Home Default మహిళకు ‘మాతోట’ అండ

మహిళకు ‘మాతోట’ అండ

గిరిజనులకు సుస్థిరమైన జీవనాధారం కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసం కల్గించి, వారి బంజరు భూముల్లో బంగారం పండించడానికి దారి చూపిన కార్యక్రమం ‘వాడి’ (మాతోట). ఈ పథకం అమలు వెనుక మహిళల కృషి, ఐకమత్యం ఉంది. వారందరినీ మాతోట అభివృద్ధి కమిటీలో భాగస్వాములను చేయడం వల్ల బీడు నేలలు సస్యశ్యామలం అవుతున్నాయి. డవ్ స్వచ్ఛంద సంస్థ్ధ, నాబార్డు సాయంతో రంగారెడ్డి జిల్లా పెద్దెముల్ మండలంలోని నాలుగు తండాలకు చెందిన గిరిజనులతో మాతోట పథకం అమలు చేయించడం వల్ల గిరిజన మహిళలు తమ అభివృద్ధిని తామే సాధించుకునే క్రమం అభినందనీయం..

Kavitha-Mango-Farm

మన దేశంలో గిరిజనులు ఎక్కువగా మాట్లాడే గోండు భాషలో వాడి అంటే తోట. గుజరాత్ గిరిజన ప్రాంతాల్లో గిరిజన రైతులచే తొలిసారిగా ఉసిరి మామిడి తోటలను పండించి, వారి బతుకులను మార్చే చిరుప్రయత్నమే నాబార్డు ‘వాడి’ కార్యక్రమం. వాడిని తెలుగులో ‘తోట’ అంటాం కాబట్టి ఈ కార్యక్రమం ‘మాతోట’గా మారింది.

ఈ ప్రాజెక్టులో ఎలా చేరాలి?
ఐటిడిఎ అధికారుల సాయంతో గ్రామాలు సర్వే చేసి తోటల పెంపకానికి అనువైన భూములను ఎంపిక చేసి, టైటిల్ డీడ్ ఉన్న గిరిజన రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ కార్యక్రమం అంతా పారదర్శకంగా ‘మాతోట’ లబ్ధిదారులచే ఏర్పాటు చేసిన గ్రామ అభివృద్ధి కమిటీల ద్వారా జరుగుతుంది. ఈ కమిటీలకు సంస్థాగత రూపం ఇవ్వడానికి వాటిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రతీ గిరిజన కుటుంబం ఎకరా భూమిలో పండ్ల తోటలు పెంచాలి. ఎంపిక చేసిన గిరిజన రైతులకు పండ్ల మొక్కలను ఉచితంగా ఇవ్వడమే కాక, కంపోస్టు ఎరువుల వాడకం నుంచి మొక్కలకు నీరు పెట్టడం, యాజమాన్య పద్ధతుల్లో పాటించవలసిన జాగ్రత్తలను తెలియచేస్తూ బ్యాంకులు, రైతులు, ఎన్జీఓలు, వ్యవసాయ అధికారులు, ఇతర సాంకేతిక నిపుణుల సాయంతో ‘మాతోట’ను మనతోటగా తీర్చిదిద్దుతున్నారు. ఎకరం పొలంలో పండ్ల తోటల పెంపకం కోసం ప్రతి గిరిజన కుటుంబానికి నాబార్డు సుమారు రూ.40వేలు పెట్టుబడి పెడుతోంది.

నిపుణుల సాయం
గిరిజననులందరికీ పొలంలో మొక్కలు నాటేందుకు, గోతులు తీసేందుకు మార్కింగ్ ఇవ్వడం, గోతుల్లో కలుపుటకు వర్మి కంపోస్టు, వేపపిండి పంపిణీ లో స్వచ్ఛంద సంస్థలు గిరిజనులకు సహకరిస్తున్నారు. వీరి భూమిని మూడు భాగాలుగా విభజించి 50 శాతం మామిడి, 40 శాతం ఉసిరి, జీడి, జామ, సపోటా వంటి మొక్కలు, 10 శాతం సరిహద్దులో టేకు, అల్లనేరేడు, దానిమ్మ వంటి మొక్కలు వేస్తున్నారు. మొక్కల ఎదుగుదలకు అవసరమైన సేంద్రియ ఎరువులు, సాగు నీటి సౌకర్యాలను కల్పించారు. నీరు తక్కువగా ఉన్నచోట డ్రిప్ ఇరిగేషన్‌తో సాగు చేయిస్తున్నారు. ప్రతీ రైతుకు యాభై కిలోల బయో కంపోస్టును సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ నిపుణులతో సదస్సులు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎక్కువగా పత్తిపంటలు పండిస్తున్నారు. వీటివల్ల ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఆ పంటలకు వాడే రసాయన ఎరువుల వల్ల భూసారం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇదే విషయాన్ని గిరిజనులకు నచ్చ చెప్పి పండ్ల తోటల పెంపకం పట్ల ఆసక్తి కలిగిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం లేని చోట చేతి పంపులను ఏర్పాటు చేయడం, ఉన్న చోట నీటి పంపు మోటార్లను పంపిణీ చేస్తున్నారు. నీటివనరుల పెంచుకోవడానికి పరుగెత్తే నీటిని మెల్లగా పారే విధంగా చేస్తూ, మెల్లగా పారే నీటిని నిల్వ ఉండేలా చేస్తున్నారు. ఆపై నిల్వ ఉన్న నీటిని భూమిలోకి ఇంకే విధంగా చేస్తున్నారు.

సాగులో జీవనోపాధి ఎలా…
మామిడి మొక్కల నుంచి ఆదాయం రావడానికి ఏడేళ్లు పడుతుంది. రోజూ కూలికి పోతేగానీ కడుపు నిండని గిరిజనులు తోటల సాగులో ఇంత కాలం నిమగ్నం కాగలరా? అందుకే రైతుల కనీస అవసరాలు తీరడానికి తోటల్లో అంతరపంటలుగా రాగులు, మినుములు, వేరుశనగ, కూరగాయలు పండిస్తున్నారు. వీటి వల్ల కనీస అవసరాలు తీరడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గిరజన రైతులు ఆదాయం కూడా పొందుతున్నారు.

మారిన గిరిజన బతుకులు

  • గిరిజనులకు సొంత భూములను నిర్వహించుకోగల సామర్ధ్యం పెరిగింది. పండ్లతోటల పెంపకంలో నైపుణ్యాలు తెలిశాయి.
  • గిరిజనుల మధ్య ఐక్యత పెరిగి, కలిసి పనిచేస్తే ఏదైనా సాధించగలమనే నమ్మకం కలిగింది. వ్యక్తిగత భద్రత,ఆదాయ భద్రత పెరిగింది
  • గిరిజన మహిళలు ఆదాయంలో కొంత మిగిల్చి పొదుపు చేస్తున్నారు. ఆహారం కోసం అడవుల వెంట వెతుకులాడే శ్రమ తగ్గింది. నిశ్చింతగా పనులు చేసుకుంటున్నారు. మగవారిలో మహిళాశక్తిని గుర్తించే మార్పు కలిగింది.
  • సేంద్రియ ఎరువుల వల్ల భూసారం కాపాడుకోవచ్చని రైతులు తెలుసుకున్నారు.కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఆదాయం వస్తుందని పత్తిపంటలకు ప్రాధాన్యమిచ్చేవారు.
  • రంగారెడ్డి జిల్లాలో గిరిజన మహిళలు పనికి ఆహారపథకంలో పనులకు పోయేవారు. ఆ పని లేనపుడు దగ్గరలోని పట్టణాలకు వలస పోయి భవన నిర్మాణ పనులు చేసేవారు. మాతోట పథకం మొదలయ్యాక వలసలు తగ్గాయి. వారి బీడు నేలలను సాగుకు అనువుగా మార్చుకొని పండ్లతోటలు పెంచుతూ ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.
  • దార్నవాగు, తట్టేపల్లి, ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు జీవనోపాధుల కోసం రుణాలు ఇవ్వడంతో 104 కుటుంబాలు స్వయం ఉపాధితో, సుస్థిర ఆదాయం పొందుతూ బతుకుతున్నారు.
  • పెద్దెముల్ మండలంలో మాతోట ప్రాజెక్టు మొదలయ్యాక గిరిజనుల బీడుభూములు సాగుభూములుగా మారి భూముల ధరలుపెరిగాయి. ఈ ప్రాంతంలో సాగు విస్తీర్ణం కూడా గతంలో కంటే పెరిగింది.
  • గిరిజనులు మాతోటలో అంతరపంటలు, మామిడి పండ్లు దిగుబడితో ఆర్థికంగా కుదుటపడటంతో వివాహాలు, పండుగలు వంటి శుభకార్యాలను గతంలో కంటే ఘనంగా జరుపుకుంటున్నారు. వీరి సాంస్కృతిక ఆచారాలు కూడా కాపాడుకుంటూ వ్యవసాయంలో మమేకం అవుతున్నారు.

అడవిని దున్నాం
మా నలుగురు కుటుంబ సభ్యులకు 4 ఎకరాలు ఉంది కానీ, అడవిలో ఉండటం వల్ల సాగుకు యోగ్యంగా లేదు. డవ్, నాబార్డ్ సారులు మా భూమిని చూసి దానిలో పండ్లతో టలు పెంచేలా శిక్షణ ఇచ్చారు. మామిడి మొక్కల మధ్య అంతర పంటలుగా ెనగ, పాలకూర, ఉల్లి పండిస్తూ ఎకరా నికి రూ. 30 వేల ఆదాయం పొందుతున్నాం. నాబార్డు ఇచ్చిన రూ. 15 వేలు రుణంతో పిండిగిర్ని పెట్టుకుని రూ. 100 నుండి 250 వరకు అదనపు ఆదాయం పొందుతున్నాం. మాతోట ప్రాజెక్టు మా జీవితాలను మార్చింది. ఆర్థికంగా నిలదొక్కుకున్నాం.”

– సక్కుభాయి,
ధార్నవాగు తండా,పెద్దెముల్ మండల్

అంతర పంటలపై ఆదాయం

మా కుటుంబానికి ఉన్న బంజరు నేలలో నీటి వసతి లేక పంటలు వేయలేదు. 2015లో డవ్ సంస్థ మాతో పండ్ల తోటల పెంచడంలో శిక్షణ ఇచ్చింది. ఎకరానికి 49 మామిడి, 33 సపోట మొక్కలు మాకు ఇచ్చి నాటించారు. అంతర పంటగా జొన్నలు పండిస్తున్నాం. ఏడాదికి రూ. 25 వేలు ఆదాయం వస్తుంది. బోర్, మోటారుకి కూడా నాబార్డు సాయం చేయడంతో సాగునీటికి లోటులేకుండా ఉన్నది.”

– రాణీభాయి, ధార్నవాగు తండా,
పెద్దెముల్ మండల్

పైప్ లైన్లు ఇచ్చారు

మాతోట వల్ల ఆత్మ విశ్వాసం పెరిగింది. రాళ్లు రప్పలతో ఉండే మా బీడు భూములకు సాగు కళ వచ్చింది. మామిడి తోటల మధ్య అంతరపంటలతో ఆదాయం పొందుతున్నాం. జీడిమామిడి చెట్లు కూడా పెంచుతున్నాం. వంకాయలు, చిక్కుడు పండిస్తూ ఆదాయం పొందుతున్నాం. పిల్లలను చదివిస్తున్నాం. సర్కారు సాయంతో పైప్‌లైన్స్ వేసుకొని మొక్కలకు నీళ్లు పెట్టుకుంటున్నాం.

– కవిత, దానిభాయి,
తట్టేపల్లి, పెద్దెముల్ మండల్

– శ్యాంమోహన్,
సెల్ : 9440595858