Home దునియా జాతిపితను పూజిస్తారిక్కడ!

జాతిపితను పూజిస్తారిక్కడ!

Mahatma Gandhi Temple

 

అక్టోబర్ రెండు అనగానే మనకు జాతిపిత గాంధీజీ గుర్తుకువస్తారు. ఆరోజున ఆయన్ను గుర్తుకు తెచ్చుకుని నివాళులర్పిస్తాం. కానీ ఓ గ్రామస్తులు ఏకంగా గాంధీజీకీ గుడినే కట్టేశారు. నల్గొండ జిల్లాలోని పెద్దకాపర్త్తి అనే ఊరిలో జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆలయం నిర్మించారు. రోజూ ఈ గాంధీ ఆలయానికి దాదాపు 100 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.

చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారిక్కడికి. రోజంత భజనలు జరుగుతాయి. పాఠశాల విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహిస్తారు. నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గుడిలో రెండు అంతస్తులుంటాయి. ప్రధాన ఆలయం పై అంతస్తులో ఉంటుంది. కింది అంతస్తులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద భక్తులు ధ్యానం చేస్తుంటారు. విరాళాల సేకరణతో గాంధీ ఆలయాన్ని పూర్తిచేశారు. ఇది హైదరాబాద్ నుంచి 75 కి.మీ దూరంలో ఉంది. ఆరుగురు సభ్యులతో కూడిన ట్రస్టు సందర్శకుల నుంచి వచ్చిన విరాళాలతో గుడిని నిర్వహిస్తున్నారు.

‘యువతకు మహాత్మాగాంధీకి సంబంధించి పూర్తి విషయపరిజ్ఞానం లేదని మా భావన. అయితే ఆలయానికి ప్రతిరోజు వెళతారు కాబట్టి గాంధీ మహాత్ముడిని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గాంధీ ఆలయం నిర్మించామని’ అని ట్రస్టు చైర్మన్ చెబుతున్నారు. ఆలయంలో గ్రంధాలయం కూడా ఉంది. ఇందులో గాంధీ జీవితం, ఆయన బోధించిన సూక్తులకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఉదయం ఆరు గంటలకు ఆలయద్వారాలు తెరుచుకుంటాయి. ఇక్కడ పూజారి 16 రకాల పూజలు నిర్వహిస్తారు. హిందూ ఆలయాల్లో అర్చకులు చేసే పూజలన్నీ ఇక్కడ చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టుకు భక్తులు కుంకుమ రంగులో ఉండే రిబ్బన్లు కట్టి తమ కోరికలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తారట.

 

Mahatma Gandhi Temple in Nalgonda