Home జాతీయ వార్తలు మోడీ హయాంలో ప్రజాస్వామ్యానికి మూడింది

మోడీ హయాంలో ప్రజాస్వామ్యానికి మూడింది

Mamata lashes out at modi govt over pegasus spyware scandal

 

ప్రతిపక్షాల సంఘటితానికి మమత బెనర్జీ పిలుపు
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై స్పందన
ఇతరులతో ఫోన్లలో మాట్లాడలేను
ప్రజల గొంతు నొక్కడం భావ్యమా?

కోల్‌కతా : దేశంలో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లిందని, ఈ దశలో ప్రతిపక్షాలు అన్ని సంఘటితంగా కదలాల్సి ఉందని బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. బిజెపి అధికార హయాంలో దేశం ఇప్పుడు నిఘా రాజ్యం ఏర్పడిందని పెగాసస్ స్పైవేర్ వాడకం నేపథ్యంలో మమత స్పందించారు. ప్రతిపక్షాల నేతలు, జర్నలిస్టులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్‌లు, వ్యక్తుల కదలికలపై నిఘా వంటి పరిణామాలతో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడిందని అన్నారు. ఇక్కడ జరిగిన అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మమత ప్రజలను ఉద్ధేశించి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. తాను ఈ నెల 27 లేదా 28వ తేదీలలో దేశ రాజధానికి వెళ్లుతానని, ప్రతిపక్ష నేతల భేటీ జరిగితే అందుబాటులో ఉంటానని తెలిపారు. మమత ఆన్‌లైన్ ప్రసంగాన్ని భారీ స్థాయి టీవీ స్క్రీన్లపై ఢిల్లీ ఇతర నగరాలలోని పలువురు ప్రతిపక్ష నేతలు వీక్షించారు.

రాహుల్, ప్రశాంత్‌కిషోర్, మమత మేనల్లు అభిషేక్ బెనర్జీ వంటి పలువురి ఫోన్లు ట్యాప్‌నకు గురైనట్లు వైర్ పత్రిక సంచలనాత్మక వార్త వెలువరించింది. ప్రజాస్వామ్యంలో మీడియా, జుడిషియరీ, ఎన్నికల సంఘం మూడు ముఖ్య అంశాలని, ఇవి ప్రజాస్వామ్యానికి పునాదులు అవుతాయని, అయితే ఇప్పుడు వీటిపై నిఘా పెరిగిందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిఘా రాజ్యం అవుతోందన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వాడుకునే గ్రేడ్ స్పైవేర్‌ను ప్రత్యర్థి నేతలపై ప్రయోగించడం, వారి ఫోన్ల డాటాను తస్కరించడం దారుణం అని మమత తెలిపారు. ఇది ప్రమాదకరమే కాకుండా రాక్షసం కూడా అని విమర్శించారు. తానైతే తన ఫోన్‌కు సీలు చేసి పెట్టానని, ఫోన్లలో ఇతర నేతలతో మాట్లాడదల్చుకోలేదని, ఫోన్ల ట్యాపింగ్ భయం పట్టుకుందని, అందుకే ఆన్‌లైన్‌లో భారీ ఏర్పాట్లుతో ఇతర నేతలు కూడా ఇప్పటివిషయం తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పవార్‌తో కానీ, ఢిల్లీ సిఎంతో కానీ, గోవా ముఖ్యమంత్రితో కానీ ఫోన్‌లో ముచ్చటించడం కుదరదని, తన సెల్‌ఫోన్‌కు టేప్‌లు వేసి పెట్టానని, ఎందుకంటే ఎక్కడ ఫోన్లు ట్యాప్ అవుతాయో అనే భయం పట్టుకుందని ఆమె స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె ప్లాస్టర్ వేసి ఉన్న తమ ఫోన్ చూపించారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ దేశాన్ని కేవలం న్యాయవ్యవస్థనే రక్షించగలదని మమత తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఇప్పుడు స్పందించి దేశాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ద్వారా దేశానికి ముప్పు తప్పించాలని కోరారు. అన్ని ఫోన్లు ట్యాప్ అయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం స్పందించవచ్చు కదా, సుమోటోగా విచారించవచ్చు కదా అని తెలిపారు. విషయంపై వెంటనే ప్యానెల్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలి, ఇప్పుడు మిగిలిన దిక్కు కేవలం న్యాయవ్యవస్థనే అన్నారు. సందర్భంగా ఆమె ప్రధాని మోడీని ఉద్ధేశించి తీవ్రస్థాయిలో హెచ్చరికలు వెలువరించారు. దేశంలో ఇప్పుడు జరిగింది తేలికైన విషయం కాదని ప్రధాని మోడీ గుర్తుంచుకుంటే మంచిది. ఆయనను తాను వ్యక్తిగతంగా విమర్శించడం లేదని , అయితే మీరు కానీ మీ హోం మంత్రి కానీ ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా నిఘా సంస్థలను ఉపికొల్పడం జరిగితే అది క్షమించరాని విషయం అవుతుంది. అధికారిక సంస్థలను మీ ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడం తప్పని తెలిపారు.

ప్రజల ధనాన్ని ఈ విధంగా మోడీ ప్రభుత్వం స్పైవేర్ వాడకానికి వాడుతోందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలిందని విమర్శించారు . పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. భారత ప్రభుత్వం ప్రజల నుంచి ఇంధన పన్ను ద్వారా రై 3.7 లక్షల కోట్లు వసూలు చేసిందని, ఇదంతా ఎక్కడికి పోతోందని నిలదీశారు. ట్యాపింగ్ వ్యవహారాలకు దీనిని వాడుకుంటున్నారనే అనుమానాలు బలోపేతం అవుతాయని తెలిపారు. దేశంలో వ్యాక్సిన్లు దొరకడం లేదు. అయితే నిఘా దండిగా ఉంటోంది. మోడీజి మొత్తానికి దీనిని నిఘారాజ్యం చేయాలనుకుంటున్నట్లుగా ఉందన్నారు. జడ్జిల ఫోన్లు, నేతల ఫోన్లు, నిబద్ధతతో పనిచేసిన అధికారుల ఫోన్లు, జర్నలిస్టుల కదలికలపై పర్యవేక్షణ, వారి డాటాల తనిఖీలు జరిగినట్లు తేలిందని, వ్యక్తిగత ప్రయోజనాలకోసం మోడీ ఇంతటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రజలు స్వేచ్ఛ, ప్రగతి, ఆరోగ్యం, విద్య ఉద్యోగాలు కోరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం హింస, విభజన రేఖల రాజకీయాలు, ఘర్షణలు, అపనమ్మక కల్పనలతో ముందుకు సాగాలనుకుంటోందని అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదన్నారు.

Mamata lashed out at modi govt over pegasus scandal