Home ఎడిటోరియల్ అందని న్యాయం

అందని న్యాయం

Sampadakiyam           చట్టం, న్యాయం అనేవి సామాజిక మనుగడ బండికి కట్టిన రెండు ఎడ్ల వంటివి. ఆ రెండూ సవ్యంగా సాగినప్పుడే ఆ సమాజం సరైన స్థితిలో ఉన్నట్టు పరిగణించడానికి కొంతైనా ఆస్కారం కలుగుతుంది. ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని నిర్మించుకొని సమానత్వ సిద్ధాంతాన్ని ఎంచుకొని అందుకు అనుగుణమైన న్యాయ వ్యవస్థను కూర్చుకున్నాము గాని ఆ వైపుగా అడుగులు మాత్రం ఇప్పటికీ మందకొడిగానే పడుతున్నాయి. సకాల న్యాయం ఎడారిలో ఎండమావినే తలపిస్తున్నది. తగినంత మంది న్యాయమూర్తులు లేక, పెండింగ్ కేసులు పేరుకుపోయి, అంతిమ తీర్పులు వెలువడడానికి ఏళ్లూ పూళ్లూ పట్టిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కోర్టుల ద్వారా న్యాయ పాలన జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు, సమీక్షల అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మనల్ని మనం చక్కదిద్దుకోడానికి దారి ఏర్పడుతుంది.

కోర్టుల ద్వారా ప్రజలకు న్యాయం అందించడంలో దేశంలోని రాష్ట్రాల్లోకెల్లా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నదని కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా వరుసగా ఆ తర్వాత నిలిచాయని టాటా ట్రస్టులు ఇతర మరి కొన్ని ప్రఖ్యాత సంస్థలతో కలిసి అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదిక వెల్లడించిన సమాచారం గమనించదగినది. కోటి మందికి తక్కువ జనాభా గల చిన్న రాష్ట్రాల్లో న్యాయ పాలనలో గోవా అగ్రస్థానంలో ఉండగా, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ దాని తర్వాత ఉన్నాయని ఈ నివేదిక తెలియజేసింది. న్యాయ వ్యవస్థ మూల స్తంభాలైన పోలీసు, కోర్టులు, జైళ్లు, న్యాయ సహాయం అనే నాలుగు రంగాల్లో పురోగతిపై వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. ఈ నివేదికను బట్టి చూస్తే దేశంలో న్యాయం అందించే విధి విధానాల్లో అనేక లోపాలున్నట్టు అర్థమవుతుందని దీనిని విడుదల చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంబి లోకూర్ అభిప్రాయపడ్డారు.

దీనిని పరిగణనలోకి తీసుకొని పోలీసు, జైళ్లు, నేర దర్యాప్తుకు తోడ్పడే వేలి ముద్రలు తదితరాల పరిశోధన వ్యవస్థ (ఫోరెన్సిక్), న్యాయ సహాయం, ఖాళీల భర్తీ వంటి విభాగాల్లో గల లోపాలను సరిదిద్దుకోవలసి ఉన్నదని ఆయన చేసిన సూచన ఎంతో విలువైనది. దేశం మొత్తం మీద 18,200 మంది న్యాయమూర్తులున్నారని, మంజూరైన జడ్జీల పదవుల్లో ఇంకా 23 శాతం మేరకు ఖాళీగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు, కింది స్థాయి న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల పదవుల ఖాళీలు దశాబ్దాలు గడిచినా భర్తీకి నోచుకోకుండా అలాగే కొనసాగుతూ ఉండడం పెండింగ్ కేసులు పెరిగి పేరుకుపోడానికి ఒక ముఖ కారణం. సమాజంలోని కింది వర్గాల ప్రజల్లో చైతన్యం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి పదవుల్లో అన్ని సామాజిక వర్గాల వారికీ సరైన ప్రాతినిధ్యం కలిగేలా చూడవలసిన బాధ్యతను అటు ప్రభుత్వం, ఇటు న్యాయ వ్యవస్థ విస్మరిస్తున్నాయి.

పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేదన్న చేదు వాస్తవాన్ని ఈ నివేదిక కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడించింది. పోలీసు నియామకాల్లోనైతే మహిళలు 7 శాతం మేరకే ఉన్నారని చెప్పింది. కానిస్టేబుళ్లు, హోం గార్డులు వంటి కింది స్థాయిలో తప్ప పోలీసు వ్యవస్థలోని పై పదవుల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం నామ మాత్రమే. జిల్లా జడ్జీల వంటి కింది కోర్టుల న్యాయమూర్తి పదవుల్లో ఇతర వెనుకబడిన తరగతుల వారు కేవలం 12 శాతం మేరకే ఉన్నారు. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తి పదవుల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అత్యల్ప ప్రాతినిధ్యం కొనసాగడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఒక దశలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

2018 జనవరికి ముందు 7 సంవత్సరాల కాలంలో ఒక్క దళిత న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందలేదన్న చేదు వాస్తవం న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయానికి పట్టిన దుర్గతిని చాటుతున్నది. 80 శాతం జనాభా నిరుపేదలుగా ఉన్న పరిస్థితుల్లో న్యాయ సహాయానికి గల ప్రాధాన్యం చెప్పనలవికానిది. అయితే దేశంలో అందుతున్న న్యాయ సహాయం అతి స్వల్పమని నివేదిక నిర్ధారించింది. జైళ్లు 114 శాతం మంది ఖైదీలతో కిక్కిరిసి ఉంటున్నాయి. సమయానికి వాహనాలు అందుబాటులో లేక ఖైదీలను ఆయా కేసుల విచారణ కోసం కోర్టులకు తీసుకెళ్లడం పదేపదే వాయిదా పడడం మామూలైపోయింది. పర్యవసానంగా విచారణలోని ఖైదీల సంఖ్య పెరిగిపోతున్నది. అంటే శిక్ష పడక ముందే దానిని అనుభవిస్తున్న వారు అసంఖ్యాకంగా ఉంటున్నారు. మన న్యాయ పాలనలోని ఇటువంటి అనేక లోపాలను ఎత్తి చూపిన ఈ అధ్యయనం గణనీయమైనది. దీని వెలుగులోనైనా పాలకులు ఈ లోపాలను సవరించడం పట్ల దృష్టి కేంద్రీకరించాలి.

Maharashtra top state in delivering justice