Home తాజా వార్తలు బోయిన్‌పల్లి కేసులో సిద్ధార్థ గ్యాంగ్ అరెస్ట్

బోయిన్‌పల్లి కేసులో సిద్ధార్థ గ్యాంగ్ అరెస్ట్

Madala siddharth gang‌ arrested in bowenpally case

 

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ దంపతులకు సహకరించిన విజయవాడకు చెందిన మాదాల సిద్దార్థ అండ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు ఆదివారం నాడు నగర సిపి అంజనీకుమార్ తెలిపారు. కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 20 మంది అరెస్ట్ అయ్యారని, ముఖ్యంగా అఖిలప్రియకు మాదాల సిద్దార్థ 15 సభ్యులు గల గ్యాంగ్‌ను సప్లై చేశాడని వివరించారు. విజయవాడలో ఈవెంట్ మేనేజర్‌గా ఉన్న మాదాల సిద్దార్థ తన స్విఫ్ట్ కారును కూడా కిడ్నాప్‌కు సమకూర్చి ఇచ్చాడన్నారు. ఇందుకు గాను సిద్దార్థకు అఖిలప్రియ అడ్వాన్స్ కింద రూ.5 లక్షల సుపారీ ఇచ్చారని, అలాగే కిడ్నాప్ గ్యాంగ్‌లోని మిగతా 15 మందికి తలా రూ.25 వేలు ఇచ్చారన్నారు. అలాగే రవాణా ఖర్చుల కింద అడ్వాన్స్‌గా సిద్దార్థకు మరో రూ.74 వేలు ఇచ్చారన్నారు.

అపార్ట్‌మెంట్‌లో అపహరణ పథకం:
ప్రవీణ్ కుమార్ సోదరుల అపహరణకు భార్గవరాం, గుంటూరు శ్రీను, అఖిల ప్రియ కలిసి నగరంలోని కెపిహెచ్‌బిలోని లోధా అపార్ట్ మెంట్‌లో ఈనెల 2 న పథకం రచించారని సిపి తెలిపారు. నాల్గవ తేదీన ఎంజిహెచ్ పాఠశాలలో మరోసారి నిందితులు సమావేశమైయ్యారని తెలిపారు. కాగా అపహరణ కోసం కావాల్సిన మనుషులను గుంటూరు శ్రీనుకు తెలిసిన సిద్ధార్థ్ అనే ఈవెంట్ ఆర్గనైజర్ సరఫరా చేశాడని, కిడ్నాప్‌లో మొత్తం ఎపిలోని విజయవాడకు చెందిన 20 మంది పాల్గొన్నారన్నారు.ఇందుకోసం సిద్ధార్థకు రూ.5లక్షలు రూపాయలతో పాటు తలా రూ.25వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారనిచ హీరో సూర్య నటించిన గ్యాంగ్ చిత్రంలో మాదిరిగా 20 మందికి కావాల్సిన దుస్తులను కుట్టించి అందరికీ కిడ్నాప్ పథకాన్ని వివరించారన్నారు. కిడ్నాప్ కోసం ఉపయోగించే వాహనాల నంబర్ ప్లేట్లను కూడా మార్చేశారు. నకిలీ నంబర్లతో ఉన్న పేపర్లను అతికించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ప్రవీణ్ సోదరుల ఇంటి వద్ద సంపత్, చెన్నయ్యలు రెక్కీ చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఇంట్లో చొరబడి అందరి వద్ద నుంచి ఫోన్లు లాగేసుకుని, ప్రవీణ్‌రావుతో పాటు సోదరులను వేరు వేరు వాహనాల్లో ఎక్కించుకుని పలు స్టాంపు పేపర్లలో సంతకాలు తీసుకుని సన్‌సిటీ ఓఆర్‌ఆర్ వద్ద బాధితులను వాహనాల్లో నుంచి దింపేసి వెళ్లిపోయారన్నారు.

ఎవరి పాత్ర వారు పోషించారు :
బోయిన్‌పల్లి కిడ్నాప్‌లో పాల్గొన్న నిందితులు ఎవరి పాత్ర వారు పోషించారు. ముఖ్యంగా నిందితులు ఫోరమ్ మాల్ వద్ద ఎట్‌హోమ్‌లో తలదాచుకున్నారు. ఇందులో కిడ్నాపర్లకు గుంటూరు శ్రీను పోలీసు, ఐటి అధికారుల దుస్తులు సమకూర్చాడు. అనంతరం బాధితులను కిడ్నాప్ చేసి మొయినాబాద్‌లో లోఉంచి సంతకాలు తీసుకున్నారు. స్టాంప్ పేపర్లను మల్లికార్జున్ సంపత్ అరేంజ్ చేశాడు. జగత్ విఖ్యాత్, భార్గవ్‌రామ్ పేర్లపై ఖాళీ పత్రాలు ఉన్నాయి. కిడ్నాప్‌లో విఖ్యాత్ ఇన్నోవా కారు ఎపి 21 సికె 2804 వినియోగించారు. విఖ్యాత్ కారులో భార్గవ్‌రామ్, మరో నలుగురు నిందితులు ఉన్నారు. భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ ప్రధాన నిందితులు. శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని తెలిపారు.ఈ కేసులో ఒక్కొక్కరి పాత్రపై పూర్తి వివరాలను హైదరాబాద్ సిపి అంజనీకుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ కస్టడీ విచారణలో భాగంగా సీన్ టు సీన్ వివరాలు సేకరించినట్లు తెలిపారు. పోలీసుల అదుపులో ఏపీలోని విజయవాడకు చెందిన సిద్ధార్థతో పాటు మరో 14 మంది ఉన్నారని వెల్లడించారు.

నిందితుల కోసం గాలిస్తున్నాం: డిసిపి కల్మేశ్వర్
బోయిన్‌పల్లి కేసుపై నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్మర్ మాట్లాడుతూఈ కేసుకు సంబంధించి మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నామని ముఖ్యంగా జగత్ విఖ్యాత్, భార్గవ్‌రామ్ కోసం వెతుకుతున్నామన్నారు. హైదరాబాద్ లోథా అపార్ట్‌మెంట్‌లోనే కిడ్నాప్ ప్లాన్ చేశారని, ఫోరంమాల్ ఎట్‌హోం లాడ్జిలో కిడ్నాప్‌కు సంబంధించిన ముఠాను ఉంచి కిడ్నాప్‌కు కావాల్సినవన్నీ గుంటూరు శ్రీను సమకూర్చాడన్నారు. అనంతరం 5 సిమ్‌కార్డులు, ఒక బొమ్మ పిస్టల్ కొనుగోలు చేసి బాధితుల ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి 5 వాహనాల్లో మల్లికార్జున నగర్‌కు నిందితులు చేరుకున్నారన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో బాధితుల నుంచి నిందితులు స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్న అనంతరం సన్‌సిటీ ఓఆర్‌ఆర్ వద్ద బాధితులను విడిచిపెట్టారన్నారు.

నిందితుల వివరాలు :
ఈ కేసులో సిద్ధార్థతో పాటు మోగిలి బొజ్జగాని దేవ, భాను, రాగోలు అంజయ్య, పదిర రవిచంద్ర, రాజ, బనోత్ సాయి, దేవరకొండ కృష్ణ సాయి, దేవరకొండ కృష్ణవంశీ, దేవరకొండ నాగరాజు, బొజ్జగాని సాయి, కందుల శివ ప్రసాద్, మీసాల శ్రీను, అన్నపాక ప్రకాశ్, షేక్ దావూద్‌కు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అపహరణకు సంబంధించి నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిపిన సిపి పరారీలో ఉన్న భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వివరించారు.

Madala siddharth gang‌ arrested in bowenpally case