Home తాజా వార్తలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం

Mahmood Ali inaugurating the sangareddy town police station buiilding

 

హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అనంతరం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలవుతోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం నాడు కౌన్సిల్ ప్రొటెo చైర్మన్, హోం మంత్రి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బలోపేతం చేసిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ పని తీరు అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు విడతల్లో సుమారు ఇరవై ఎనిమిది వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ ల నియామకాలు జరిగాయని, ఈ సంవత్సరం మరో 20 వేల నియామకాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటుచేసిందని, అదేవిధంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసు నియామకాలలో మహిళలకు 33 శాతం ఉద్యోగాలను కేటాయించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖకు అధిక బడ్జెట్ కేటాయించడంతో పాటు, సిబ్బందిని పెంచిందని, అధునాతన వాహనాలు, సాంకేతికతను అందించిందిన్నారు. లీసులు ప్రజలకు స్నేహ పూర్వక వాతావరణంలో సేవలందిస్తున్నారని, నేరస్థులు క్రైమ్ చేయాలంటే భయపడుతున్నారని, క్రైమ్ జరిగిన స్వల్ప వ్యవధిలోనే పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితులను పట్టుకుంటున్నారన్నారు. నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని ఆయన అన్నారు. కరోనా కు వైద్యులు, మెడికల్ సిబ్బంది చికిత్సలు అందిస్తే , కరోనాను నియంత్రించడంలో పోలీసుల సేవలు అమోఘమైనవన్నారు.

కరొనా కట్టడికి ఎండనకా వాననకా, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోలీసులు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి మేమున్నామంటూ భరోసానిస్తూ రక్షణ కల్పిస్తున్న పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగు పడ్డాయన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుండాలంటే పోలీస్ శాఖ అధికారులకు సదుపాయాలు కల్పించాలని వాహనాలను సమకూర్చారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐ జి పిలు స్టీవెన్ రవీంద్ర, శివ శంకర్ రెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్, పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahmood Ali inaugurating the sangareddy town police station buiilding