Home లైఫ్ స్టైల్ బరువు దించారు

బరువు దించారు

School-Bags

బడులు తెరిచారు…బండెడు పుస్తకాలు భుజాన వేసుకొని భారంగా వెళ్లే విద్యార్థులను చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. అంతమాత్రాన వాళ్లకు ఒరిగేదేమీ లేదుకదా! ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టి, ఆచరణలోకి తెచ్చేలా చేసిన కేరళలోని ఓ ఉపాధ్యాయుని చొరవను అభినందించాల్సిందే…
కేరళలోని కట్టంపల్లిలోని జిఎమ్ అప్పర్ ప్రైమరీ స్కూలు స్కూలు బ్యాగులు మోయాల్సిన అవస్థ నుంచి విముక్తులను చేసింది. 300 మంది పిల్లలున్న ఈ పాఠశాలలో పిల్లలు స్కూలు బ్యాగులను వారి ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం, మళ్లీ బడి తర్వాత బ్యాగులను ఇంటి దగ్గర వదిలేయడం లాంటి పనులకు ఏకంగా ఓ వాహనాన్ని ఏర్పాటుచేసింది. ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. 2016లో ప్రారంభించిన ఈ ప్రయోగం వెనుక మరో కారణం కూడా ఉంది. పిల్లల ఆర్యోగంపై శ్రద్ధ కనబర్చేలా చేయడం. అంటే వారు బడికి వచ్చేటపుడు వాహనాలపై ఆధార పడకుండా నడిచి వచ్చేలా చేయడం. నడక విలువ వారికి నేర్పించడం. ఈ ప్రయత్నం వెనుక ఎన్.ఎమ్. రవి అనే ఉపాధ్యాయుడి చొరవ ఉంది. చాలా మంది పిల్లలు తమ పుస్తకాల సంచుల బరువును మోయలేక పోవడాన్ని గమనించాడు రవి. డబ్బులు స్కూలు బస్సులో వచ్చే స్థోమత లేని వారు ఎక్కువమంది. దీంతో పెద్ద పెద్ద పుస్తకాలున్న బ్యాగులను వీపునకు వేలాడ దీసుకుంటూ…భారంగా నడుచుకుంటూ వచ్చేవారు. దీనివల్ల కొంతమంది పిల్లలు స్కూలు సమయాన్ని కూడా పాటించలేకపోయేవారు. ఒక్కోసారి బడికి రాలేకపోయేవారు. ఇలాంటి పరిస్థితిని చూసి వాళ్ల బ్యాగులను మోయడానికి ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటుచేయాలనే ఆలోచన వచ్చిందంటు న్నాడు రవి. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లల స్కూలు బ్యాగులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అధిక బరువుతో ఉన్న పుస్తకాల సంచులను మోయడం వల్ల వాళ్ల వీపులపై ఒత్తిడి ఏర్పడి అనార్యోగానికి గురవుతున్నట్లు గమనించింది. పుస్తకాల బ్యాగుల బరువును తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. 1 నుంచి 8 వ తరగతి వరకు ఉన్న పుస్తకాల బ్యాగులు 1, 800గ్రాముల నుంచి 3,425 గ్రాముల బరువుండాలని సూచించింది.