టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిలు కోరారు. ఇది రాజకీయం కోసం చేస్తున్న బంద్ కాదని ప్రజల కోసం చేస్తున్న బంద్ అని వారు తెలిపారు. ఈ భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డిసిసిలు, నియోజకవర్గ బాధ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు ఎవరికి కేటాయించిన ప్రాంతాల్లో వారు బంద్‌ను సక్సెస్ చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. ఈక్రమంలో భారత్ బంద్‌కు తెలంగాణ టిడిపి పూర్తి స్థాయిలో మద్దతిస్తుందని తెదేపా సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ప్రకటించారు. రైతులను ఆదుకోవటంలో తెరాస ప్రభుత్వం విఫలమవుతోందని, ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు వెళ్లిన సమయంలో సిఎం కెసిఆర్ రైతుల సమస్యలపై ఎందుకు చర్చించటం లేదని మండిపడ్డారు.