Saturday, April 20, 2024

తొమ్మిదేళ్లయినా మానని తాలిబన్ బులెట్ గాయం

- Advertisement -
- Advertisement -
Malala Lost Part Of Her Skull To Taliban Bullets
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఆవేదన

లండన్ : తాలిబన్లు నాపై కాల్పులు జరిపి తొమ్మిదేళ్లయింది. ఆ ఒక్క బులెట్ గాయం నుంచి నేనింకా కోలుకోలేక పోతున్నా. కానీ గత నాలుగు దశాబ్దాలుగా అఫ్గాన్ ప్రజలు లక్షల కొద్దీ బులెట్లను ఎదుర్కొంటున్నారు. నేటికీ వారి వేదన అరణ్య రోదనే. అంటూ అఫ్గానిస్థాన్ పౌరుల దుస్థితిపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు అఫ్గాన్‌లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె ప్రస్తుత అఫ్గాన్ పరిస్థితులపై స్పందిస్తూ తాలిబన్లు కారణంగా తాను అనుభవిస్తున్న గాయాలను పంచుకున్నారు.

‘రెండు వారాల క్రితం అఫ్గాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణ లోకి తీసుకుంటున్న సమయంలో నాకు బోస్టన్‌లో ఆరో శస్త్ర చికిత్స జరిగింది. తాలిబన్ల వల్ల నా శరీరానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు డాక్టర్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది 2012 అక్టోబరు. పాకిస్థాన్ తాలిబన్లు నా స్కూల్ బస్సు లోకి చొరబడి నా ఎడమ కణతిపై తుపాకీతో కాల్చారు. ఆ ఒక్క బుల్లెట్ నా ఎడమ కంటిని , నామెదడును తినేసింది. నా ముఖ నరాలను దెబ్బతీసింది. చెవిని, దవడను, విరగ్గొట్టింది. సమయానికి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెషావర్ డాక్టర్లు నా ఎడమ కణతి వద్ద పుర్రెలో కొంత భాగాన్ని తొలగించారు. దాని వల్లే నా ప్రాణాలు నిలిచాయి. అయితే ఆ తరువాత మిగతా అవయవాలు పనిచేయక పోవడంతో బ్రిటన్ లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స చేశారు.. నేను బతికానంటే నాకే నమ్మబుద్ది కాలేదు.

బులెట్ గాయం కారణంగా ముఖానికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దీంతో నరానికి సర్జరీ చేసి ముఖాన్ని ఓ రూపు తీసుకొచ్చారు. ఇప్పటికీ నేను నవ్వితే నా గాయాలు కనిపిస్తాయి. 2018,2019 లో మరో రెండు సర్జరీలు చేశారు. అయినా చెంప, దవడ భాగం ఉబ్బిపోవడంతో మరో ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆగస్టు 9 న ఆస్పత్రికి వెళ్లేందుకు బయల్దేరుతుంటే తాలిబన్ల వార్త తెలిసింది. కొద్ది రోజుల తరువాత ఒక్కో ప్రావిన్స్ తాలిబన్ల వశమైందని తెలిసింది. బాలికా విద్యపై అతివాదులు నిషేధం విధించడానికి వ్యతిరేకంగా నేను పోరాటం సాగించడం వల్లనే నాపై తాలిబన్లు కాల్పులు జరిపారు. పాక్ , అంతర్జాతీయ మీడియా సంస్థలు నా గురించి కథనాలు రాయడంతో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఎంతో మంది నాకు అండగా నిలిచారు. వారి వల్లే విదేశాల్లో నాకు చికిత్స జరిగింది. లేదంటే నా కథ స్థానికంగానే ముగిసేది. నేను బతికుండేదాన్ని కాదు. ఇప్పుడు అఫ్గాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ముష్కరుల తుపాకీ గుండ్ల నుంచి వారిని కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం కలిసి రావాలి ’ అంటూ మలాలా పోడియంలో రాసుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News