Home కరీంనగర్ మానేరు జలాశయానికి కోటి 50 లక్షలు

మానేరు జలాశయానికి కోటి 50 లక్షలు

Manair reservoir

 

కరీంనగర్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని మానేరు జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆ నిధులతో రెండు జెట్ స్కీ బోట్లు, ఒక స్పీడ్ బోటు, ఒక క్యూజ్ ను జపాన్ నుంచి తెప్పించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం మానేరు జలాశయంలో జెట్ కం పార్టీ బోటును మంత్రి ప్రారంభించారు.

అనంతరం జెట్‌బోట్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావులతో జలాశయంలో కొంత దూరం బోటును నడిపించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మానేరు జలాశయాన్ని సందర్శించే పర్యాటకుల కోసం మానేరులో విహరించేందుకు కొత్తగా జెట్ కం పార్టీ బోటును తెచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీం‘నగరం’కు ఆనుకుని 24 టిఎంసిల నీటితో లోయర్ మానేరు డ్యాం ఉందని అన్నారు. గతంలో జలాశయంలో నీళ్లు తక్కువగా ఉండడంతో పాటు కలుషితమయ్యేవని, బట్టలు ఉతికేవారని తెలిపారు.

ఇప్పుడు కొత్తగా జెట్ కం పార్టీ బోటు చేరిందని, మరొక ఎసి క్రూజ్ బోట్ రావలసి ఉందని అన్నారు. కొత్తగా తెచ్చిన జెట్ కం పార్టీ బోటులో పార్టీ చేసుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. నీటిలో ప్రయాణిస్తూ బర్త్‌డే పార్టీ, మ్యారేజ్ డే పార్టీ లాంటి చిన్న చిన్న పార్టీలు కుటుంబ సభ్యులు, బందు మిత్రులతో జరుపుకోవచ్చని, ఇది సందర్శకులకు ఒక మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని అన్నారు. వర్షాకాలంలో బోట్‌కు పైన టాపు ఉంటుందని, వేసవిలో టాపు తీసివేస్తారని చెప్పారు.

ఇంతకు ముందు పర్యాటకం కోసం లక్కవరం, పాపికొండలు, పాకాల లాంటి ప్రదేశాలకు సందర్శకులు వెళ్లేవారని, మానేరు జలాశయంలో ప్రవేశపెట్టిన జెట్ కం పార్టీ బోటుతో సందర్శకులు ఎక్కువగా మానేరు జలాశయాన్ని సందర్శించే వీలు ఏర్పడిందని తెలిపారు. మానేరు వెనుక భాగంలో బోట్ల విహారం, కెసిఆర్ ఐలాండ్ ఉండగా, ముందు భాగంలో తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ ఉంటాయని, ఇవన్నీ త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం మానేరు జలాశయంలో 16.5 టిఎంసిల నీరు చేరి నిండు కుండలా మారిందని, సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వచ్చి మానేరు జలాశయం అందాలను ఆస్వాదించడంతో పాటు బోటు షికారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, రాష్ట్ర టూరిజం శాఖ ఛైర్మన్ భూపతిరెడ్డి, సుడా ఛైర్మన్ జి.వి.రామకృష్ణారావు, గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్‌లాల్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్‌కుమార్, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Manair reservoir as a Tourist destination