Home జాతీయ వార్తలు బిజెపి బేరసారాలు!

బిజెపి బేరసారాలు!

shiv sena

ముంబై : బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని శివసేన తీవ్రస్థాయిలో విమర్శించింది. బిజెపి అగ్రనాయకత్వంపై విమర్శల ఉధృతిని తీవ్రతరం చేసింది. రాష్ట్రపతి పాలనను సాకుగా తీసుకుని తమ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవాలని బిజెపి యత్నిస్తోందని శివసేన ఆరోపించింది. బిజెపి వారిది పూర్తిగా తొండాట స్థాయికి దిగజారిందని మండిపడ్డారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో బిజెపి వైఖరిని దునుమాడుతూ సంపాదకీయం వెలువరించారు. దీనితో రాష్ట్రంలో కేంద్రంలో ఇంతవరకూ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల వివాదం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ స్థాపనకు ఏ కూటమికి సరైన బలం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించారు.

ఈ దశలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవిస్ ఇతర బిజెపి నేతల తీరును శివసేన సామ్నా సంపాదకీయం తూర్పార పట్టింది. శివసేన వారు ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు దిగడం ఏమిటని, ఇది అతుకులబొంత వ్యవహారంగా ఉందని కేంద్ర మంత్రులు విమర్శలకు దిగిన తరువాత శివసేన ఈ మంత్రులపై దాడిని ఉధృతం చేసింది. వీరి వైఖరి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేదిగా ఉందని, పరిస్థితిని అనుకూలంగా మల్చుకునే రీతిలో ఉందని శివసేన విమర్శించింది.

105 స్థానాల బలం ఉన్న పార్టీ ఇంతకు ముందు ప్రభుత్వ స్థాపనకు అశక్తతను చాటుతూ గవర్నర్‌కు నివేదించుకుంది. మరి ఇప్పుడు వారు తామే ప్రభుత్వాన్ని చేయగలమని ఏ విధంగా ధీమాగా చెపుతున్నారని సామ్నా ప్రశ్నించింది. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షులు చంద్రకాంత్ పాటిల్ శుక్రవారం చేసిన ప్రకటనలో బిజెపినే ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 119 మంది ఎమ్మెల్యేల బలం దక్కించుకుంటుందని చెప్పడంపై శివసేన నిప్పులు చెరిగింది.

ప్రభుత్వ స్థాపనలో చతికిల పడ్డ ఫలితం

మహారాష్ట్రలో మంగళవారం నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. అక్టోబర్ 24వ తేదీన ఎన్నికల ఫలితాల తరువాత ఏ పార్టీ కూడా ప్రభుత్వ స్థాపనకు ముందుకు రాకపోవడం, ఎన్నికలలో కూటమిగా పోటీ చేసిన బిజెపి, శివసేనల మధ్య చిచ్చు చెలరేగడం అధికార ప్రతిష్టంభనకు దారితీసింది. ముఖ్యమంత్రి పీఠంపై తమకు సమ అధికారం ఉందని , ఎన్నికలకు ముందు సూత్రీకరణ కూడా జరిగిందని శివసేన చెపుతోంది. అయితే ఇటువంటిదేమీ లేదని, కావాలంటే శివసేన వారికి ఎక్కువ సంఖ్యలో మంత్రిపదవులు ఇవ్వడం జరుగుతుందని బిజెపి ప్రకటించింది. ప్రస్తుత దశలో కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) ప్రాతిపదికన రాష్ట్రంలో శివసేన ఎన్‌సిపి కాంగ్రెస్‌ల ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దిశలో ఎన్‌సిపి నేత శరద్ పవార్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ సుక్షప్తావస్థలో ఉంది. ఈ తరుణంలోనే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బిజెపి అగ్రనేతలు రంగంలోకి దిగారని శివసేన పత్రిక సామ్నాలో ఘాటైన పదజాలంలో విరుచుకుపడ్డారు. పొసగని పార్టీలతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు అయినా అది ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదని మహారాష్ట్ర మాజీ సిఎం ఫడ్నవిస్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయని సామ్నా సంపాదకీయంలో తెలిపారు. ఇక కేంద్ర మంత్రి గడ్కరీ క్రికెట్‌లో, రాజకీయాలలో ఏమి జరుగుతుందో తెలియదని చెప్పడం చూస్తూ ఉంటే బిజెపి వారు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నట్లు భావించాల్సి వస్తుందని శివసేన విమర్శించింది. గడ్కరీకి క్రికెట్ గురించి తెలియదు, ఆయనకు ఉన్న సంబంధాలు అన్నీ సిమెంటు, ఈథనాల్, అస్ఫలేట్ ఇతర అంశాలతోనే అని సామ్నాలో వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో కూడా ఫిక్సింగ్‌లు, ప్రలోభాలకు దిగడం జరుగుతుందని గడ్కరీ ఈ కోణంలోనే ఆలోచిస్తున్నట్లు అనుకుంటున్నామని విమర్శించారు.

Maharashtra political crisis updates