Home తాజా వార్తలు పవర్ పారదర్శకం

పవర్ పారదర్శకం

POwer

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల నిర్వహణ, కొనుగోళ్ల వ్యవహారమంతా పారదర్శకంగా జరుగుతోందని, ఇందు లో ఎటువంటి అక్రమాలకు తావులేదని టిఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఈ విషయంలో అవసరమైతే సిబిఐ, సిట్టింగ్ జడ్జి సహా ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని కుండబద్దలు కొట్టారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని బిజెపి నేతలు చేసిన ఆరోపణల నేపధ్యంలో శుక్రవారం విద్యుత్ సౌధలో టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి గౌరవరం రఘుమారెడ్డి, టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాలరావు, ట్రాన్స్‌కో జెఎండి శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ గటిక విజయ్ కుమార్‌లతో కలిసి ప్రభాకరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత విద్యుత్ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసని ప్రభాకరరావు అన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన సమయంలో కొన్ని ఒడిదొడుకులు సహజంగా ఉంటాయని, అయినా 3600 మెగావాట్ల సోలార్ విద్యుత్‌తో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు.

7778 మెగావాట్ల నుంచి 16200 మెగావాట్ల స్థాయికి ఉత్పత్తి సామర్థాన్ని పెంచుకున్నామని వివరించారు. 800 మెగావాట్ల సామర్థంతో కొత్తగూడెం థర్మల్ ప్లాంట్‌ను తెలంగాణ వచ్చాకే ప్రారంభించామని, 48 నెలల్లోనే పూర్తిచేసి, కమిషన్ చేసిన ఘనత సాధించామన్నారు. నార్త్, సౌత్ గ్రిడ్‌ల మధ్య అనుసంధానం కావడంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌దే కీలకపాత్ర అని, ప్రతి నిత్యం పవర్‌గ్రిడ్ అధికారులతో, మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ, పనులను పర్యవేక్షించడం మూలంగా వేగం పెరిగి, నేడు గ్రిడ్‌ల అనుసంధానం జరిగిందని పేర్కొన్నారు. పిపిఏలు రాత్రికి రాత్రే ఎవరూ చేసుకోలేదని, ఇటీవల తమ పనితీరుపై పిఎఫ్‌సి చైర్మన్ రాజీవ్‌శర్మ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పారదర్శకంగా ఒకేఒక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని, పారదర్శకంగా రూ. 4.15 పైసలుకు ఒక యూనిట్ చొప్పున చేశామన్నారు. రూ.3.90తో ఒక యూనిట్ చొప్పున చత్తీస్‌గఢ్ విద్యుత్ తీసుకుంటున్నామన్నారు.
ప్రలోభాలు లేవు…
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలన్నీ స్వతంత్రంగా, స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయని, తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని అన్నారు. దేశంలో థర్మల్ ప్లాంట్లలో 90 శాతం వరకు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మన విద్యుత్ సంస్థలకు ప్రశంసలు వస్తున్నాయని, నిన్ననే సరళ్‌లో రెండో ర్యాంకు వచ్చిందని పేర్కొన్నారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సి) నిబంధన గుదిబండగా మారిందని, దీనిపై అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అయినా కేంద్రం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోందన్నారు.
24 గంటలు నాణ్యమైన సరఫరాకే ప్రాధాన్యం..
నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయడమే లక్షంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయని ప్రభాకరరావు అన్నారు. వ్యవసాయానికి, ఎత్తిపోతల పథకాలకు కూడా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఎల్‌సిల సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం రెండు రోజుల క్రితమే రూ.1200 కోట్లు అదనంగా ఇచ్చిందని వివరించారు. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య ఉన్న సమస్యలను చర్చించుకోవడానికి సామరస్యపూర్వకమైన వాతావరణం ఏర్పడిందన్నారు. చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రం కావడంతో లెక్కలపై స్పష్టత కోసం కొంత వేచిచూసామని, వచ్చే నవంబరులో విద్యుత్ సంస్థల వార్షియ ఆదాయ, వ్యయ అంచనాలను రెగ్యులేటరీ కమిషన్ (టిఎస్ ఈఆర్‌సి)కి అందజేస్తామని స్పష్టం చేశారు.

Management of Telangana Power Companies