Home ఖమ్మం ‘మహాత్ముడు’ నడియాడిన నేల

‘మహాత్ముడు’ నడియాడిన నేల

Mahatma Gandhi

 

తేత్రాయుగంలో శ్రీసీతారామలక్ష్మణులు నడియాడిన నేలపై జాతీపితగా పిలువబడుతున్న మహాత్మాగాంధీ కూడా కలియుగంలో నడియాడిన పవిత్ర ప్రాంతం ఖమ్మం గుమ్మం. ఆనాడు అయోధ్యలో తండ్రి అజ్ఞ మేరకు వనవా సానికి బయలుదేరిన శ్రీరామచంద్రుడు భద్రాచలం సమీపం లో పర్ణశాల ప్రాంతంలో సీతమ్మతో కలియతిరిగిన గడ్డపై కత్తి, డాలు పట్టకుండానే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి ‘మహాత్ముడైన’ మనలాంటి మనిషి మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఖమ్మం నేలపై అడుగు పెట్టారు. ఆ మహనీయుడి పవిత్ర పాదాలు తాకిన మధుర క్షణం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేవిధంగా నిలిచిపోయింది.

గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం రాకముందే అంటే 1945 ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మం, మధిర పట్టణాలను సందర్శించారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం ముందు ఉండి నడిచిన గాంధీజీకి ఖమ్మంతోపాటు సమీపంలోని వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి మేము సైతం అంటూ ఖద్దర్ టోపీలను ధరించి హాజరై ప్రపంచ శాంతి దూతను కన్నులార తిలకించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ‘మన తెలంగాణ ప్రతినిధి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఖమ్మం : అది 1946 ,ఫిబ్రవరి 5 వ తేదిన ఖమ్మం పట్టణంలో జరిగిన బహిరంగ సభకు మహాత్మగాంధి హాజరయ్యారు. 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం 1945లో ముగియడంతో గాంధీజీ వెంటనే దక్షిణభారత హింధీ భాష ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1946 జనవరి ఆఖరి వారంలో హింధి ప్రచార సభ రజతోత్సహాలను మద్రాస్‌లో నిర్వహించాలని తలపెట్టారు. ఈ సభకు జాతిపిత మహాత్మగాంధిని ఆహ్వానించారు. మద్రాస్‌లో కార్యక్రమం అనంతరం తిరిగి వార్ధ వెళ్ళేవిధంగా కార్యక్రమం రూపొందించారు. అయితే తిరుగుప్రయాణంలో మార్గమధ్యలో ఖమ్మం, వరంగల్‌లో గాంధిజితో సభలను ఏర్పాటు చేయించేందుకు ఆంధ్ర జాతీయ పక్ష నాయకులు ప్రయత్నించారు.

ఈ విషయాన్ని గాంధీజీ దృష్టికి తసుకేళ్ళగా అందుకు అంగికరించలేదు. చివరికి గాంధీజీ మద్రాస్‌కు వచ్చిన తరువాత ఎస్ రాజలింగం ద్వారా గాంధీజీ వద్దకు కబురు పంపించారు. తెలంగాణ ప్రాంతంలో గాంధీజీ అగవలసిన అవసరం గురించి వివరించి చెప్పగా అప్పుడు గాంధీజీ అంగికరించారు. 1946 ఫిబ్రవరి 3, 4 తేదీలల్లో మద్రాస్‌లోజరిగిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాలకు గాంధీజీ హాజరయ్యారు వార్ధా వేళ్ళే దారిలో మార్గమధ్యలోని ఖమ్మం, మధిర, వరంగల్, విజయవాడ రైల్ స్టేషన్లో అగేందుకు అనాడు గాంధీజీ ఒప్పుకున్నారు. ఇందుకుగాను రైల్వే అధికారులకు దరఖాస్తూ చేయగా అంగికరించారు. ఆ సమయంలో తెలంగాణ రాష్టయంలో నిజాం నిరంకుశ పాలన కొనసాగుతుంది అప్పట్లో స్టేట్ కాంగ్రెస్ పై విధించిన నిషేదాన్ని 1946లోనే ఎత్తివేసి జాతీయ నాయకుల పర్యనటకు అనుమతి ఇచ్చింది.

గాంధీజీ ఖమ్మం పట్టణానికి రాకకు కేవలం రెండు, మూడు రోజులే గడువు ఉంది. ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తి చేయాల్సి వచ్చింది. గాంధిజీ వస్తున్న విషయాన్ని 3వేల కరపత్రాల ద్వారా ప్రచురించి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో పంచిపెట్టారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా లౌడు స్పికర్లను తెప్పించారు. విజయవాడ నుంచి ప్రసిద్ద ఫోటోగ్రాఫర్ వీరన్నను పిలిపించారు. ఖమ్మంలో వెంకటగిరి రైల్వే క్రాసింగ్ వద్ద ప్రస్తుతం సుగ్గల వారి తోటగా పిలుస్తున్న ప్రాంతంలో బహిరంగ సభ వేధికను ఏర్పాటు చేశారు. విశాలమైన మైధానంలోనూ, ప్రక్కనున్న గుట్టల మీద జనం కూర్చనేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.గాంధీజీ కూర్చున్న సభా వేధికను చెక్క బల్లాలతో సుమారు 20 అడుగుల ఎత్తున్న నిర్మించారు.

రెండు వైపులా కర్రలు, తాళ్ళతో బారికేడ్లను నిర్మించారు. వేధిక నిర్మాణం, అలంకరణ కోసం అనాడు కాంగ్రెస్ కార్యకర్తలు, గాంధీజి అభిమానులు ఐదారు రోజులు శ్రమించారు. తెల్లారితే గాంధీజీ వస్తారనగా రాత్రి 8గంటల నుంచే జనం రావడం ప్రారంభించారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కొత్తగూడెం, కారేపల్లి ప్రాంతాల నుంచి కాలినడకను కూడా వచ్చారు. మహాత్ముడి మాటలు అందరికి వినబడే విధంగా ఏర్పాట్లు చేశామని ఎవ్వరూ కూడా లేచి నిలబడవద్దని రాత్రి నుంచే ప్రజలకు సభా నిర్వహకులు శిక్షణ ఇచ్చారు. 1946 ఫిబ్రవరి 5వ తేదిన ఉదయానికల్లా సుమారు 80వేలమంది జనం అక్కడికి చేరారు. అయినా ఎక్కడా కూడా క్రమశిక్షణ తప్పలేదు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో గాంధీజీ పర్యటించే ప్రత్యేక రైలు నాలుగుబోగిలతో వచ్చి మైదానం వద్ద అగింది.

తొక్కిసలాటలు జరుగుతాయని ఎవ్వరూ కూడా ఎదరు వేళ్ళలేదు. గాంధీజి రాకకోసం ఆనాటి కాంగ్రెస్ నాయకులు, స్వాతంత్య్ర పోరాట యోధులు పూల దండలతో ఘన స్వాగతం పలికారు. గాంధీజీ స్వయంగా చక చకా వేధిక మీదకు వచ్చారు. ప్రసన్నవదనంతో జనాన్ని కలియజూసి వారి నిశబ్దాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తూ సుమారు 3,4 నిమిషాల పాటు హింధీ భాషలో ప్రసంగించగా బొమ్మకంటి సత్యనారాయణ తెలుగులోకి అనువాదం చేశారు.ఆయన ప్రసంగించిన కొన్ని నిమిషాలే ప్రజల్లో స్వాతంత్ర పోరాట పటిమను రగిలించగలిగారు. గాంధీజీ వెంట ఎంఎస్ రాజలింగం, కమలాదేవి బజాజ్, కనుం గాంధీ, రామకృష్ణ బజాజ్, ఉన్నవ రాజగోపలకృష్ణయ్య, గాంధీజీ కార్యదర్శులు ప్యారేలాల్ గాంధీ, మహదేవ్ దేశాయ్ తదితరులు ఉన్నారు.

ఈ సభలో ముదుముల నర్సింగరావు, అచ్చుతరావు దేశ్‌పాండే, యల్లా ప్రగడ కృష్ణమూర్తి, గెల్లా కేశవరావు, ఖమ్మం వర్తక సంఘం అధ్యక్షులు సుగ్గల అక్షేయ గుప్తా, కొలిపాక కిషన్‌రావు, చావలి వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు 30వేల జనాభాతో ఉన్న ఖమ్మం పట్టణం వరంగల్ జిల్లా అంతర్‌భాగంలో ఉండేది. అయినప్పటికీ చుట్టు పక్కల నుంచి భారీగా జనం కదిలివచ్చారు. ఆ సభకు తండోపతండాలుగా దాదాపుగా 80వేల మంది జనభా స్వచ్ఛందంగా తరలివచ్చారని నాటి సభ నిర్వాహకుల్లో ఒక్కరైన కోదాటి నారాయణ రావు అప్పట్లో ప్రకటించారు.కుల మత ద్వేశాలు వద్దనీ, అస్ప్రశ్యత అసలే కూడదని, మద్యం ముట్టకుండా సంగ్రామంలో పాల్గొన్నాలని ప్రజలకు పిలపునిచ్చారు.

మతసామరస్యం, హరిజన సేవా, ఖద్దరు వస్త్రాలు, హిందీ భాష ప్రాముఖ్యత తదితర అంశాలపై గాంధీజి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. మరోసారి సభకు సమస్కరించి వెళ్ళి రైలెక్కారు. సభ ప్రశాంతంగా జరగడంతో గాంధీజీ నిర్వహకులను అభినందించారు.సభ అనంతరం గాంధీజీ వేగం చూసి జనం విస్తుబోయారు. ఈ సభకు బందోబస్తు కల్పిస్తామని నిజాం పోలీసులు ముందుకు వచ్చినప్పటికి సభా నిర్వహకులు అంగికరించలేదు.దీంతో నిజాం పోలీసులు సివిల్ డ్రెస్‌లో గాంధీజీ సభకు హాజరయ్యారు. ఈ సభకు వచ్చిన వారిలో ముందు వరసలో ఉన్నవారి నుంచి విరాళాలను సేకరించారు.ఆనాడు మొత్తం రూ.2వేల వరకు విరాళాలు అందాయి. సభలో ముందు వరసులో కూర్చున్న డిప్యూటి కలెక్టర్ రూ.15 విరాళంగా ఇచ్చారు.

గాంధేయవాదులు, వర్తక సంఘం వ్యాపారుల నుంచి విరాళాలను వసూళ్ళు చేశారు. అన్ని చిల్లర నాణాల రూపంలో వసూళ్ళు చేయగా వాటిని ఒక బస్తాలో వేసి గాంధీజీకి అందజేశారు. ఖద్దర్ క్లాత్ పై గాంధీజి సన్మాన పత్రాన్ని తయారు చేశారు. కానీ దానిని చదివి విన్పించ సయం లభించలేదు.సభ అనంతరం వేధికపై గాంధీజి కూర్చున్న ఖద్దర్ శాలువను వేలం వేయగా గాంధీజీ అభిమాని ఒక్కరూ రూ.30కి దక్కించుకున్నారు. ఆ సభకు వచ్చిన జనం ఎప్పుడు కూడా అనాటి ఖమ్మం మెట్టుకు హాజర్‌కాలేదు. పాలవారు, హోటళ్ళ వాళ్ళు కూడా గాంధీజీని చూసేందుకు రావడంతో టీ టిఫీన్లు కూడా దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన్నారు. తిరిగి వెళ్ళడానికి బస్సులు, రైళ్ళు చాలకపోవడంతో చివరికి ఖమ్మం లారీ యజమానుల సంఘం నాయకులు ముందుకొచ్చి నాలుగు లారీలతో జనాన్ని సూర్యాపేట,కోదాడ వరకూ పంపించారు.సాయంత్రానికి గాని జనం ఇళ్ళకు చేరలేదు.

అంతకుముందు అదే రోజు అదే రైలులో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మధిర రైల్వేస్టేషన్లో కూడా గాంధి అగారు. ఈ సందర్భంగా మధిరకు చెందిన పలువురు స్వాతంత్య్ర సమర యోధులు గాంధీజీకి ఘన స్వాగతం పలికారు. మధిర దేశబంధు మిర్యాల నారాయణ గుప్తా ఆహ్వానం మేరకు గాంధీజీ మధిరలో దిగి ప్రజలను ఉద్దేశించి దాదాపు పది నిమిషాల పాటు ప్రసంగించారు.దేశానికి స్వాతంత్య్రం ఆవశ్యకత,అహింసామార్గం కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆ సభలో గాంధీజీ ప్రజలకు వివరించారు. గాంధీజీ ఉపన్యాసానికి ఉత్తేజులైన మహిళలు తమ వంటి మీద ఉన్న బంగారం గాజులను, మంగళసూత్రాలను గాందీజీకి విరాళాలుగా అందించారు. సభకు హాజరైన ఒక మహిళ తన వేలి ఉంగరాన్ని గాంధీజీకి అందించేందుకు ప్రయత్నించగా అప్పటికే రైలు కదలడంతో ఆమె మరోనేత ఎంఎస్ రాజలీంగంకు అందజేయగా ఆయన గాంధీకి అప్పగించారు.

గాంధీజీ సభలో జమలాపురం కేశవరావు, మాడపాటి రాంచంద్రరావు, బన్సాలీ, బొమ్మకంటి సత్యనారాయణ, హయగ్రీవాచారి వంటి నాయకులు పాల్గొన్నారు.గాంధీజి పర్యటించే ప్రత్యేక రైలు మహబూబాబాద్, డోర్నకల్‌లో కూడా ఆగింది. గాంధీజీ తెలంగాణలో ఆగేందుకు ఆనాడు స్టేట్ కాంగ్రెస్ నాయకులు ఎంతో ప్రయత్నించారు. ఆనాటి స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శి ఎంఎస్ రాజలింగం, గొల్లపుడి సీతారామారావు (స్వామి సీతారాం)లను గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ వద్దకు పంపించారు. అంతకుముందే పలు మార్లు లేఖలు రాసినా అంగికరించపోవడంతో స్వయంగా వెళ్లి కలిశారు.

నిజాం రాష్ట్రం ప్రాంతంలో హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలను అనాడు నిజాం ప్రభుత్వం నిషేదించినందునా అంగికరించలేదు. ఆ తరువాత 1946లో స్టేట్ కాంగ్రెస్ పై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయడంతో గాంధీజి తెలంగాణలో పర్యటించేందుకు అంగికరించారు. ఆనాడు గాంధీజీ పర్యటించిన ప్రాంతంలో పాలరాతి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీచౌక్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖమ్మం నగరంలో పలు ప్రాంతాల్లో గాంధీ నగర్, గాంధీ విధీ అని నామకరణం చేయడంతో పాటు పలు కూడళ్ళో గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

Mahatma Gandhi attended a public meeting in Khammam