Home ఎడిటోరియల్ ఆశల పల్లకిలో మమత

ఆశల పల్లకిలో మమత

Mamata Banerjee focus on Goa Assembly Elections

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ప్రధాని పదవిపై దృష్టి కేంద్రీకరించి పావులు బలంగా కదుపుతున్నారు. ఈ దృశ్యం రోజురోజుకీ మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. స్వరాష్ట్రంలో వరుస ఘన విజయాలు సాధించి 60, 70 శాతం ఓటు ముల్లెను చేజిక్కించుకున్న మమతా బెనర్జీ బయటి రాష్ట్రాల వైపు దృష్టి సారించారు. దేశంలో వీలైనంత అధిక భాగంలో వ్యాపించడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించాలని తహతహలాడుతున్నారు. అందుకు నాందీగా వచ్చే ఫిబ్రవరిలో జరగబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 40 శాసన సభా స్థానాలున్న గోవా అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమి 32.5 శాతం ఓట్లు, 13 సీట్లు సాధించుకోగా, కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ కూటమి 28.4 శాతం ఓట్లు, 17 సీట్లు గెలుచుకున్నది. అక్కడ మూడవ ముఖ్యమైన పార్టీ మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజిపి). సీట్లు తక్కువ వచ్చిన బిజెపి, కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా తన బలాన్ని 27కు పెంచుకొని అధికారాన్ని అనుభవిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు తమ శక్తియుక్తులను ప్రదర్శించి గోవాలో అధికారాన్ని చేజిక్కించుకోజూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు వలస పక్షులవంటివని గోవాలో బిజెపి ఇన్‌చార్జి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు గోవాలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో నరేంద్ర మోడీని ఆ పార్టీ తరపున ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీని గెలిపించి ప్రధాని అయ్యారు. అదే విధంగా మమతా బెనర్జీ కూడా గోవా సెంటిమెంటు మీద నమ్మకంతో అక్కడి నుంచి ప్రారంభించి తన అదృష్టాన్ని పరీక్షించుకోజూస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దర్శకత్వంలో గత జూన్‌లో ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం నాటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ తన జాతీయ సారథ్య స్వప్నాన్ని సఫలం చేసుకోడానికి అడుగులు వేస్తున్నది. తాజాగా ఢిల్లీలో మకాం వేసిన మమతా బెనర్జీని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి కలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పరిచయమున్న రాజకీయ నేతలందరిలో ఒక్క మమతా బెనర్జీయే జయప్రకాశ్ నారాయణ్, మాజీ ప్రధానులు మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పివి నరసింహారావుల స్థాయి కలిగిన వారని ఆయన అభిప్రాయపడ్డారు. వారు తాము చెప్పిన దానికి కట్టుబడి వున్న నేతలని అన్నారు. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీ పనికిరాని పాలకుడని, అన్నింటా విఫలమొందారని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి మమతా బెనర్జీ జాతీయ స్థాయి ప్రాముఖ్యం కోసం ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంత చచ్చినా జాతీయ స్థాయిలో బిజెపి తర్వాత రెండవ శక్తివంతమైన పార్టీగా ఇంకా కొనసాగుతూనే వుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 200 నియోజక వర్గాల్లో రెండవ స్థానంలో వచ్చింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 160 లోక్‌సభ స్థానాల్లో ప్రధానమైన బిజెపి వ్యతిరేక పార్టీగా అది తన స్థానాన్ని పదిలం చేసుకొని వుంది. బిజెపికి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్నపళంగా ఎదిగి పోవాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ గాని, దానికి వెన్నుదన్నుగా వుంటున్న శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) గాని కాంగ్రెస్ లేవు. ప్రస్తుతానికి ఆ రెండు పార్టీలు బెంగాల్, మహారాష్ట్రలకి, ఒకటి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమై వున్నాయి. ఈ విషయం మమతా బెనర్జీకి గాని, ఆమెకు వ్యూహ కర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌కు గాని, శరద్ పవార్‌కు గాని తెలియనిది కాదు. అందుచేత కాంగ్రెస్‌ను మినహాయించి బిజెపితో తలపడే తృణమూల్ కాంగ్రెస్ లేదా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీగాని బిజెపిని అధికారం నుంచి తొలగించడంలో సఫలీకృతం కావడం ఆశించినంత తేలిక కాబోదు. కాంగ్రెస్‌ను కలుపుకోకుండా ఇతర ప్రతిపక్షాలు విడిగా బిజెపిని ఢీ కొనడమంటే దాని వ్యతిరేక ఓటును చీల్చి వరుసగా మూడో సారి దేశాధికారాన్ని కమలం పార్టీ చేతిలో పెట్టడమే అవుతుంది. అందుచేత 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తో కూడిన గట్టి ప్రతిపక్ష కూటమి ఏర్పాటు అవుతుందో సింహం, నాలుగెద్దులు కథలో మాదిరిగా కాంగ్రెస్ ఏకాకిగానూ మిగతా ప్రతిపక్షాలు వేరొక శిబిరంగానూ చీలిపోయి పోటీ చేస్తాయో వేచి చూడాలి.

Mamata Banerjee focus on Goa Assembly Elections