Home ఆఫ్ బీట్ కష్టమైనా ఇష్టంతో చేస్తున్నం

కష్టమైనా ఇష్టంతో చేస్తున్నం

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, పేర్వారం రాములు గారితో మన తెలంగాణతో పంచుకున్న అభిప్రాయాలు.

                     Ramulu

ఈ 2016,17 లో మేం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పని చేపట్టాం. రాష్ట్రం విడిపోకముందు ఏ సంవత్సరం కూడా సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో నూట ముప్ఫై కోట్లకు మించి ఎప్పుడూ ఖర్చు చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రెండు వందల కోట్లు ఇస్తున్నారు. దాంట్లో వంద కోట్లు మహబూబ్ నగర్ జిల్లాలో ఎకో టూరిజమ్, ఇంకో వంద కోట్లు వరంగల్ జిలా ట్రైబల్ టూరిజమ్ కోసం ఖర్చు పెడుతున్నాం. పదహారు కోట్లు ఖమ్మం జిల్లా కిన్నెరసానిలో ముఖ్యమంత్రి గారు ఎకో టూరిజమ్ కింద కాటేజిలు, బోట్లు ఏర్పాటు చేయిస్తున్నారు.

ఇది కాక మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో కొన్ని ఎక్కువమంది గ్రామాలవారు కులాల వారీగా కొన్ని జాతరలు, కొమరెల్లి, ఐనవోలు, కొరవి, బిజిగిరి షరీఫ్ ,ఇల్లెందుకుంట ఇటువంటి ఇరవై ప్రదేశాలలో మూడొందల కోట్లు పెట్టి హోటల్స్ కడుతున్నాం. ఆరు ఎయిర్ కండిషనర్ గదులు, నాలుగు నాన్ ఏసి రూమ్స్, హోటల్స్, వంటవాళ్లు. ఇప్పుడు కొరవి ఉందనుకోండి. అది అడవిలా ఉంటుంది. ఖమ్మం బార్డర్‌లో. అక్కడికి పోయినవాల్లు వెనక్కి రావాలి. వరంగల్ అన్నా పోవాలి, ఖమ్మం అన్నా పోవాలి. ఎందుకంటే మహబూబాబాద్‌లో ఏమీ లేదు. దూరంగా విసిరేసినట్టున్నయ్ కాని అవే గ్రామీణ ప్రాంతాల వారిని విశేషంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి.. ఇవి దేవాలయాలు, మసీదుల పట్ల మేం చేపట్టిన కార్యక్రమాలు.్ర

గ్రామాల కోసం టూరిజం చేసే ప్రయత్నాలేంటి?

తెలంగాణ ప్రభుత్వం కె సి ఆర్ గారు పాత ముప్పై మూడు వేల చెరువులను పునరుద్ధరిస్తున్నారు. దీంట్లో ఒక వంద చెరువులను ఎంచుకుని చెరువు కట్ట మీద అక్కడ గెస్ట్‌హౌస్‌లు, బోట్లు, చిన్న గ్రంధాలయం అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దానితో ఊళ్లో ఉన్న గ్రామీణ యువతకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, యువతీయువకులకు బోటింగ్, వాటర్ స్పోర్ట్. దానితో మానసిక ఉల్లాసం. అక్కడి వాళ్లే కాదు, బయటివాళ్లు కూడా రావచ్చు. మావన్నీ ఆన్‌లైన్ బుకింగ్‌లు కంప్యూటర్‌లో. న్యూయార్క్‌లో ఉండి వికారాబాద్ హరిత హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. నేను వెళ్లినా కూడా లక్నవరంలో బయట మీటింగ్ పెట్టాను.

ఆన్‌లైన్ బుకింగ్ వలన ఖాళీ లేదు. ఇంకో విశేషం ఏంటంటే, మా హరిత హోటల్స్‌లో భోజనం బావుంటుంది. స్టార్ హోటళ్ల వాళ్లు కూడా ఆహారాన్ని ఫ్రిజ్‌లలో దాచి పెడతారు. కాని మాది ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎప్పటికప్పుడు తాజా ఆహారం ఉంటుంది.తెలంగాణ టూరిజం ప్రత్యేకం అయ్యాక టూరిస్టులు పెరిగారంటారా?గత మూడు నెలల నుంచి మాకు టూరిస్టుల తాకిడి ఎక్కువైంది. వికారాబాద్, గోల్కొండ లైవ్ షో, లక్నవరం, రామప్ప. మూడింతలు పెరిగారు టూరిస్టులు. సౌకర్యాలతో పాటు అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఏంటీ తెలంగాణ? కొత్తరాష్ట్రం అట, కొత్తగా ఉందట అని వస్తున్నారు.కొత్తగా చేపట్టిన టూరిజం కార్యక్రమాలేంటి?ఇటు ఖమ్మం, అటు గోదావరి జిల్లా.

ఇప్పుడు మేం కొత్తగా సోమశిలలో మొదలు పెట్టాం. మా దగ్గర శ్రీశైలం నుంచి జెట్‌ప్రోల్ వరకు, వయా సోమశిల 90 కిలోమీటర్లు పొడవుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ సరస్సుంది. ఒక్కోచోట ఆరు కిలోమీటర్ల వెడల్పుంది. బ్రహ్మాండమైన సరస్సు అది. ప్రపంచంలో అత్యద్భుత సరస్సుల్లో ఒకటి. అటు మహబూబ్ నగర్‌ఆత్మకూరు తాలూకా కొండలు, ఇటు నల్లమల్ల ఫారెస్ట్. ఆదివాసీలు. చాలా బావుంటుంది. మొన్న లాంచ్ చేశాము. ఇప్పుడు చాలా బాగా నడుస్తోంది. బోటిక్కి హాయిగా విహార యాత్రలు చేసి వస్తున్నారు. ఇన్ని రోజులు పర్యాటకులకు తెలియదు. ఇప్పుడు తెలిసి వస్తున్నారు.అన్నీ మళ్లీ కొత్తగా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం కష్టంగా ఉందంటారా?కొత్తరాష్ట్రం కాబట్టి కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది మాకు.కొత్తగా సంసారం పెడితే ఇష్టంగానే ఉంటుంది కదా.

తెలంగాణ టూరిజంతో యువతకు ఉపాధి అవకాశాలు ఎంతవరకు పెరిగాయి?

యునెస్కో స్టడీ ప్రకారం ఇండస్ట్రీ పెడితే ఒక కోటి రూపాయలకు ఆరు ఉద్యోగాలు ఇవ్వచ్చు. వ్యవసాయంలో ఒక కోటి ఖర్చు పెడితే మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అయితే టూరిజంలో పద్ధెనిమిది ఉద్యోగాలు వస్తాయి. మన దగ్గర అందరూ ఉంటారు. ఎలక్ట్రీషిన్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్, చాకలి, మంగలి, మాలిష్ చేసేటోళ్లు, పెయింటర్స్, బిల్డింగులు కట్టేవాళ్లు, బస్ డ్రైవర్లు, గైడ్లు, చరిత్రకారులు, చిత్రలేఖనం చేసేవాళ్లు, శిల్పులు, ఇలా సమగ్రాభివృద్ధి జరుగుతుంది.

తెలంగాణలో తెలియని ఎన్నో గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ప్రజలు మీ దృష్టికి తెస్తుంటారా?

ప్రజలు విస్ఫోటనం లాగా వస్తున్నారు. రామగడ ఖిలా నుంచి పదిమంది వచ్చారు. ఇక్కడ ఘట్ కేసర్ దగ్గర రంగథాముని గుడి ఉందట. అక్కడొక చెరువుంది. అది కలుషితమైంది. అది చాలా పురాతనమైంది అని. ఇక, జనగాం దగ్గర జీడికల్లు వాళ్లు వచ్చి అరె! మీరు జీడికల్లు నిర్లక్ష్యం చేస్తున్నారేంటండి? రాములవారు జింకను చంపింది ఇక్కడే. యాదగిరి గుట్టకు ఇంత ప్రాచుర్యం వచ్చింది కాని, వందేళ్ల కిందట యాదగిరి గుట్ట అర్చకుడికి జీడికల్లు నుంచి నుంచే నెలకింత డబ్బులు ఇచ్చేవాళ్లం. అటువంటిది దీన్ని వదిలేశారు. యాదగిరి గుట్ట పెరిగింది. ఇదేంటి అన్యాయం అంటారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు. ఎన్నని పెడతాం? క్రమేపి మనల్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ రావడం వల్లనే ఇది సాధ్యం అయింది.