Home ఎడిటోరియల్ సామాజిక విప్లవోద్యమ పితామహుడు

సామాజిక విప్లవోద్యమ పితామహుడు

Jyotiba Rao Phule1848లో జరిగిన తన బ్రాహ్మణ మిత్రుని వివాహంలో బిసి ‘మాలీ’ కులానికి చెందిన ఫూలే పాల్గొనడం ఆయనను వివక్షకు గురయ్యేలా చేసింది. బ్రాహ్మణ మిత్రుని పెళ్లి ఊరేగింపులో జరిగిన ఈ అవమానం పూలే జీవితంలో గొప్ప మార్పుకు కారణం అయినది. అప్పటి నుంచి కులవివక్షపై పోరాడాలని నిర్ణయించుకున్నాడు. జ్ఞానసంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపాడు. థామస్ పెయిన్ 1791 లో రాసిన రైట్స్ ఆఫ్ మెన్ అనే గ్రంథం చదవడం ద్వారా ఫూలే మానవ హక్కుల గురించి తెలుసుకున్నాడు.

కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురయిన బడు గు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే. శతాబ్దాలుగా అణచి పెట్టబడిఉన్న కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిరావు ఫూలే. సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి ఆయన.

మానవ హక్కుల కోసం పోరాటం నడిపిన విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. భారతీయులంతా ఒకటే వారంతా సమానమే అనే భావనకు ఆద్యుడు ఆయన. విద్య అనేది మానవుడికి జ్ఞానద్వారాన్ని తెరుస్తుందని గ్రహించి నిమ్నవర్గాలకు సమాజంలో అట్టడుగున పడి ఉన్న వర్గాలకు జ్ఞానజ్యోతి చూపాడు. శతాబ్దాలుగా తమకంటూ ఒక ప్రతిష్టాత్మకమైన పరిధిని ఏర్పాటు చేసుకొని సమాజంపై పెత్తనం చెలాయిస్తున్న ఆధిపత్య వర్గాలతో ఆయన ఒంటరిగా నిజాయితీగా పోరాడాడు. విద్యకు విజ్ఞానానికి గుత్త అధికారులుగా ఉన్న బ్రాహ్మణ వర్గం ఆయనకు అడ్డుగా నిలిచింది. నిమ్న వర్గాల హక్కుల కోసం ఆయన ఎంతగానో పోరాడవలసి వచ్చింది.

సమాజంలో నిమ్న జాతులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు ఎలా దోపిడీకి గురవుతున్నారో ఎలా అణచివేయబడుతున్నారో చూసి వారికి ప్రతిఘటన మార్గం చూపాడు. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌పై జ్యోతిరావు ఫూలే సిద్ధాంతాల ప్రభావం చాలానే ఉంది. జ్యోతిరావు ను(1827-1890) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(18911956) చూడనే లేదు. కారణం వారు సమకాలికులు కాకపోవడమే. క్రింది కులాల వారు విద్యావంతులు కావాలి అన్న ప్రబోధాన్ని ఆచరణలో పెట్టినందువల్లనే బి.ఆర్.అంబేద్కర్ తండ్రి రాంజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి ప్రతిభావంతుని మన దేశానికి అందించగలిగారు. అందుచేతనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్యోతిరావ్ అంటే ఎనలేని గౌరవం. అందుచేతనే ఆయన రచించిన ‘శూద్రులు ఎవరు?’ అనే గ్రంథం జ్యోతిరావుకు అంకితం చేశాడు.

జ్యోతిరావు 1848 లోనే అంటరానితనం వద్దని చెప్పాడు. నిమ్న జాతుల వారిని బావి నుంచి నీరు తోడుకోనిచ్చాడు. సమాజం వెలివేసిన వారి పిల్లలకు చదువు నేర్పాడు. అనాథ శిశువులను ఆదరించాడు. స్త్రీలకు విద్య నేర్పాడు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. బాల్యవివాహాలు, వితంతువులకు జుట్టు తీయించడం వంటి మూఢాచారాలను ఖండించాడు. పురోహిత వ్యవస్థను, వర్ణవ్యవస్థను ప్రతిఘటించాడు. పురోహితులు లేకుండానే మత సంబంధమైన విధులు ఎవరికివారు నిర్వర్తించుకోవచ్చని చెప్పాడు. భారతీయులు మొట్టమొదటిగా మహాత్మా బిరుదునిచ్చి సత్కరించింది ఈయననే. భారతదేశంలోని కుల వ్యవస్థను సామాజిక అణచివేతను దోపిడీని వ్యతిరేకిస్తూ సేద్యగాని చర్నాకోల, గులాంగిరి వంటి రచనలు చేయడంతో పాటు సత్యశోధక సమాజ్ ద్వారా ఆచరణను కూడా ప్రారంభించాడు మహాత్మ జ్యోతిరావు పూలే.

జ్యోతిరావు పూలే1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించాడు. అప్పటి ఆచారం ప్రకారం పూలేకు 13 ఏళ్ల వయసులోనే 8 ఏళ్ల వయస్సు గల సావిత్రితో పెళ్లయింది. పూలే 1841లో పుణేలోని స్కాటిష్ మిషన్ స్కూల్లో చేరి సెకండరీ విద్యను పూర్తి చేశాడు. 1848లో జరిగిన తన బ్రాహ్మణ మిత్రుని వివాహంలో బిసి ‘మాలీ’ కులానికి చెందిన ఫూలే పాల్గొనడం ఆయనను వివక్షకు గురయ్యేలా చేసింది. బ్రాహ్మణ మిత్రుని పెళ్లి ఊరేగింపులో జరిగిన ఈ అవమానం పూలే జీవితంలో గొప్ప మార్పుకు కారణం అయినది. అప్పటి నుంచి కులవివక్షపై పోరాడాలని నిర్ణయించుకున్నాడు. జ్ఞానసంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపాడు. థామస్ పెయిన్ 1791 లో రాసిన రైట్స్ ఆఫ్ మెన్ అనే గ్రంథం చదవడం ద్వారా ఫూలే మానవ హక్కుల గురించి తెలుసుకున్నాడు.

భారతదేశంలోని శూద్రులు అతిశూద్రులు (ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు) అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగే ఉన్నారని భావించాడు. కుల, మత, వర్గ, వర్ణంతో సంబంధం లేకుండా మానవులందరూ దేవుని దృష్ఠిలో సమానమేనని, అందరికీ సమాన హక్కులు ఉండాలని అన్నాడు. పూలే కులవ్యవస్థ లోని అమానుషత్వాన్ని అంటరానితనాన్ని నిరసించాడు. సమాజంలో ఆధిపత్య కులాల ఆధిపత్యానికి మూల కారణం ఏమిటి అని ఆలోచించి దేశం ప్రగతిపధంలో నడవాలంటే అందరికీ విద్య అవసరమని భావించారు. త్వరితగతిన సమాజంలో మార్పు రావాలంటే విద్య ద్వారానే సాధ్యమని తలచి తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించి బాలికల పాఠశాలను మొదటిగా ఏర్పాటుచేయడం ద్వారా అందరికీ విద్య అందించాడు. సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయిని కావడం గమనించదగ్గ విషయం. రైతాంగ ఉద్యమాలను నడిపారు. మిల్లు కార్మికుల కోసం పోరాడారు. బ్రాహ్మణ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమాలను నడిపించారు.

సమాజం సమూలంగా మారాలని భావించిన పూలే దంపతులు బ్రాహ్మణ వితంతు మహిళలకు పుట్టిన అనాధ శిశువుల కోసం శరణాలయాన్ని ప్రారంభించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సాంఘిక విప్లవకారుడు, హిందూ సమాజంలో శతాబ్దాలుగా నిస్సహాయులుగా పడి ఉన్న వారి కోసం జీవితాంతం శ్రమించిన త్యాగశీలి. ధర్మశాస్త్రాల ప్రామాణికతను వేద పురాణాల వాస్తవికతను ప్రశ్నించిన హేతువాది. అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత పాఠశాల విద్య మాత్రమే పూర్తి చేసిన జ్యోతిరావు అత్యున్నత విద్యనభ్యసించిన మేధావులకు కూడా అందని తార్కిక పటిమను, పరిశోధనా పాటవాన్ని స్వయంకృషితో సాధించాడు. సమాజంలోని హెచ్చుతగ్గులను సమం చేసి కాలుష్యాన్ని కడిగేసే పనిలో నిరంతర కార్యశీలి గా ఉద్యమించారు. సమాజ దౌష్ట్యానికి ఎదురొడ్డి నిలిచారు. కవి, పద కర్త, గ్రంధకర్త త్యాగశీలి అయిన ఫూలే పక్షవాతం జబ్బునపడి 1890 నవంబర్ 28న అమరులయ్యారు.

-వాసిలి సురేష్ 9494615360

Mahatma Jotirao Phule Biography