Home దునియా మహదేవశంభో

మహదేవశంభో

శివుడు సర్వంతర్యామి. విశ్వమంతా వ్యాపించినవాడు.  శివ అనే రెండక్షరాలు అత్యంత మహిమాన్వితమైనవి, గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్ధం. మంగళకరుడైన పరమశివుని అనుగ్రహం పొందడానికి హిందూవులు జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఏటా మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్ధశినాడు ఈ మహోన్నతమైన పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కైలాసనాథుడైన మహాదేవుడు మహాశివరాత్రి నాడు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించి, భక్తుల్ని రక్షిస్తున్నాడు.

Maha Shivarathri

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అని కూడా అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి అత్యంత ముఖ్యమైనది, మహిమాన్వితమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడు లింగ రూపంగా ఆవిర్భవించడానికి గల కారణమేమిటి? దీనికి దారి తీసిన పరిస్థితులేమిటి ? అనే ప్రశ్నకు ఒక కథ ప్రచారంలో ఉంది.

లింగోద్భవ కథ
ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మకు, స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుకు ఒకసారి ఎవరు గొప్ప అనే చర్చ వస్తుంది. ఈ క్రమంలో తాము గొప్పంటే, తాము గొప్పని వారు వాదులాడుకుంటూ పరమేశ్వరుని అభిప్రాయం కోరుతారు. వారి ఆంతర్యం తెలుసుకున్న పరమేశ్వరుడు తానో అతిపెద్ద లింగరూపంలో ఆవిర్భవించి తన మొదలు, చివరలను ముందుగా తెలుసుకున్నవారే గొప్పవారని తన అభిప్రాయం చెబుతాడు. దానికి అంగీకరించిన విష్ణువు పంది రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ సాగిపోగా, హంస రూపాన బ్రహ్మ శిరోభాగం వైపు సాగిపోతారు. ఎంత దూరం ప్రయాణించినా వారివురూ లింగాకారుడైన శివుని ఆద్యంతాలు కనుగొనలేకపోతారు. అనంతరం అహంకారం నశించిన వారిద్దరూ పరమేశ్వరుని శరణువేడగా, ప్రసన్నుడైన ఈశ్వరుడు నిజరూపాన దర్శనమిస్తాడు. బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి విశేష పూజలతో సేవించిన పర్వదినమే ‘మహాశివరాత్రి’.

శివరాత్రి వ్రతం
మనసా వాచా శివుని ఆరాధించే వ్రతమే శివరాత్రి వ్రతం. శివరాత్రి గురించి పార్వతీమాత ఓసారి పరమేశ్వరుడిని అడిగినప్పుడు.. శివరాత్రి అంటే తనకెంతో ఇష్టమని.. ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసమున్నా సరే సంతోషిస్తానని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అందుకే శివరాత్రి రోజున పగలంతా నియమనిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మరుసటి రోజు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తిచేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడే స్వయంగా పార్వతి మాతకు చెప్పాడు.
అలాగే ఈరోజున తనను లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడవుతాడని, ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టమని, అలా చేసిన వారు కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు స్వయంగా చెప్పాడు. అంతట పార్వతిమాతే స్వయంగా శివరాత్రి వ్రతాన్ని పాటించి శివానుగ్రహం పొందిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది.

లింగోద్భవ కాలం
శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో కనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

శివరాత్రిని ఎలా జరుపుకోవాలి..
శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజామందిరాన్ని ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. తెల్లని బట్టలను ధరించి, మారేడు దళాలతో యథాశక్తి శివపూజ చేసి పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజంతా శివనామ స్మరణతో ఉపవాసముండాలి. విశేషమైన లింగోద్భవకాలంలో నిర్గుణ, నిరాకారుడైన పరమేశ్వరుడిని పంచాక్షరీ మంత్రంతో కొలుస్తూ, మొదటి జాములో పాలతో, రెండవజాములో పెరుగుతో, మూడవ జాములో నెయ్యితో, నాల్గవ జామున తేనెతోను అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అయితే ఈ రోజున ఉపవాసం, జాగరణ అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఫలప్రదమైనవిగా పురాణాలు చెబుతున్నాయి.
శివరాత్రి రోజున ఎర్రని ప్రమిదల్లో దీపారాధన చేయాలి. దీపారాధనకు నువ్వులనూనె వాడటంతో బాటు ప్రమిదలో ఐదు వత్తులు వేసి పంచహారతి ఇవ్వడం శ్రేయస్కరం. మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివనామ స్మరణ చేసి ఉదయాన స్నానం చేసి శివపూజ చేసి ఉపవాసాన్ని విరమించాలి. అయితే శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదని, అప్పుడే సంపూర్ణఫలం దక్కుతుంది.
ఏ వ్యక్తి అయితే శివరాత్రి రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవని శివపురాణం ద్వారా అవగతమవుతోంది.
మహాశివరాత్రి రోజున చేయాల్సిన ముఖ్యమైన విధులేంటంటే…
శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండి వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. మహా శివరాత్రి పర్వదినాన ముఖ్యంగా చేయాల్సినవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం చెబుతోంది.
శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతంలో జీవన్ముక్తులౌతారని స్కాంధ పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వల్ల ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో చెప్పాడు.
ఉపవాస విశిష్టత
జీవుడు పరమాత్ముని సామీప్యంలో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవలం భగవంతుని ఆరాధన చేయడమే ఉపవాసమని వరాహోపనిషత్తు చెబుతోంది .
రుద్రాభిషేకం
మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే రుద్రాభిషేకంలోని పరమార్ధం.
పంచాక్షరి మంత్రం
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు న మ శి వా య (ఓం నమశ్శివాయ) లను మహాశివరాత్రి నాడు భక్తితో పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
వీటితో పాటు మహామృత్యుంజయ మంత్రం, శివసహస్రనామస్తోత్రం పఠిస్తే శివానుగ్రహం కలుగుతుంది.
అందువల్ల మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరదర్శనం, అభిషేకం, బిల్వార్చన, శివనామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగిపోతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని శివ పురాణం అవగతం చేస్తుంది.

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వేములవాడ

శ్రీరాజరాజేశ్వర స్వామి కొలువుదీరిన వేములవాడ తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద శైవ క్షేత్రం. చారిత్రక విశిష్టతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని పుణికిపుచ్చుకున్న ఈ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. దేశవ్యాప్తంగా మరే శైవ క్షేత్రంలోనూ లేని ఆచార సంప్రదాయాలు వేములవాడలో ఉన్నాయి. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మొదట లేంబుళవాటికగా ఉండి ఆ తరువాత లేంబులవాడె, అనంతరం వేములవాడగా రూపాంతరం చెందిన ఈ శైవ క్షేత్రం చాళుక్య రాజుల అసామాన్యమైన శివభక్తికి సాక్షీభూతంగా నిలిచింది. సాక్షాత్తు మహాదేవుడు ఇక్కడ కొలువై భక్తులు కోర్కెలు తీరుస్తుండడం వల్ల ఇది వేల్పులవాడగా ప్రసిద్ధి చెందింది.
క్రీ. పూ.3వ శతాబ్దం మధ్య కాలంలో వేములవాడ శాతవాహనుల ఏలుబడిలో ఉన్నట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కానీ మొదట బోధన్ రాజధానిగా సూదాక్షను ఏలిన వేములవాడ చాళుక్యులు, ఆ తరువాత వేములవాడను రాజధానిగా చేసుకుని పాలించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద క్రీ.శ. 750 మొదలు క్రీ.శ. 973వ సంవత్సరం వరకు ఈ క్షేత్రాన్ని చాళుక్య రాజులు పాలించారని తెలుస్తోంది. చాళుక్య రాజులైన వినయాదిత్య యుద్ధ మల్లుడు, అరికేసరి, నరసింహ భూపతి, రాజాదిత్యుడు, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నరసింహ దేవుడు తదితర రాజులు ఈ క్షేత్రాన్నిపాలించి రాజరాజేశ్వర స్వామిని పూజించి పునీతులయ్యారని తెలుస్తోంది. ఆ కారణంగా ఆయా రాజులు వేములవాడ చాళుక్యరాజులుగా కీర్తినొందారు. కాశీనగరం, చిదంబరం, శ్రీశైల, కేదారాద్రి క్షేత్రాలలో నివసించిన పరమశివుడు అక్కడ సంతృప్తి చెందక స్వర్గసుఖ భోగభాగ్యాలకు నెలవైన సుక్షేత్రాన్ని వెదుకుతూ ఇక్కడకు వచ్చి లేంబులవాటికను తన నిత్య నివాసానికి ఎన్నుకున్నాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. వేములవాడలో ఉన్న ప్రధాన ఆకర్షణ ఇక్కడున్న ధర్మగుండం. బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు, రాజరాజనరేంద్రుడు ఇత్యాది మహనీయులు ఈ ధర్మగుండంలోనే స్నానమాచరించి ఫలసిద్ధి పొందారట.
ఉత్తర తెలంగాణవాసులు రాజన్నా అని మనసారా పిలుచుకునే దేవుడు ఈ క్షేత్ర దైవం రాజరాజేశ్వరుడు. భూలోకవాసుల దీనావస్థను నారదుడు వీక్షించి, శివునికి విన్నవించగా, ఆయన కరుణించి ఈ క్షేత్రంలో లింగరూపుడు ఉద్భవించాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామివారు రాజరాజేశ్వరస్వామి. అమ్మవారు రాజరాజేశ్వరి.
అలాగే ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులు కోడెదూడలను స్వామికి మొక్కుబడిగా సమర్పించే ఆచారం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే భీమేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. ఇది కూడా అతి ప్రాచీనమైన ఆలయంగా ఖ్యాతిగాంచింది.
ఎలా చేరుకోవాలి?
హైద్రాబాద్ నుంచి వేములవాడ 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ప్రతి గంటకు ఓ బస్సు ఉంది. అలాగే వేములవాడలో బస చేయడానికి సత్రాలు, కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. భోజన సదుపాయాలకు ఎలాంటి కొరత లేదు.

శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయం, కీసరగుట్ట

శ్రీరామలింగేశ్వరస్వామివారి నామస్మరణంతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం కీసరగుట్ట. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఉన్న ఈ దివ్యధామం హైదరాబాద్ నగరానికి సుమారు 40 కిలోమీటర్లు దూరంలో ఉంది. శివుని మహిమాన్విత ధామాలలో ఒకటిగా విరాజిల్లుతున్న కీసరగుట్ట ప్రాంతాన్ని ఒకప్పుడు కేసరగిరి అని పిలిచేవారు. అలాగే ఈ ఆలయం గుట్ట మీద ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు కీసరగుట్టగా స్థిరపడిపోయింది.
క్రీ.శ. నాల్గవ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండిన రాజుల సైనిక స్థావరం ఇక్కడే ఈ కీసరగుట్ట మీదే ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో గోల్కొండను పాలించిన తానీషా వద్ద పని చేసిన అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.
ప్రధాన ఆలయం పశ్చిమానికి అభిముఖంగా ఉంటుంది. సాక్షాత్తు శ్రీ రాముని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు గా ఇక్కడున్న శ్రీ రామలింగేశ్వరుడు ప్రసిద్ధుడు. స్వామి వారి గర్భాలయంలో మరో పక్క భవానీ అమ్మవారు కొలువు దీరారు.
ప్రదక్షిణ మార్గం చూసుకొని, శ్రీ స్వామివారి ఎడమవైపుకు రాగానే కొంచెం దూరంలో శ్రీ మారుతి కాశీవిశ్వేశ్వరాలయం ఆహ్వానం పలుకుతుంది. ఆ స్వామిని దర్శించుకొని, కొద్దిగా ఎడమకు నడిస్తే ప్రత్యేక ప్రాంగణంలో అక్కన్న- మాదన్న ఆలయాలు కనిపిస్తాయి.
ఒకే కప్పు కింద నిర్మితమైన మూడు ఆలయాలు ఇవి. 2005వ సంవత్సరంలో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుపుకున్న ఈ ఆలయాలు గర్భాలయం, అంతరాలయం, వేర్వేరుగా ముఖమండపం కలిపి నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయాల్లో మధ్యగుడిలో శివపంచాయతనాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి కుడి వైపు భాగంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువు దీరారు.
ఇదే ప్రాంగణంలో ఎడమవైపున సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ముఖమండపంలో చిన్నమందిరాలలో ఆంజనేయుడు, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి తదితర దేవతామూర్తులు దర్శించుకోవచ్చు.
అక్కన్నమాదన్న ఆలయాలకు వెనుక వైపు నాగదేవత ఆలయం ఉంది. సంతానార్థులైన సువాసినులు ఇక్కడ ప్రత్యేక పూజలు, ముడుపులు చెల్లిస్తారు. ఆలయానికి ఎదురుగా మరొక ఆంజనేయ ఫలకం కన్పిస్తుంది. దీని పక్కనే అక్కన్న-మాదన్నలు వేయించిందిగా చెబుతున్న భక్తాంజనేయ ముద్ర కల్గిన ఏకశిలా జయస్తంభాన్ని చూడవచ్చు. ఆలయ ప్రాంగణం వెలుపల అనేక శివలింగాలు కనిపిస్తాయి. ఆంజనేయుడు ఈ లింగాలనే చెల్లాచెదురుగా విసిరేయడంతో ఇవి ఇలా దర్శనమిస్తున్నాయని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి.
ఎలా చేరుకోవాలి?
హైద్రాబాద్ నుండి 40 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఇ.సి.ఐ.ఎల్ నుండి, నగరంలో వివిధ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. కొండమీద భోజన, ఫలహార, తేనీరుకు హోటళ్లు ఉన్నాయి. అన్నదాన సత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. చక్కని ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన శ్రీ రామలింగేశ్వరుని కీసరగుట్ట చూడదగిన దివ్యక్షేత్రం.

శ్రీరామలింగేశ్వరాలయం, నందికంది
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న అతి ప్రాచీన క్షేత్రం ‘నందికంది’. నందికంది పూర్వ నామధేయం కిరియకంది. కిరియ అనే పదం కన్నడం నుంచి వచ్చిందని చెబుతారు. వందల సంవత్సరాల నాటి చరిత్రను తనలో నిబిడీకృతం చేసుకున్న ఈ దివ్య క్షేత్రంలో ఉన్న మహిమాన్విత దేవాలయమే శ్రీ రామలింగేశ్వరాలయం. ఒకప్పుడు ఎందరో రాజుల ఏలుబడిలో ఉన్న ఈ క్షేత్రం నేడు శివుని లీలా విశేషాల ఫలితంగా ప్రముఖ శైవ ధామంగా విలసిల్లుతుంది. నందికందిలోని శ్రీరామలింగేశ్వరాలయ నిర్మాణం కళ్యాణి చాళుక్య రాజుల మహా అద్భుత శిల్ప శైలిలో జరిగింది. ఈ ఆలయం క్రీ.శ. పదవ శతాబ్దం చివరిలోనూ, పదకొండవ శతాబ్దం ఆరంభంలోనూ నిర్మితమైందని ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది. అయితే కళ్యాణి చాళుక్య రాజులైన రెండవ తైలపుడు, ఆహనమల్ల విక్రమాదిత్యుని కాలంలోనే కాకుండా అంతకు ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు ఇక్కడ ఆధారాలు చెబుతున్నాయి.
ఎలా చేరుకోవాలి?
హైద్రాబాద్ నుంచి జహీరాబాద్‌కు వెళ్ళే మార్గంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని సులువుగా చేరుకోవచ్చు.

ఉపవాసం అంతరార్థం
సుఖభోగాలు మనిషిని దైవానికి దూరం చేస్తాయి. ఉపవాసం వంటి కఠిన నియమాలవల్ల ఇంద్రియాల ప్రభావం తగ్గి ఆధ్యాతిక సాధనలకు మార్గం. సుగమం అవుతుందని ఆధ్యాత్మివేత్తలు చెబుతున్నారు. వారానికోసారి ఘనాహారానికి దూరంగా ఉండమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. ఆరోగ్య సమస్యల్లేనివారు వారానికోసారి ఉపవాసం చేయాలి. ఇందువల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకు పోతాయి. జీర్ణకోశానికి తగిన విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణకోశం శక్తి పుంజుకుని సక్రమంగా పనిచేస్తుంది. కటిక ఉపవాసం అనే పేరుతో మంచి నీటిని సైతం సేవించకుండా ఉపవసించడం మంచిదికాదు. శరీరంలో నీటి నిలలు తగ్గకుండా చూసుకోవాలి. పాలు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ఉపవాసం చెడదని పెద్దలు చెబుతారు. ఏదైనా భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు, ఎసిడిటీ వంటి జీర్ణకోశ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ జబ్బులు, రక్తహీనత వంటి తిండికి సంబంధించిన
సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసులతో చేసిన పదార్థాలు నిషిద్ధం. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని తినే పదార్ధాలలో వాడాలి. పాలూ పండ్లూ తినొచ్చు. ముఖ్యంగా దృష్టిని ఆహారం మీద పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం.
ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కనుక సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసంతో మందకొడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయంలో తినకూడదు. ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు.

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి
కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశంలో కాళేశ్వరంలో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. విశాలమైన ప్రాంగణంలో పరచుకున్న ఈ దివ్యాలయంలో కాకతీయ రుద్రదేవ మహారాజు తన పేర కాళేశ్వర మహాక్షేత్రంలో రుద్రదేవుని ప్రతిష్ఠించాడని, దాని పక్కన గంగాధర మంత్రి మరొక లింగాన్ని, విష్ణువును ప్రతిష్ఠించి, ధూప, దీప, నైవేద్యాలను ఏర్పాటు చేయించినట్టు క్రీ.శ 1171 నాటి కాకతి రుద్రదేవుని మంత్రి వెల్లకి గంగాధరుడు వేయించిన శాసనం ద్వారా అవగతమవుతోంది. గణపతిదేవుని గురువైన విఘ్నేశ్వర శివాచార్యులు కాళేశ్వరాలయ మండపంలో విమలేశ్వరుడను పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు క్రీ.శ 1250 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీ.శ 1397 ఫిబ్రవరి 28 తేదీన మొదటిరాయలు కాళేశ్వరుని ఆరాధించి, మొక్కులు తీర్చుకున్నట్లు తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ ఆలయం ఒకప్పుడు అరణ్యంలో ఉండేది. ఆ కారణంగా 1976 వరకు ఈ ఆలయానికి రవాణ సౌకర్యం లేదు. అయితే 1976-82 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరగడంతో రవాణా వసతి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఇక్కడ గర్భాలయంలో ఒకే పానమట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామికి రెండు నాసికా రంధ్రాలు దర్శనమిస్తాయి. ఈ రంధ్రములలో అభిషేక జలం ఎన్ని పోసినా ఒక్కచుక్క కూడ బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుందంటారు. గర్భాలయంలో ఉన్న రెండులింగా లలో ఒకటి కాళేశ్వర లింగం కాగా, రెండవది ముక్తీశ్వర లింగంగా చెబుతారు. అమ్మవారి పేరు శుభానందా దేవి. కాశీలో మరణిస్తే కైలాసప్రాప్రి కలుగు తుందని చెబుతారు. కాని ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది.
ఎలా చేరుకోవాలి?
కాళేశ్వరం కరీంనగర్ పట్టణానికి 130 కి.మీ దూరం లోను, మంథనికి 65 కి. మీ దూరంలోను, వరంగల్లుకు 110 కి.మీ దూరంలోను ఉంది.

జాగరణ ఎందుకంటే…

ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణా దులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వం శివస్వరూపంగా భావించి, దర్శించడమే నిజమైన జాగరణం. ఇలా చేస్తే, శివపూజలో సాయు జ్యం, శివభజనలో సామీప్యం, శివభక్తులతో కూడి, శివ విషయాలు ప్రసంగించుటలో సలోక్యం, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని సాక్షాత్తు జగద్దురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు.
ఖాళీ కడుపులో విషతుల్యమైన ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అవి శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఉపవాసం చేసిన వారికి జాగరణ కూడా ముఖ్యవిధిగా ఏర్పర్చారు. మర్నాడు మితాహారంతో ఉపవాసం విరమించిన తరువాత కూడా వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. రెండు పొద్దులైనా ఆహారం తీసుకోవాలి. జాగరణం అంటే మన గురించి మనం మేలుకుని ఉండడం. జాగరణను సంపూర్ణ ఆరోగ్యవంతులే చేయాలి. జాగరణ మర్నాడు విశ్రాంతిగా గడపడం అవసరం. ఉపవాస, జాగరణలు చేసేవారు మితిమీరిన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ వంటి ఏకాగ్రత అత్యవసరం అయ్యే పనులకు విశ్రాంతి తరువాతే ఉపక్రమించండి. జాగరణ సమయంలో మానసిక ఉద్వేగాలను పెంచే వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.

శ్రీ శివగంగ రాజరాజేశ్వరి ఆలయం, మహేశ్వరం
శివుడు శివగంగ రాజరాజేశ్వర స్వామిగా పూజలందు కుంటున్న పుణ్య క్షేత్రం మహేశ్వరం. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి సమీపంలో ఉన్న మహేశ్వరం పూర్వ నామధేయం మాం కాల్ మహేశ్వరం. కుతుబ్ షాహీల మత సామరస్యాన్ని , మొగ లాయిల నిర్దాక్షిణ్యాన్ని చవి చూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరం. ఛత్రపతి శివాజీ విడిది చేసిన చోటుగా, అక్కన్నమా దన్నలు తిరుగా డిన ఊరుగా దీనిని చెబుతారు. రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా, విహార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయం ఇతర ఆలయాలకు మల్లే కాకుండా నీటిలో రెండస్తుల తో అలరారుతోంది. ఆలయం చుట్టూ పుష్కరిణి ఉంది. ఇది ఐదు వందల అడుగుల పొడవు, రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో దర్శన మిస్తుంది. గర్భాలయంలో శివగంగ రాజరాజేశ్వర స్వామి, నీటిలో కింది అంతస్థులో రాజరాజేశ్వరి అమ్మవారు కొలువు దీరారు.

ఎలా చేరుకోవాలి?
హైద్రాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి మహేశ్వరం దివ్య క్షేత్రానికి సిటి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ భోజన, వసతి సదుపాయాలు లేవు.

కేతకీ సంగమేశ్వర ఆలయం, ఝరాసంగం

మెదక్ జిల్లా జహీరాబాద్‌కు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో శివుడు కేతకీ సంగమేశ్వర స్వామిగా కొలుపులందుకుంటున్నాడు. దక్షిణకాశీగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రం అనేక పౌరాణిక గాధలకు నిలయంగా ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. కాశీలో వెయ్యి రోజులు చేసిన పుణ్యం ఇక్కడ 41 రోజులు సంగమేశ్వర స్వామిని అర్చిస్తే వస్తుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో ఒకరికి అన్నదానం చేస్తే వెయ్యిమందికి అన్నదానం చేసిన ఫలితం ఉంటుందంటారు.
ఎలా చేరుకోవాలి?
హైద్రాబాద్ నుంచి జహీరాబాద్‌కు అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.

శ్రీ మల్లికార్జునస్వామి, ఓదెల
కరీంనగర్ పట్టణానికి 40 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం అలరారుతోంది. ఓదెల గ్రామంలో వెలసిన దైవం కనుక ఇక్కడ స్వామి ఓదెల మల్లికార్జునిగా ప్రసిద్ధుడు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టించిందీ ఇతమిద్ధమైన ఆధారాలు లేకపోయి నప్పటికీ, కాకతీయుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని తెలుస్తోంది. ఓదెల అనే రైతును అనుగ్రహించడానికి, లోక కళ్యాణం కోసం స్వామి ఇక్కడ వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది.
ఎలా చేరుకోవాలి?
కరీంనగర్ నుంచి సులువుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే ఇక్కడ భోజన, వసతి సదుపాయాలు లేవు.

చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన ఆలయాల్లో చెర్వుగట్టు ఒకటి. నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డిగూడెం అనే గ్రామంలో ఉందీ ఆలయం. జడల రామలింగేశ్వరస్వామి వారి ఆలయం ఇది. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్టించాడనీ, ఆయన ప్రతిష్టించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థలపురాణం.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి బస్సు సౌకర్యం కలదు. భోజన, వసతి సదుపాయాలు వుంటాయి.

దాసరి దుర్గాప్రసాద్, 77940 96169