Thursday, April 25, 2024

వాయుకాలుష్యంలో మహబూబ్‌నగర్‌కు మొదటిస్థానం

- Advertisement -
- Advertisement -

Mahabubnagar ranks first in air pollution

హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాయు కాలుష్య నివేదికల విడుదల చేశాయి. ఇందులో పలు ప్రాంతాలు వాయుకాలుష్యం బారిన పడుతున్నాయని పేర్కొన్నాయి. టిఎస్ పిసిబి విడుదల చేసిన నివేదికలో మహబూబ్‌నగర్‌లో కాలుష్యం అత్యధికంగా ఉండగా, ఐదో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఒక్క నల్గొండలో మాత్రమే నిర్దేశిత పరిమితుల కంటే 7 ఎంజీలు తక్కువగా నమోదైంది. గతేడాది వాయుకాలుష్యంలో మహబూబ్‌నగర్, కరీంనగర్, రామగుండం, మెదక్ జిల్లాలు హైదరాబాద్‌ను దాటేశాయి. ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే సూక్ష్మ ధూళి కణాల తీవ్రత (పిఎం 10) అత్యధికంగా నమోదైనట్లు తాజాగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్‌పిసిబి) పేర్కొంది.

సిపిసిబి గణాంకాల్లో ఒడిస్సాకు మొదటిస్థానం

అయితే సిపిసిబి (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) వెల్లడించిన నివేదికలో కాలుష్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా మొదటిస్థానం దక్కించుకోగా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. అయితే తెలంగాణలోని మరో రెండు ప్రాంతాలు అధికంగా కాలుష్యం బారినపడ్డాయని తమ నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రమాదకరమైన ఇతర వ్యర్థాల డంపింగ్ వల్ల కలుషిత ప్రాంతాలు ఏర్పడ్డాయని పేర్కొంది. వాటి వల్ల భూగర్భ, ఉపరితల జలాలు కలుషితమై పర్యావరణంపై ప్రభావం పడుతుందని తెలిపింది. పారిశ్రామిక వ్యర్థాలను అశాస్త్రీయ పద్ధతిలో నిర్ధేశించిన నిబంధనలను ఉల్లఘించి పారవేయడం వల్ల కలుషితం అవుతున్నాయని సిపిసిబి తెలిపింది.ఎపిలో మాత్రం కాలుష్య కారక ప్రాంతాలు లేవని కానీ, నాలుగు చోట్ల మాత్రం కాలుష్యం పెరుగుతోందని తమ నివేదికలో స్పష్టం చేసింది.

ఎపిలోని విశాఖపట్నం జిల్లా మధురవాడ, చిత్తూరులోని రాచగున్నేరి, కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం టైలింగ్ పాండ్, విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమార్స్ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలోని కాటేదాన్, నూర్ అహ్మద్‌కుంట లేక్, పటాన్‌చెరు ప్రాంతాలను కలుషితమైన ప్రాంతాలుగా పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాంతాలను కాలుష్య నివారణ నుంచి విముక్తి చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ, టిఎస్ పిసిబి కలిసి సంయుక్తంగా డిపిఆర్‌లను సిద్ధం చేశాయి. అయితే దీనిపై హైకోర్టులో పెండింగ్ కేసు ఉండడంతో ప్రస్తుతం పనులు ఆపివేసినట్టుగా సిపిసిబి తెలిపింది. ఇక నక్కవాగు పటాన్‌చెరు ప్రాంతంలో 30 ఎంఎల్‌డి సామర్థంతో ఎస్టీపిని నిర్మించాలని హెచ్‌ఎండిఏ ప్రతిపాదనలు పంపించిందని టిపిసిబి నివేదికలో పేర్కొంది. ఇక్కడ భూగర్భ జలాల్లో ఘనవ్యర్థాల ప్రమణాల కన్నా ఎక్కువగా ఉన్నాయని టిఎస్‌పిసిబి తెలిపింది.

రాష్ట్రంలో దుమ్ము రేపుతున్న వాయు కాలుష్యం

నల్గొండలో మినహా మిగిలిన పదిచోట్ల పిఎం10 కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) నిర్దేశిత పరిమితుల్ని దాటినట్లు గుర్తించింది. హైదరాబాద్ సహా వివిధ నగరాలు, పట్టణాల్లో టిఎస్ పీసీబీ వాయు కాలుష్య నమోదు కేంద్రాలను నిర్వహిస్తోంది. వాటిలో నమోదైన గణాంకాల ఆధారంగా 2020లో పిఎం 10 తీవ్రతను లెక్కించారు. ఒక్క నల్గొండలో మాత్రమే నిర్దేశిత పరిమితుల కంటే 7 ఎంజీలు తక్కువగా నమోదైంది.

మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 102 ఎంజీలు

ఏటా హైదరాబాద్‌లోనే అత్యధికంగా కాలుష్యం నమోదవుతుంది. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 102 ఎంజీలు, ఆ తర్వాత కరీంనగర్‌లో 100 ఎంజీలు నమోదవడం గమనార్హం. సిపిసిబి నిర్ధేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటరు గాలిలో పిఎం 10 వార్షిక సగటు 60 ఎంజీలు దాటరాదు. అది దాటితే ప్రమాదకర జోన్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. వాహనాల సంఖ్య పెరగడం, అధ్వానపు రహదారులు, బహిరంగంగా వ్యర్థాల దహనం, గడువు తీరిన వాహనాలు తదితరాలు కాలుష్యం పెరగడానికి కారణాలై ఉంటాయని ప్రాథమిక అంచనా. కొన్ని జిల్లాలో కాలుష్యం పెరగడానికి హైదరాబాద్‌లో తగ్గడానికి కారణాలను అధికారులు పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నారు.

తెలంగాణకు పలు సూచనలు చేసిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి

సిపిసిబి (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) హైదరాబాద్‌తో పాటు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో వాయుకాలుష్యం పెరగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందులో ముఖ్యంగా మూసీనది, అసనికుంట లేక్, మెదక్ జిల్లా, మహేశ్వరం, హైదరాబాద్, చేవెళ్ల, ఎల్‌బినగర్ ఇండస్ట్రీయల్ ఏరియా, మౌలాలి పారిశ్రామిక ప్రాంతం, రంగారెడ్డి, గుండ్ల పోచంపల్లి, రంగారెడ్డి (పారిశ్రామిక ప్రాంతం)లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వాయుకాలుష్యం నాణ్యతా ప్రమాణాలను లెక్కించడంతో పాటు మెరుగైన గాలి నాణ్యతను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతోపాటు పర్యవేక్షణ కమిటీలను నియమించి భూగర్భ జలాలను పరిశీలించాలని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News