Friday, April 19, 2024

మార్కిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని

- Advertisement -
- Advertisement -

ఎంబీ భవన్‌లో వర్ధంతి కార్యక్రమం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Makineni basava punnaiah death anniversary

మన తెలంగాణ/హైదరాబాద్: మార్కిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని బసవపున్నయ్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన సిద్ధాంత స్ఫూర్తిని, నిర్మాణ దక్షతను కొనసాగించాలని ప్రతిజ్ఞ తీసుకుందామని చెప్పారు. సిపిఎం మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు మాకినేని బసవపున్నయ్య 29వ వర్థంతి కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో జరిగింది. ‘మార్కిజం, లెనినిజం వర్థిల్లాలి, కామ్రేడ్ ఎంబీకి జోహార్, ఎంబీ ఆశయాలను సాధిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అంతర్జాతీయ, జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సైద్ధాంతిక స్పష్టత అవసరమన్నారు. భౌతికంగా వర్గపోరాటాలు పెద్ద ఎత్తున సాగించే పరిస్థితి లేదని చెప్పారు.

ఇలాంటి పరిస్థితులు చరిత్రలో వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోనే సైద్ధాంతిక స్థైర్యం ఉండాలని సూచించారు. మార్కిజం, లెనినిజం గమనాన్ని పరిశీలిస్తే ఇలాంటి ఒడిదుడుకులు సహజమని అన్నారు. ప్రపంచంలో కమ్యూనిస్టులు ఆటుపోట్లు ఎదుర్కోవడం ఇప్పుడే కొత్త కాదన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకటించిన నాటినుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆటంకాలు ఎదురైనప్పుడు సైద్ధాంతికంగా స్పష్టత లేపుడే కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతిన్నదని వివరించారు. సిద్ధాంత ఆయుధం లేకుండా కేవలం కార్యకలాపాలతో ఊహాజనిత సోషలిజం నిర్మించలేమన్నారు. సోవియట్ యూనియన్, యూరప్‌లో వైఫల్యాలు కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతినడానికి కారణమని అన్నారు.

కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం సమస్యలను పరిష్కరించడం వరకు బాగనే ఉన్నా సోషలిజం నిర్మించే పద్ధతులపై గందరగోళం ఉందనీ, కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయని వివరించారు. సోషలిజం నిర్మాణంపై సైద్ధాంతిక స్పష్టత ఉండాలని చెప్పారు. ఆర్థిక సంక్షోభం, కరోనా వైరస్ వ్యాప్తితో పాటు మానవాళి ఎదుర్కొనే సమస్యలను పెట్టుబడిదారీ విధానం పరిష్కరించలేదని అన్నారు. ఏ సమస్యనైనా సైద్ధాంతికంగా పరిష్కరించాలని చెప్పారు. ఆ కృషి జరుగుతున్నదని అన్నారు. అనేక సమస్యలను, సైద్ధాంతిక నిబద్ధతతో అర్థం చేసుకున్న మహానాయకుడు మాకినేని బసవపున్నయ్య అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడడి, జి.రాములు, బి.వెంకట్, టి.జ్యోతి, పోతినేని సుదర్శన్, మిడియం బాబూరావు, ఎం.సాయిబాబు, సీనియర్ నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News