Home కుమ్రం భీం ఆసిఫాబాద్ అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

Suicide

వాంకిడి : నలుగురిలో తన భార్య గురించి వేరే వారు అసభ్యంగా మాట్లాడడాన్ని తట్టుకోలేక రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వాంకిడి మండలంలోని కనర్‌గాం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్దానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కనర్‌గాం గ్రామానికి చెందిన జెండారే రమేష్ (36) గ్రామంలోని బంధువుల ఇంటికి పుట్టువెంట్రుకలు శుభకార్యానికి వెళ్లాడు.

స్థానిక గ్రామస్థ్దులందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తుండగా రమేష్ భార్య గురించి మండోరే అరుణ్ తీవ్ర పదజాలంతో అసభ్యంగా మాట్లాడడంతో రమేష్ అవమానం భరించలేక తన పశువుల కొట్టంలో గురువారం రాత్రి ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వైద్యులు ప్రథమ చికిత్స చేసి రమేష్‌ను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ రెఫర్ చేశారు. తెల్లవారుజామునా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.