*యథేచ్ఛగా సరిహద్దు రాష్ట్రం నుంచి జిల్లాకు తరలింపు
మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : జిల్లా వ్యాప్తంగా కందుల రాకెట్ పడగ విప్పుతోంది. మొదట మినుముల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన వ్యాపారుల సిండికేట్ దానిని తలదన్నే రీతిలో కంది పంటను వెంటాడుతుంది. మహారాష్ట్రలో కందుల ధర తక్కువగా ఉండడం జిల్లాలోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలలో ధర ఎక్కువగా ఉండడం ఈ అక్రమాలకు తెరలేపుతుంది. మహారాష్ట్ర సరిహద్దు నుంచి ప్రతిరోజు వందల క్వింటాళ్ల కందులు జిల్లాలోకి తరలిస్తూ వ్యాపారులు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా అక్రమ మార్గం గుండా తరలించిన కందులను రహస్య ప్రాంతాలలో దాచి పెడుతూ బినామి రైతుల పేరిట వాటిని సర్కారు కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యాపారుల సిండికేట్‌కు సంబంధిత శాఖలోని అధికారులు, ఉద్యోగుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే ఈ తతంగం అంతా సాగుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వ్యాపారుల సిండికేట్ పరాకాష్టకు సంకేతంగా శనివారం పట్టుబడ్డ అక్రమ కందులు నిలుస్తున్నాయని అంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 2 వేల క్వింటాళ్ల అక్రమ కందులు పట్టుబడిన ఉదంతం అక్రమాల తీవ్రతకు అద్దం పడుతుందని అంటున్నారు. భైంసా వైపు నుంచి స్వర్ణ వైపు నుంచి సోనాలవైపు నుంచి కిన్వట్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కందులు ఉమ్మడి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ అక్రమ కందుల దందాకు కొంతమంది అధికారులు పరోక్షంగా అండదండలు అందిస్తుండడంతోనే ఈ వ్యవహారం హద్దులు దాటుతుందని అంటున్నారు. మహారాష్ట్రలో క్వింటాలు కందుల ధర రూ. 3500 నుంచి రూ. 4000లు పలుకుతుండగా, ఇక్కడి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో క్వింటాలు కందుల ధర రూ.5450 పలుతుండడంతో ఈ కందుల అక్రమాలకు కారణమవుతుందని అంటున్నారు. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో వీటికి డిమాండ్ కూడా పెరిగిపోయిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొనుగోలు ప్రక్రియలో పెద్ద ఎత్తున చేతివాటం చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులున్నాయి. కొంతమంది దళారులు బినామి రైతుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రైతుల నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాలు సేకరించి వారి పేరిట బినామీ రూపంలో ఈ కందుల విక్రయాలను కొనసాగిస్తున్నారని అంటున్నారు. కాగా ఇలా పట్టాదర్ పాస్ పుస్తకాలిచ్చిన రైతులకు దళారులు కమీషన్ కూడా చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి వ్యాపారులు వ్యూహాత్మకంగా మహారాష్ట్ర సరిహద్దులలో కొనుగోలు చేసిన కందులను నిల్వ చేసినట్లు ఆరోపణలున్నాయి. అలా నిల్వ చేసిన కందులను అక్రమ మార్గాల గుండా ఎవరికి అనుమానం రాకుండా జిల్లాలోకి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతోనే ఈ అక్రమ తంతు యథేచ్ఛగా కొనసాగుతూ అసలైన రైతులకు, అలాగే సర్కారుకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుందని అంటున్నారు.