land value at registration