Home జాతీయ వార్తలు గవర్నర్ వైఖరిపై సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్

గవర్నర్ వైఖరిపై సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్

ముంబై:మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ అందచేసిన లేఖను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి మంగళవారం రాష్ట్రపతికి పంపించారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కోష్యారి తమకు గడువు పొడిగించకపోవడాన్ని సవాలు చేస్తూ శివసేన మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ తమకు సోమవారం రాత్రి 7.30 గంటల వరకే గడువు ఇచ్చారని, తాము మద్దతు లేఖలు సమర్పించలేదన్న కారణంతో తమకు ఇచ్చిన గడువును పొడిగించడానికి నిరాకరించారని శివసేన తన పిటిషన్‌లో పేర్కొంది. తమకు మరో మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ గవర్నర్ సమ్మతించలేదని శివసేన తన పిటిషన్‌లో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ కోష్యారి ఎన్‌సిపి ఇచ్చిన గడువు నేటి రాత్రి 8.30 గంటలకు ముగియనున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పంపిన దూతలు ముంబై చేరుకుని మద్దతుకు సంబంధించిన షరతులపై శరద్ పవర్‌తో చర్చలు జరుపుతున్నారు.

Maha Cabinet recommends President Rule