Home తాజా వార్తలు పార్టీ మారే ఆలోచనలో రేవంత్‌రెడ్డి..!

పార్టీ మారే ఆలోచనలో రేవంత్‌రెడ్డి..!

revanth-reddyహైదరాబాద్: పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీ మారనున్నారా? అన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఆయన అడుగులు కమలం వైపు పడుతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ బిజెపికి చెందిన ఒక ముఖ్యనాయకుడితో కలిసి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెలుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడ అమిత్‌షాను ఆయన కలిసి చర్చించే అవకాశముందని తెలుస్తోంది. తదనంతరం అధికారికంగా రేవంత్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని ఆయన అభిమానులు, అనుచరవర్గాల్లో వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బిజెపికి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా బిజెపి నేతలు భావిస్తున్నారు. పైగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కొరకరాని కొయ్యగా పేరు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి సేవలను పూర్తిగా తెలంగాణలో వినియోగించుకోవాలని కూడా యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇది రానున్న రోజుల్లో బిజెపికి మరింత రాజకీయ ప్రయోజనం చేరుకుందని కమలంనేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పైగా యువకుల్లో మంచి క్రేజీ ఉన్న రేవంత్‌రెడ్డిని బిజెపిలోకి తీసుకోవడం వల్ల టిఆర్‌ఎస్‌కు దీటుగా పార్టీని పటిష్టం చేసుకునే అవకాశం ఉండడంతో కమలనాధులు కూడా ఆ దిశగానే ప్రణాళికలను అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి జాతీయ నాయకత్వం ఆపరేషన్ ఆకర్శ్‌పై దృష్టి సారించిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రంలో కమలం పార్టీని బాగా విస్తరించాలన్న పట్టుదలతో ఉంది. చాలా కాలంగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఆరు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే మంచి ఫలితాలను సాధించాలని భావించినప్పటికీ టిఆర్‌ఎస్ నామ మాత్రంగా కూడా బిజెపి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మోడీ గాలి బలంగా వీయడంతో బిజెపి రాష్ట్రంలో నాలుగు స్థానాలను గెలుచుకోవడంతో కమలం నేతల్లో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగింది. టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయంగా ఎదిగేందుకు ఇదే సరైన అవకాశమని భావిస్తోంది.

ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆహ్వానించడం ద్వారా 2024 ఎన్నికల సంవత్సరాన్ని టార్గెట్‌గా చేసుకుని వ్యూహాలకు పదనుపెడుతోంది. ఇదిలా ఉండగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం రోజురోజుకు సన్నగిల్లుతుండడంతో రేవంత్‌రెడ్డి సాధ్యమైనంత త్వరగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడం వల్ల అన్ని రకాల సహాయ సహకారాలు లభించడం వల్ల రాష్ట్రంలో తన దూకుడును మరింతగా పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. దీంతో రేవంత్‌రెడ్డి అడుగులు ఢిల్లీ వైపు వడివిడిగా పడుతున్నట్లే తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో ఆందోళన….

రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న జోరుగా ప్రచారం సాగుతుండడంతో కాంగ్రెస్ వర్గాల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. ఎన్నికలు ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా గడవకముందే హస్తంలో మళ్ళీ కుదుపుల గోల ప్రారంభంకావడంతో పార్టీశ్రేణులు తీవ్ర నిర్ఘాంతపోతున్నాయి. వాస్తవానికి నిస్తేజంగా మారిన కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి ఆక్సిజన్‌గా మారుతున్నారని పార్టీలోని కిందిస్థాయి నాయకులు భావించారు. కానీ ఆయనే పార్టీ మారుతున్నారన్న ప్రచారం సాగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి నాయకుల వలస మొదలైనట్లేనా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రచారం జరుగుతున్నట్లుగానే రేవంత్‌రెడ్డి బిజెపిలోకి వెలుతారా? లేదా? అన్నది ఒకటి, రెండు రోజుల్లో పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కాంగ్రెస్ నేతలకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది.

Malkajgiri MP Revanth Reddy To Join BJP