Home తాజా వార్తలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మహా లొల్లి

ఢిల్లీ నుంచి గల్లీ దాకా మహా లొల్లి

Mahakutami Meeting in Delhi to finalise seat sharing

ఢిల్లీ వార్ రూమ్ వద్ద బిసిల వార్ 

అటు కూటమిలో ఇటు కాంగ్రెస్‌లో 

సిపిఐ అసంతృప్తి

టిడిపి, టిజెఎస్ నేతలు, జానాతో చర్చలు

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమిలో ఇప్పటివరకూ భాగస్వామ్య పార్టీల అసంతృప్తి కొనసాగితే, అది చల్లారకముందే కాంగ్రెస్‌లోనే అంతర్గతంగా బిసిల లొల్లి మొదలైంది. మూడు సీట్లతో సరిపెట్టుకునే పరిస్థితే లేదని, అవసరమైతే కూటమిలో కొనసాగడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సిపిఐ హెచ్చరించింది. కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసమితి నేత కోదండరాం, తెలంగాణ తెలుగుదేశం నేత ఎల్.రమణ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సిపిఐ నేతలు సంప్రదింపులు జరిపారు. అయితే తొందరపడవద్దని జానారెడ్డి సర్దిచెప్పారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ ఇంకెంత మాత్రం నాన్చివేత ధోరణి అవలంబించకుండా సత్వరం తేల్చాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయడం, కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు చేయడం తదితర అవసరాల కోసం ఢిల్లీలో వరుసగా మూడు రోజుల పాటు చర్చలు జరిగిన సందర్భంగానే దేవరకొండ మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాయక్ నిరసన వ్యక్తం చేశారు.

దీన్ని పరిష్కరించేలోపలే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిసి వ్యక్తిని ప్రకటించాలని, జనాభాలో సగానికి పైగా ఉన్న బిసిలను దృష్టిలో పెట్టుకుని సగం టికెట్లు ఆ సామాజికవర్గాలకే కేటాయించాలని కాంగ్రెస్ ఓబిసి కన్వీనర్ అశోక్ గౌడ్ వార్ రూమ్ ఎదుట నిరసన చేపట్టారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోవడంతో తుంగతుర్తి నుంచి టికెట్ ఆశిస్తున్న జ్ఞానసుందర్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిరసనకు దిగారు. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం నియమించిన భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ డబ్బులకు అమ్ముడుపోయిందని ఆరోపించారు. స్వయంగా భక్తచరణ్‌దాస్ సోదరుడే మూడు కోట్ల రూపాయల మేర ముడుపులు అందుకున్నారని, టికెట్‌లు ఇప్పిస్తానంటూ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. డబ్బులు ఇచ్చినవాళ్ళకు టికెట్లు కేటాయిస్తూ కాంగ్రెస్‌కు దీర్ఘకాలం నుంచి సేవ చేస్తున్నవారిని, బిసిలను అవమానపర్చి అన్యాయానికి గురిచేసిందని విమర్శించారు.

మరోవైపున మల్కాజిగిరి అసెంబ్లీ సీటు విషయంలోనూ కాంగ్రెస్‌ను నమ్ముకున్న నందికుంట శ్రీధర్‌ను కాదని జన సమితి తరఫున కపిలవాయి దిలీప్‌కుమార్‌కు కేటాయించినట్లు పార్టీ లీకులు ఇస్తోందని, శ్రీధర్‌కు టికెట్ ఇవ్వకుంటే ఒప్పుకునేదే లేదని, దిలీప్‌కుమార్‌ను ఓడిస్తామని గాంధీభవన్‌లోనే నిరసనకు దిగిన ఆయన అనుచరులు హెచ్చరించారు. బిసిల తరఫున ఎప్పుడూ గొంతు విప్పే మాజీ ఎంపి వి.హనుమంతరావు గాంధీభవన్‌కు చేరుకుని, బిసిలకు అన్యాయం జరిగితే తాను మౌనంగా ఉండనని, స్వయంగా రాహుల్‌గాంధీతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున బిసిలకు టికెట్‌లు ఇవ్వాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని, అధికారికంగా జాబితా వెలువడిన తర్వాత అన్యాయం జరిగినట్లు భావిస్తే హైకమాండ్‌పై వత్తిడి పెంచుదామని, తాను అందుకు ముందు ఉంటానని వారికి నచ్చచెప్పారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్‌రెడ్డి తన అనుచరులకు తగిన న్యాయం జరగలేదని అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. వార్‌రూమ్‌లోనూ, ఆ తర్వాత సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 74 మంది పేర్లను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్ళారు. పార్టీలో చేరుతున్న సందర్భంగానే తన అనుచరులకు టికెట్‌లు ఇవ్వాల్సిందిగా రాహుల్‌గాంధీ నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నానని, కానీ ఇప్పుడు ఎనిమిది మంది అభ్యర్థులకు మొండిచేయి ఎదురైందని వాపోయినట్లు తెలిసింది. వరంగల్ వెస్ట్‌లో వేం నరేందర్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్‌లో అరికెల నర్సారెడ్డి, ఆర్మూరులో రాజారాం యాదవ్, ఎల్లారెడ్డిలో సుభాష్‌రెడ్డి, దేవరకొండలో బిల్యానాయక్, ఇల్లెందులో హరిప్రియ, సూర్యాపేటలో పటేల్ రమేశ్‌రెడ్డి, చెన్నూరులో బోడ జనార్ధన్‌లకు 74 మందితో కూడిన జాబితాలో చోటు లేనట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈ సంగతి గురించి ఢిల్లీలో శుక్రవారం మంతనాలు జరిపినట్లు తెలిసింది. తన అనుచరులకు టికెట్లు ఇవ్వకుండా పార్టీకి రాజీనామా చేస్తానంటూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అనుచరుల సమాచారం. అయితే రేవంత్‌రెడ్డి ఆశిస్తున్న స్థానాల విషయంలో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలను రేవంత్‌రెడి ఖండించారు. తాను ఉదయం నుంచీ కాంగ్రెస్ పెద్దలతోనే సమావేశంలో ఉన్నానని, ఎవ్వరితోనూ తన మనసులోని మాటలను పంచుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ను నష్టపరిచే ఉద్దేశంతో ఇలాంటి అసత్యపు వార్తలను వదులుతున్నారని, ఇప్పటివరకూ అవినీతి కేసులంటూ ప్రచారం చేసి ఇప్పుడు పార్టీకి రాజీనామా అంటూ పుకార్లను సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

జనగామలో సీట్ల కొట్లాట
జనగామ అసెంబ్లీ సీటును తెలంగాణ జనసమితికి కేటాయించనున్నట్లు వార్తలు రావడంతో మహా కూటమిలో అంతర్గత పోరు మొదలైంది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ సీటును ఆశిస్తుండగా జన సమితి తరఫున కోదండరాం పోటీ చేయనున్నట్లు వార్తలు రావడం రెండు పార్టీల మధ్య చిచ్చురేపింది. అయితే జన సమితికి ఈ టికెట్ ఇస్తున్నట్లు వచ్చిన వార్తలు ఊహాగానాలేనని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేశారు.

కాంగ్రెస్‌కు జనగామ కంచుకోట అని, వేరే పార్టీలకు కేటాయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా ఒట్టిదేనని అన్నారు. ఇలాంటి ఊహాగానాలు ఏ పార్టీకీ మేలు చేయదని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. బిసి వర్గాలు కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఎక్కు సీట్లు అడుగుతున్నామని, ఆ నేపథ్యంలో బిసియేతర వర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం సీటు కేటాయిస్తుందని భావించడంలేదని అభిప్రాయం వ్యక్తంచేశారు.

నకిరేకల్‌ను ఇతరులకు ఇస్తే ఊరుకోం : కోమటిరెడ్డి
మహాకూటమి పొత్తుల పేరుతో నకిరేకల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కాకుండా మరో పార్టీకి కేటాయిస్తే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి స్పష్టంచేశారు. నకిరేకల్ స్థానాన్ని ‘తెలంగాణ ఇంటి పార్టీ’కి ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొనిందని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడు చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నకిరేకల్ టికెట్‌ను చిరుమర్తికి ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయబోనని స్పష్టంచేస్తూనే ఉత్తమ్, జానారెడ్డిని వారి స్థానాల్లో తన అభిమానులు ఓడిస్తారంటూ వ్యాఖ్యానించారు.

బిసిలకు అన్యాయం జరగదు : జానారెడ్డి
కాంగ్రెస్ పార్టీలతో బిసిలకు ఎప్పుడూ తగిన న్యాయం జరుగుతూనే ఉందని, గతంలో బిసిలకు 32 టికెట్లు ఇచ్చామని, ఈ సారి కూడా సీట్లు అదే స్థాయిలో లేదా ఒకటి రెండు ఎక్కువే ఉంటాయని సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలో బిసిలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారని, ఆయన రాగానే శనివారం సాయంత్రం అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని, అప్పటికి అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని, అప్పటివరకూ ఊహాగానాలపై ఆధారపడి బిసి ఆశావహులు గందరగోళానికి గురకావాల్సిన అవసరం లేదని జానారెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ప్రకటించారు. దేశ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, పొత్తుల అంశంపై చంద్రబాబే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారని అన్నారు. పొత్తుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, పార్టీలు తమకు కావాల్సిన సీట్లను అడిగాయని, తెలుగుదేశంకు 14, జనసమితికి 8, సిపిఐకి 3 చొప్పున సీట్లు ఇవ్వాలని నిర్ణయం జరిగిందని జానారెడ్డి తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య టికెట్‌కు లైన్ క్లియర్ చేశామని ఒక ప్రశ్నకు సమాధానంగా జానారెడ్డి బదులిచ్చారు.

కూటమిలో ముదిరిన సీట్ల లొల్లి
కాంగ్రెస్‌తో పాటు మహాకూటమిలోనే టిక్కెట్ల లొల్లి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ 74 మందితో అభ్యర్థులను ఖరారు చేసినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంటియా ఢిల్లీలో రెండు రోజుల క్రితం ప్రకటించడం, మిత్రపక్షాలకు నిర్దిష్టంగా ఎన్ని సీట్లు ఇవ్వనున్నదీ ఖరారు కావడంతో అసంతృప్తులు పెరిగాయి. ఒకవైపు కాంగ్రెస్‌లోనే అసమ్మతి జ్వాలలు చోటుచేసుకోగా, మరోవైపు సిపిఐ, జన సమితి పార్టీల్లోనూ అసంతృప్తి బైటపడింది. కాంగ్రెస్ ఆశాసహులు టిక్కెట్లు తమకే ఇవ్వాలంటూ గాంధీ భవన్ వేదికగా ఆందోళనలకు దిగారు. మల్కాజిగిరి టిక్కెట్ జనసమితికి ఇస్తున్నట్లు వార్తలు రావడంతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సీటును ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కే కేటాయించాలంటూ నందిగంటి శ్రీధర్ అనుచరులు గాంధీభవన్‌లో నిరసనకు దిగారు. మరోవైపు ఖానాపూర్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా హరినాయక్‌కే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ స్థానాన్ని రమేశ్ రాథోడ్‌కు ఇస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

గెలిచేవారే మిర్యాలగూడ అభ్యర్థిగా ఉండాలి : జానారెడ్డి
గెలిచేవారే మిర్యాలగూడ అభ్యర్థిగా ఉండాలన్నది తన అభిప్రాయమని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తాను లేదా తన కుమారుడు పోటీ చేయాలని కార్యకర్తల నుంచి వత్తిడి వస్తోందని, అధిష్ఠానం ఒప్పుకుంటే అక్కడి నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని తెలిపారు. అశావహుల్లో అసంతృప్తి సహజమేనని, నకిరేకల్ స్థానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. నకిరేకల్ టికెట్‌ను ‘తెలంగాణ ఇంటి పార్టీ’కి ఇస్తారంటూ వస్తున్న వార్తలు ఒక ప్రచారమే తప్ప వాస్తవం కాదన్నారు.

జాప్యంతో ఆందోళన: కోదండరాం, చాడ వెంకటరెడ్డి
సీట్ల కేటాయింపు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ త్వరగా తేల్చాలని, ఇక ఎంత మాత్రమూ గందరగోళానికి తావు ఇవ్వవద్దని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు. తాము కనీసంగా ఐదు సీట్లు అడిగితే తమతో సంప్రదింపులు జరపకుండానే, తమ అభిప్రాయాన్ని గౌరవించకుండానే కాంగ్రెస్ ఏకపక్షంగా మూడు సీట్లే అంటూ ప్రకటన చేయడం గౌరవప్రమైన అంశం కాదని, కూటమిలో కొనసాగే విషయమై భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే జన సమితి అధ్యక్షుడు కోదండరాంను, తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను కలిసి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, సీట్ల సర్దుబాటులో తలెత్తిన గందరగోళాన్ని కాంగ్రెస్ త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ కొన్ని సీట్లు అడుగుతుందని, వాటి విషయంలో చర్చించి తొందరిగా పరిష్కరించడం పొత్తులు బలంగా ఉండడానికి దోహదపడుతుందన్నారు. సిపిఐ న్యాయ సమ్మతంగానే ఐదు సీట్లను అడుగుతోందని, ఈ గందరగోళాన్ని త్వరగా తేల్చాలని కాంగ్రెస్‌కు సూచించారు. జన సమితికి కేటాయించిన ఎనిమిది సీట్ల విషయంలో సంఖ్యాపరంగా స్పష్టత ఉన్నప్పటికీ నిర్దిష్టంగా అవి ఏయే స్థానాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

Mahakutami Meeting in Delhi to finalise seat sharing

Telangana Latest News