Home ఎడిటోరియల్ పెరియార్ డ్యాము పీడకలలు

పెరియార్ డ్యాము పీడకలలు

Malappuriyar Dam was built on the Periyar River

కేరళను ముంచెత్తిన వరదలు శతాబ్ద కాలంగా కనివిని ఎరుగనివి. కేరళ వరద బీభత్సం జాతీయ విపత్తు అనడంలో సందేహమేమీ లేదు. అనేక డ్యాముల్లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. డ్యాముల్లో నీటిని విడుదల చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో పెరియార్ నదిపై కట్టిన మల్లపెరియార్ డ్యాము ఈ వరదలను తట్టుకుని నిలబడుతుందా అన్నఅనుమానాలు భయాందోళనలు తలెత్తాయి.

మద్రాస్ ఇంజనీర్స్ కు చెందిన కల్నల్ జాన్ పెనీకుయిక్ ఈ డ్యాము నిర్మాణాన్ని 1887లో ప్రారంభించారు. 173 అడుగుల ఎత్తున్న భారీ కట్టడమిది. డ్యాము నిర్మాణం 1895లో పూర్తయ్యింది. ఇంజనీరింగ్ అద్భుతంగా ఆ కాలంలో ఈ డ్యాము పేరు పొందింది. ఈ డ్యాములోకి నీరు వచ్చే పరీవాహక ప్రాంతమంతా ప్రస్తుత కేరళ రాష్ట్రంలోనే ఉంది. అయితే ఈ డ్యాము నీటిని నిలువ చేసి కొంత నీటిని తూర్పున ఉన్న వాగై నదికి మళ్ళిస్తుంది. ఈ నది జలాలు తమిళనాడుకు వెళతాయి.

ఈ విషయమై 1886లో ఒక ఒప్పందం కుదిరింది. బ్రిటీషు మద్రాస్ ప్రెసిడెన్సీకి, ట్రావన్కూర్ సంస్థానానికి మధ్య కుదిరిన ఒప్పందం అది. ఈ ఒప్పందం ప్రకారం మల్లపెరియార్ డ్యాములో నీటిపై సర్వహక్కులు మద్రాస్ ప్రెసిడెన్సీకి లభించాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ దక్షిణ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఎదుర్కోడానికి ఈ డ్యాము జలాలు ఉపయోగపడేలా చేసుకున్న ఒప్పందం. మల్లపెరియార్ డ్యాము నిజానికి కేరళలో ఉంది. కాని ఈ డ్యాము నిర్వహణ నేటికి కూడా తమిళనాడు ప్రభుత్వమే చూస్తుంది. మల్లపెరియార్ డ్యాము 133 సంవత్సరాల పాత డ్యాము. 173 అడుగుల ఎత్తున్న ఈ డ్యాము నీటి నిల్వ సామర్థ్యం 142 అడుగులు.

ఈ సామర్థ్యానికి మించి ప్రమాదకరస్థాయిలో నీరు రిజర్వాయరులోకి ఈ వరదల కారణంగా వచ్చింది. ఎందుకంటే పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న నీరు చాలా ఎక్కువగా రిజర్వాయరులోకి చేరుతోంది. రిజర్వాయరు నుంచి బయటకు స్పిల్ వే ద్వారా, స్లూయిజ్ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు చాలా తక్కువగా ఉంది. రిజర్వాయరులో నీటి మట్టం పెరుగుతూ పోవడం వల్ల డ్యాము బీటలు వారికుప్పకూలే ప్రమాదం ఉంది. డ్యాము ఎత్తు వరకు నీరు చేరుకుంటే, లేదా పొంగిపొర్లడం ప్రారంభమైతే డ్యాము నిలబడదు. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గకపోతే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మల్లపెరియార్ డ్యాము గేట్లన్నింటినీ తెరిచారు. దాంతో పాటు కేరళ రాష్ట్రంలోని 32 ఇతర డ్యాముల నీటిని కూడా విడుదల చేయడం వల్ల వరదల ఉధృతి మరింత పెరిగింది.

దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ పనిచేస్తోంది. కమిషన్ చైర్మన్ ఇంతకు ముందు మల్లపెరియార్ డ్యామును పరిశీలించి గతంలో ఉన్న పూర్తి సామర్థాన్ని 152 అడుగుల నుంచి 142 అడుగులకు తగ్గించారు. తర్వాత మరికొంత తగ్గించి 136 అడుగుల స్థాయి నిర్ణయించారు. డ్యాముకు కొన్ని మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ నీటి నిల్వ సామర్థాన్ని 142 అడుగులకు తమిళనాడు పెంచింది. కాని డ్యాము సామర్థ్యంపై అనుమానాలున్న కేరళ నీటినిల్వను 136 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. ఎందుకంటే ఈ డ్యాము చాలా పాతది. నీటి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం బలహీనమై ఉంటుంది. అందువల్ల నీటిమట్టం పెరిగితే డ్యాము విఫలం కావచ్చు. డ్యాము ఒక్కసారి కూలితే జలప్రళయం ముంచెత్తుతుంది.

డ్యాము నిర్మాణంలో లీకులు ఉన్నాయని, బీటలు కనిపిస్తున్నాయని కూడా కేరళ వాదిస్తోంది. కాని ఈ డ్యాము నిర్వహణాధికారం తమిళనాడుదే. డ్యాము సామర్థ్యంపై అనుమానాలు లేవని తమిళనాడు వాదిస్తోంది. డ్యాములో నీటిమట్టం 142 అడుగుల సామర్థ్యంతో కొనసాగాలని కోరుతోంది. నీటిమట్టం ఎక్కువగా ఉండడం వల్ల వాగై నదిలో అధిక జలాలు ప్రవహిస్తాయి. తమిళనాడుకు ఈ జలాలు ప్రయోజనం కలిగిస్తాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య ఈ విషయమై అభిప్రాయభేదాలున్నాయి. డ్యామ్ భద్రత విషయం అనుమానాస్పదమని కేరళ వాదిస్తోంది. తమిళనాడు తమకు లభించే నీటి కోసం ఆలోచిస్తుంది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. డ్యాము వయసు, సామర్థ్యం విషయమై సుప్రీంకోర్టు తీర్పు కోసం వెళ్ళారు. మల్లాపెరియార్ డ్యామును పూర్తిగా కూల్చివేసి కొత్త డ్యాము కట్టాలని కేరళ వాదిస్తోంది.

ఆధునిక దేవాలయాలుగా చెప్పుకునే డ్యాములను నిర్వహించడంలో తగు జాగ్రత్తలు పాటించాలి. డ్యాము నీటినిల్వ సామర్థ్యం తగిన స్థాయిలో ఉండాలి. పరీవాహక ప్రాంతం నుంచి అధిక నీరువస్తున్నప్పుడు ముందుగానే నీటిని విడుదల చేసి డ్యాములో నీటి నిల్వ తగ్గించాలి. ఖచ్చితమైన వాతావరణ హెచ్చరికల వ్యవస్థ ఉండాలి. కాని ‘సౌత్ ఆసియా నెట్వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్స్’ ప్రకారం కేరళలో వరదలు వచ్చిన తర్వాత మాత్రమే ఇదుక్కి రిజర్వాయరు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించలేమా? సెంట్రల్ వాటర్ కమిషన్ వరదల హెచ్చరికలను చేయడం, ముందస్తు జాగ్రత్తలు సూచించడం జరగడం లేదు. కమిషన్ వెబ్‌సైటులో వరద హెచ్చరికలకు సంబంధించిన సమాచారమే ఉండదు. రిజర్వాయర్లలోకి వచ్చే నీటి గురించి అంచనాలు కూడా ఉండవు.

కేరళలో వరదల నిర్వహణకు సంబంధించిన సమాచారం మాత్రమే కనిపిస్తోంది. వరదల గురించి ముందస్తుగా హెచ్చరికలు లేకపోవడం, తగిన ముందు జాగ్రత్తలు లేకపోవడం వల్ల వరద పరిస్థితిలో తడబడడం, రిజర్వాయర్ల గేట్లు తెరిచి ఒకేసారి నీటిని విడుదల చేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం తప్పడం లేదు. మల్లపెరియార్ డ్యాము వివాదం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడే కేరళ వరద బీభత్సానికి గురైంది. అగష్టు 16న సుప్రీంకోర్టు పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, డ్యాము విఫలమైతే దాదాపు 30 లక్షల మంది ప్రజలకు వాటిల్లే భయానక నష్టం దృష్ట్యా, డ్యాములో నీటిమట్టం 3 అడుగులు తగ్గించాలని తీర్పు చెప్పింది. వరద విపత్తుల నిర్వహణ విషయంలో న్యాయమూర్తులు నిపుణులు కాదు, రిజర్వాయరులో నీటిమట్టం ప్రమాదం గురించి చెప్పడం వారికి సాధ్యపడదు. ఈ విషయాన్నే న్యాయమూర్తులు కూడా చెప్పారు.

మల్లపెరియార్ డ్యామ్ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టి నీరు రావడం తగ్గుతుందని అందరూ ఆశిస్తున్నారు. కాని వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టి, వరదల వంటి విపత్తులు తరచు ఎదుర్కోవలసి వస్తుంది. కేరళ ఇప్పుడు అలాంటి మహావిపత్తునే ఎదుర్కొంటోంది. ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే ఏంచేయాలన్నది ప్రభుత్వం ఆలోచించాలి. వరద హెచ్చరికలకు తగిన వ్యవస్థ ఏర్పాటు కావాలి. పాత డ్యాములను కూల్చి కొత్త డ్యాములు కట్టాలి. అభివృద్ధి పేరిట అడవుల నరికివేతను అడ్డుకోవాలి.