Home ఆఫ్ బీట్ సకల కళల ఖజానా తెలంగాణ

సకల కళల ఖజానా తెలంగాణ

పొయెట్రీ, పెయింటింగ్స్, ఫిలాసఫీ, మూవీస్, మేగజైన్స్, మ్యూజిక్ ఈ కళలన్నింటినీ ముద్దగా చేస్తే వచ్చిన రూపం మామిడి హరికృష్ణ. ఈయన డిసెంబరు 2014 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జానపద, సంప్రదాయ కళలతోపాటు, వివిధ సాహితీ ప్రక్రియల్ని ప్రోత్సహించడం, ఉత్తమ ప్రచురణలు చేయించడం, వివిధ కళలను సేకరించి కాపాడడం, కళాకారులకు అండగా ఉండడం, రోజుకు దాదాపు 16 గం॥లు శ్రమించి, పనిరాక్షసుడిగా నిరూపించుకొని భాషా సాంస్కృతిక శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలపడం సామాన్య విషయం కాదు. ఆ నిరంతర సృజనశీలితో మన తెలంగాణ హరివిల్లు తన శాఖాపర నిర్వహణ గూర్చి ముచ్చటిస్తే ఇలా…

Ravindra-Bharathi

ఇది తెలంగాణలో బోనాల పండుగ సీజన్ కదా! తెలం గాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మీరేం చేయ బోతున్నారు?

బోనాల పండుగ అనేది స్త్రీమూర్తి అయిన అమ్మవారిని ఆరాధించే పండుగ. ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన కాలం నుండీ కొనసాగింపబడుతున్నది. ఐతే, హైదరాబాద్ నగరంలో కూడా ఆ సంప్రదాయాన్ని కాపాడబడుతుండం విశేషం. తెలంగాణ మూలాల్ని హైదరాబాద్ నగరం ఎప్పుడూ మరిచిపోలేదు. తెలంగాణ రాష్ట్రావతరణ జరిగిన తర్వాత ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు నగరంలో కేవలం 8 నుండి 12దేవాలయాల్లో మాత్రమే సాంస్కృతిక శాఖ కొన్ని వినోద కార్యక్రమాలు నిర్వహించేది. కానీ, కొత్త రాష్ట్రంలో 2015 లో 36 దేవాలయాల్లో, 2016లో 69 దేవాలయాల్లో ,2017 లో 136 దేవాలయాల్లో, 2018 లో 152 దేవాలయాల్లో అ మ్మవారి ఉత్సవాలలో ప్ర భుత్వం పక్షాన సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నాం . ఇందులో దాదాపు సకల జానపద కళలు, ఆధ్మాత్మిక భక్తి సంగీతాలను ప్రదర్శిస్తా ం. జానపదగీతాలు, కొమ్ముకోయ, చిందు, ఒగ్గుకథ, హరికథ, మిమిక్రీ, మ్యూజిక్, కూచిపూడి, పేరిణి, కోలాటం, పులివేషాలు,పోతురాజులు, శివసత్తులు వంటి తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాలను ప్రదర్శిస్తూ మట్టి కళలకు పట్టం కడతాం. ప్రజలకు విజ్ఞాన వినోదాలనందిస్తాం.

మీరు ఈ శాఖసంచాలకులుగా పదవీ బాధ్యతలు నిర్వహించిన తర్వాత సాంస్కృతిక పరంగా మీరు తీసుకున్న చర్యలేమిటి?
తెలంగాణ గ్రామీణ కళలు, విలువలు, జనజీవన శైలులను కూలంకషంగా అధ్యయనం చేశాను. పదిరకాల విధానాలకు, శైలులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అవి ఎ)జానపద కళలను ప్రోత్సహించి కాపాడడం, బి)గిరిజన కళారూపాలకు ప్రోత్సాహాన్నదివ్వడం సి)శాస్త్రీయ కళారూపాలకు అండగా నిలవడం డి)నాటక రంగ వికాసానికి కృషిచేయడం, ఇ)టివి,సినిమా రంగాల్లో కొత్త తరాన్ని ప్రోత్సహించడం, ఎఫ్)దృశ్య కళల్ని(పెయింటింగ్స్, ఫోటోగ్రఫీ, శిల్పకళ) ముందుకు తీసుకెళుతుండడం జి)హైదరాబాద్(దక్కన్) ఉర్దూ కళారూపాలకు ఊతమివ్వడం, హెచ్) విజువల్, అండ్ ప్రింటింగ్ వంటి వాటిని డాక్యుమెంటేషన్ చేయించడం ఐ) తెలంగాణ రాష్ట్ర పండుగల్ని (బతుకమ్మ, బోనాలు వంటి వాటిని) అద్భుతంగా నిర్వహిస్తుండడం, జె) తెలుగు, ఉర్దూ సాహిత్య వికాసాలకు తోడ్పడడం చేస్తున్నాం.

తెలుగు భాషా వికాసానికి మీ కృషి వివరిస్తారా?

తెలంగాణలో మొదటినుండీ గొప్ప సాహితీ సంపన్నులున్నారు.ఎంతో సాహితీ సృజన జరిగినా కొంతమంది తెలంగాణ సాహిత్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా చిన్నచూపు చూశారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కూడా విస్తృతమైన సాహిత్యం కవిత్వరూపంలో, పాటలరూపంలో ఇతర ప్రక్రియలల్లో వెల్లువలా వచ్చింది. పాటల రూపంలో వచ్చిన సాహిత్యం పామర జనాల్లో ఉత్సాహాన్ని నింపితే, ఇతర ప్రక్రియల్లో వచ్చిన సాహిత్యం బుద్ధిజీవులను ఆలోచింపచేసి కర్తవ్యోన్ముఖుల్ని చేసింది. అందుకే బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు విస్తృతంగా సాహిత్యకారులను ప్రోత్సహిస్తున్నాం. ఉగాది కవి సమ్మేళనాలను, మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవ సందర్భ కవిసమ్మేళనాలను, బతుకమ్మపండుగ కవి సమ్మేళనాలను, రాష్ట్రావతరణ దినోత్సవ కవి సమ్మేళనాలను నిర్వహిస్తున్నాం. తెలంగాణ మహాకవులు కాళోజీ, దాశరథి గారల పేరిట రాష్ట్రస్థాయిలో లక్షరూపాయలతో, జిల్లా స్థాయిలో 51వేలతో అవార్డులు ఇస్తున్నాం.అంతేకాక వివిధ జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో సాహితీ చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటితోపాటు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా విశిష్ట పురస్కారాలనందిస్తున్నాం.

తెలుగేతర భాషల పట్ల మీ ప్రోత్సాహం?

21, మార్చి 2016లో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అనువాద కవిత్వం మీద కవిసమ్మేళనం నిర్వహించాం. వాటిని క్రోడీకరించి ‘ఇక్కడి పరిమళం ఏ పూలదో’ పేరిట వివిధ భాషల కవిత్వసంకలనాన్ని తెస్తున్నాం. ‘హమారా హైదరాబాద్’ పేరిట కవిసమ్మేళనం నిర్వహించాం. 18 భాషల నుండి 112 మంది కవులు పాల్గొన్నారు. అదే టైటిల్‌తో పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. బాల్యం మీదకూడా బహుభాషా కవి సమ్మేళనం నిర్వహించాం. 112 మంది కవులు పాల్గొని సభను సుసంపన్నం చేశారు. వీటితోపాటు ఉర్దూ ముషాయిరాలు ఘనంగా నిర్వహించాం.

మీ శాఖ ద్వారా చేపట్టిన పుస్తక ప్రచురణల గూర్చి చెబుతారా?

రాష్ట్రావతరణ జరిగిన మొదటి ఉగాది (2015) మన్మథ నామ ఉగాది నాడు ‘కొత్తసాలు’ కవితా సంకలనం తెచ్చాం. తొలి బతుకమ్మపండగ సందర్భంగా 166 మంది కవులతో కేవలం ‘తంగేడు పూలు’ అనే అంశంపై కవితలు రాయించి ‘తంగేడు వనం’ పేరిట కవితా సంకలనం ప్రచురించాం. ఒకే ఒక్క అంశంపై ఇంత పెద్ద కవితా సంకలనం రావటం ప్రపంచంలోనే ఇది తొలి ప్రయత్నం. తొలి రాష్ట్రావతరణ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించాం. 442 మంది కవులు పాల్గొన్నారు. వారి కవితల్ని సేకరించి ‘తొలి పొద్దు’ కవితా సంకలనాన్ని ప్రచురించాం. ఇది భారతీయ భాషలల్లో వచ్చిన అన్నిట్లోకి అతిపెద్దది. పర్యావరణ అంశంపై 174 మంది కవుల కవితల్ని కూర్చి కవితా సంకలనం ‘ఆకు పచ్చని పొద్దు పొడుపు’పేరిట ప్రచురించాం. గ్రామీణ జీవనంపై ‘తల్లివేరు’, ‘మట్టిబుర్ర’లుగా రెండు కవితా సంకలనాల్ని తెచ్చాం.కేవలం రైతు జీవనంపై ‘స్వేదభూమి’ కవితా సంకలనం తీసుకువచ్చాం. పటం కథలు నేపథ్యంగా ‘కళా తెలంగాణం’ ప్రచురించాం. ‘తెలంగాణ తేజోమూర్తులు’ పేరిట 153 మంది ప్రముఖుల జీవన చిత్రాల్ని రాయించి ముద్రిపించాం. దీని ప్రత్యేకత ఏమంటే ఈ 153 మంది ఫోటో ఆల్బమ్‌కు తైలవర్ణాలు వేయించాం. వాటి కోసం చాలా శ్రమపడ్డాం. తెలంగాణలో వచ్చిన వందేళ్ల తెలుగు కథను (1912 2011 వరకు) సేకరించి, తెలంగాణ హార్వెస్ట్ పేరిట ఆంగ్లంలోకి అనువదించి, తెలంగాణ తెలుగు కథా ప్రక్రియను ప్రపంచానికి చాటి చెప్పాం. సంప్రదాయ సాహిత్యానికి పట్టం కట్టాలనే నిర్ణయంగా 5 జూన్ 2016 నాడు 136 మంది పద్యకవులతో కవి సమ్మేళనం నిర్వహించి ‘పద్య తెలంగాణం’ పేరిట పుస్తక ప్రచురణ గావించాం. సాంస్కృతిక సారథి ప్రత్యేక వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలపై 700 పాటల్ని రాయించి పుస్తకంగా ప్రచురించాం. వివిధ విశ్వవిద్యాలయాల్లో, ప్రముఖ కళాశాలల్లో నాటకం, నవల, వంటి వివిధ సాహితీ ప్రక్రియలపై సెమినార్లను చర్చా గోష్ఠులను, కవి సమ్మేళనాలను సంయుక్తంగా నిర్వహించాం.

నాటకరంగ అభివృద్ధికై మీకేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా?

ఉంది. సంప్రదాయ పద్య, పౌరాణిక, సురభి నాటకాలను ప్రోత్సహించి కొనసాగిస్తున్నాం. ఆధునిక ప్రయోగాత్మక, సాంఘిక నాటకాలను ప్రోత్సహిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ భాషల నాటకాలను తెలుగులో నాటకీకరించి ప్రదర్శింపజేస్తున్నాం. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన దక్కనీ నాటకాన్ని, ఉర్దూ నాటకాన్ని ఆదరించి ప్రోత్సహిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ సంస్కృతుల మార్పిడికై జాతీయ అంతర్జాతీయ కళాకారులను హైదరాబాద్‌కు ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఇప్పిస్తున్నాం.

మీరు చేస్తున్న డాక్యుమెంటేషన్ కృషిని తెలుపుతారా?

తెలంగాణ వారసత్వ సంపదలైన గ్రామీణ కళలు క్రమేణా అంతరించి పోతున్నాయి. వెలకట్టలేని ఆ కళల్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో విజువల్ డాక్యుమెంటేషన్ పని చేపట్టాం. వాటిలో కొమ్ముకోయ, శారదా కాండ్రు, కూనపులి పటం కథ, ఒగ్గుకథ, పన్నెండుమెట్ల కిన్నెర, కడ్డీతంత్రి, కాకి పడగల కథ, మాధురి, గుస్సాడి, నాగోబా జాతర వంటి వాటిపై అంతర్జాతీయప్రమాణాలతో హై క్వాలిటీ డాక్యుమెంటేషన్ రూపొందించాం.

రవీంద్రభారతి రెండో అంతస్తులోని ‘పైడి జయరాజ్’ ప్రివ్యూ థియేటర్ రెండో సారి ప్రారంభమవడానికి మీరే చొరవ తీసుకున్నారు. ఆ వివరాలు ఏంటి?

రవీంద్ర భారతి 1961లో నిర్మింపబడింది. అప్పుడురెండో ఫ్లోర్‌లో ప్రివ్యూథియేటర్ నిర్మించి సినిమాలు ప్రదర్శించే వారట. అది 24 ఏళ్ల క్రితం మూతపడింది. సంస్కృతి భాగంగా సినిమా కూడా చేరుతుందని భావించి, రాష్ట్రప్రభుత్వానికి థియేటర్ని తిరిగి తెరిపించుటకై ప్రతిపాదనలు పంపాం. గౌ॥ ముఖ్యమంత్రి గారు అంగీకరించి చక్కటి ప్రొజెక్టర్, Dolby surround system, 150 మంది హాయిగా కూర్చుని వీక్షించే వసతి, అనువైన స్క్రీన్ వంటి అన్ని వసతులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుటకు సహకరించారు. 2017 సెప్టెంబర్ 22వ తేదీన బతుకమ్మ పండుగ సందర్భంగా గౌ॥మంత్రివర్యులు ఈ థియేటర్‌ను ప్రారంభించారు. అయితే, ఈ థియేటర్‌కు ఏ పేరు పెట్టాలనే చర్చ వచ్చినప్పుడు, మన కరీంనగర్‌జిల్లా నుండి వచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ పేరును ప్రతిపాదించాం. జయరాజ్ 192030 లలో బొంబాయికి వెళ్లి దాదాపు 50 వరకు చిత్రాలలో హీరోగా నటించి మెప్పించిన ఘనుడు. ఆయన ఘనతని భారతప్రభుత్వం గుర్తించినా, అప్పటి మన ఆంధ్రప్రభుత్వాలు విస్మరించాయి. ఆయనకు నివాళిగా ఆయన పేరే ఈ థియేటర్‌కు పెట్టాలనుకున్నాం. 2015 లో దీన్ని తాత్కాలికంగా శుభ్రపరచి 2015 లో పదిరోజులపాటు బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్ చేశాం. కానీ, నేడది ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడంతోపాటు, లోపల చిత్రమాలిక, వివిధ ప్రముఖుల కొటేషన్స్‌తో సహా సర్వాంగసుందరంగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ కోసం, డాక్యుమెంటరీల కోసం, అమెచ్యూర్ ఫిలింమేకర్స్‌కోసం దీనికి సాటి మన దేశంలో ఎక్కడా లేదు. చివరికి బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా.

ఈ ప్రివ్యూ థియేటర్‌లో ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?

తెలంగాణ సకల కళల ఖజానా. సినిమా కూడా అందులో భాగమే కదా! కాబట్టి తెలంగాణలోని సినిమా దర్శకత్వం, ఎడిటింగ్, లైటింగ్, నిర్మాణం రంగాల్లో ఉత్సాహం చూపుతున్న యువతను ప్రోత్సహించాలనుకున్నాం. వారికి ఆయా రంగాల్లో మెళకువలు, నైపుణ్యాలను నేర్పించి, తీర్చిదిద్దాలి. ఆ ఆశయంతో ఎంతో మందికి తర్ఫీదు నిస్తున్నాం. ప్రతి ఆదివారం సండే సినిమా (అంతర్జాతీయ సినిమా పరిచయం) ప్రదర్శింపచేస్తున్నాం. అట్లా, ప్రపంచ స్థాయిలోని ఉత్తమ సినిమాల్ని చూపించి, ఆ సినిమాలు ఏయే రీతుల్లో ఉత్తమ స్థాయికి చెందినవో ప్రముఖులతో చెప్పిస్తున్నాం. చర్చలు జరుగుతాయి. అలాగే ప్రతి శనివారం ‘సినీవారం’ పేరిట మనయువ దర్శకులు నిర్మించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రదర్శింపచేస్తున్నాం. వాటిపైసినీరంగ ప్రముఖుల అభిప్రాయాలతో చర్చింప చేస్తున్నాం. ప్రతి జూన్ 2న తెలంగాణ అవతణోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరానికి రెండుసార్లు యువచిత్రోత్సవాలను నిర్వహిస్తు న్నాం. ఫెంటాస్టిక్ 5ను నిర్వహించాం. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ను నిర్వ హించి, జర్మనీ, ఇరాన్ దేశాల వంటి అంతర్జాతీయచిత్రాలను, మన దేశంలో నాలుగు భాషల్లో నిర్మించిన దేవదాసు చిత్రాల్ని ప్రదర్శించాం. ఇటీవల (16 జూన్ 2018 నుండి 22 వరకు) ఫ్రెంచి ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాం. అలాగే కొరియన్ ఫిలిం ఫెస్టివల్‌ను కూడా నిర్వహించబోతున్నాం.

తెలుగు ప్రాచీన హోదా లభించడానికి మీ కృషి ?

నేను ప్రపంచ భాషల్లోని అత్యుత్తమ సాహిత్యాన్ని అధ్యయనం చేశాను.వాటిని అనువాదాలుకూడా చేశాను. దాదాపు 10 వేల వరకు వ్యాసాలు రాశాను. వేలాది కవితల్ని ఒక భాష నుండి మరో బాషకు అనువాదాలు చేశాను. మన తెలుగు సాహిత్యం వీటిన్నింటిలో ఎక్కడా తీసిపోదు. అదంతా దాదాపు తవ్వి చూశాను. తెలంగాణలో జరిగిన సాహిత్యకృషిని అనుశీలించాను. తెలుగుకు ప్రాచీన హోదా న్యాయ పోరాటం (2009 నుండి 2015 ) వరకు సుషుప్తిలో ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు అప్పటికి మద్రాసు హైకోర్టులో నలుగుతున్న ప్రాచీన హోదా పోరాటానికి నేనే ముందు నడిచాను.తెలంగాణ సాహిత్య కృషిని వివరించాను. చివరికి ఫలించింది.

డా॥పల్లేరు వీరస్వామి
9441602605