Home తాజా వార్తలు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ

Shiva-Lingam

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల హరహర మహాదేవ నామస్మరణతో దేవాలన్నీ మార్మోగిపోతున్నాయి. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివుడి దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. మహాదేవుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన కీసరగుట్ట, వరంగల్ వేయి స్తంభాల ఆలయం, వేములవాడ, చెరువుగట్టు, కాళేశ్వరం కోటిలింగాల తదితర పుణ్యక్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భోళాశంకరుడి దర్శనం కోసం పోటెత్తారు.

ఇక ఎపిలోని ప్రముఖ శైవక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పాతాళగంటలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తితో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీ సంఖ్యల్లో తరలివస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ నెలకొంది. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.