Friday, March 29, 2024

వృద్ధులకు ఆసరా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పిల్లలు తల్లిదండ్రులను ఛీత్కరిస్తున్నారు. ఆసరాగా ఉండాల్సింది పోయి ఇంటి నుండి గెంటేస్తున్నారు. తొమ్మిది నెలలు మోసి కని పెద్ద చేసిన తల్లి, బాధ్యతగా చదివించి సద్బుద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేసిన తండ్రిని పిల్లలు దూరం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల పెరిగి పోతున్నాయి. వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే భారం దింపుకునే విధంగా వ్యవహరిస్తున్న పిల్లలు. ఉన్న ఆస్తిని కాజేసి ఇంటి నుండి వెళ్ళగొట్టే సంఘటనలు అనేకం చూస్తున్నాం. అలాంటి వృద్ధులకు ఆసరాగా మేమున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్సిస్తోంది. నిస్సహాయులమనే భావన కలుగకుండా అపన్న హస్తం అందిస్తోంది.

పిల్లలు విస్మరిస్తే ఆస్తుల నుండి బే దఖల్ చేసేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. వయో వృద్ధుల చట్టాల్లో విప్తవాత్మక మార్పులను తేవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచింది. వృద్ధులకు భరోసా కల్పించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ చట్టం 2011లో పలు కీలక మార్పులు చేసింది. సంరక్షణ పట్టించుకోని పిల్లల నుంచి ఇప్పటి వరకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తులనే తీసుకునే అవకాశం ఉండగా ఇకపై రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను కూడ తిరిగి తమ పేరిట బదలాయించుకునేలా చట్టాన్ని సవరించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్‌డిఒ లకు అధికారాలను కట్టబెట్టింది.
వయో వృద్ధుల హెల్ప్‌లైన్
వయో వృద్ధుల కోసం దేశంలోనే మొదటి సారిగా 2019లో తెలంగాణ ప్రభుత్వం ఎల్డర్ లైన్ హెల్ప్‌లైన్ నెంబర్ 14567 సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ హెల్ప్ లైన్ ద్వారా అక్టోబర్ 2020 మే 2022 కాలానికి పిల్లలు వయో వృద్ధుల దూషణలకు సంబంధించి 1211 కాల్స్ నమోదయ్యాయి. వీటిలో 223 కాల్స్‌ను ప్రభుత్వం పరిష్కరించింది. హెల్ప్‌లైన్ ద్వారా చాలా వరకు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, శారీరక హింసకు పాల్పడడం, ఎమోషనల్, సైకలాజికల్ దూషణలకు పాల్పడడం, ఆర్థిక పర వేధింపులకు పాల్పడే కాల్స్ అత్యధికంగా నమోదయ్యాయి. ఈ కాల్స్‌ను విశ్లేషిస్తే 46 శాతం వృద్ధ మహిళలు, 54 శాతం వృద్ధ పురుషులు వేధింపులకు గురవుతున్నట్లు గుర్తించారు. మొత్తం కాల్స్‌లో 39 శాతం నిరాదరణకు, 18 శాతం ఆర్థికపరమైన వేధింపులకు గురవుతున్నారని గుర్తించడం జరిగింది.

వృద్ధులను వేధింపులకు గురిచేస్తున్న వారిలో 56 శాతం కొడుకులు, 13 శాతం కోడళ్ళు, 7 శాతం కూతుళ్ళు ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. ఆస్తి లాక్కొని తల్లిదండ్రులకు గెంటేస్తున్నవారు, తిండి పెట్టకుండా నరకం చూపించిన వారు, సూటిపోటి మాటలతో క్షోభకు గురిచేస్తున్న వారు, అంత్యక్రియలకు కూడ రాని వారున్నారు. వీరందరికి చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం పిల్లల నుండి ఆస్తులను వెనక్కు తీసుకునే చట్టం తెచ్చింది. వేధిస్తే చర్యలు తప్పవు ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.
పెద్దపల్లిలో ఇంటిని తిరిగి ఇప్పించిన అధికారులు
పెద్ద పల్లిలో వృద్ధ తల్లిదండ్రులను వారి ఇద్దరు కొడుకులు ఇంటి నుండి వెళ్ళగొట్టారు. నిరాశ్రయులైన వయోవృద్ధులు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించారు. రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయి అయిన వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులు తల్లిదండ్రులను ఇంటినుండి వెళ్ళగొట్టడంతో ఆర్‌డిఒ ఎంఆర్‌ఒ ద్వారా విచారణ జరిపించారు. ఆ ఇంటిని సందర్శించి ఆ ఇంటిని తిరిగి తల్లిదండ్రులకు ఇప్పించారు.
వనపర్తి జిల్లాలో….
వనపర్తి జిల్లాకు చెందిన సైదులు నుండి ఎల్డర్‌లైన్‌కు కాల్ వచ్చింది. తన కుమారుడు వేధింపులకు గురిచేస్తున్నాడని, తనను పట్టించుకోవడం లేదని ఆ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. ఆర్‌డిఒ దీనిని సీరియస్‌గా తీసుకొని తండ్రి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. తనతప్పును గ్రహించిన కొడుకు ఇక జాగ్రత్తగా చూసుకుంటానని తండ్రిని తీసుకెళ్ళాడు.
వేధిస్తే చర్యలు తప్పవు : పార్థసారథి
వృద్ధులు సంతోషకరంగా శేష జీవితాన్ని గడిపేందుకు కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటోందని తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజెన్స్ కౌన్సిల్ సభ్యులు పార్థసారథి అన్నారు. వృద్ధుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. అందులో భాగంగానే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింని తెలిపారు.. వృద్ధులకు సమాజంలో ప్రతి ఒక్కరు అండగా నిలువాలని సూచించారు.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి : కమిషనర్
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కమిషనర్ శైలజ తెలిపారు. వాటిపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వృద్ధులు ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా సంప్రదించాలని సూచించారు. వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News