Home సినిమా అమెరికాలో మహేష్

అమెరికాలో మహేష్

Mahesh

బ్లాక్‌బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ సెప్టెంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా అది ఇప్పుడు మొదలైంది. వీసాల మంజూరులో జాప్యం కారణంగా ఆలస్యమైన సినిమా షెడ్యూల్ ఎట్టకేలకు మొదలైంది. గురువారం న్యూయార్క్‌లో ‘మహర్షి’ షూటింగ్ ప్రారంభమైంది. మహేష్, విదేశీ నటుల మధ్య కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమాకు అమెరికా షెడ్యూల్ ఎంతో ముఖ్యమైనది. అక్కడ వరుసగా 20 రోజుల పాటు షూటింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా న్యూయార్క్‌తో పాటు అమెరికాలోని కొన్ని అరుదైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో పూజాహెగ్డే, అల్లరి నరేష్ కూడా పాల్గొంటారు. అయితే అమెరికాలో ‘మహర్షి’ షెడ్యూల్ మరోసారి కూడా ఉంటుంది. అది ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.